రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడిందని ఎలా గుర్తించాలి..?
సాక్షి లైఫ్ : మన శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు ఎంతబాగుంటే అంత ఆరోగ్యాంగా ఉండొచ్చు. అంతేకాదు అంటు వ్యాధులు, ఇతర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు కూడా. అయితే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. అటువంటి వాటిలో తగిన పోషకాహారం తీసుకోకపోవడం కూడా ఒకటి. అసలు రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడిందని ఎలా గుర్తించాలి..? ఆ లక్షణాలు ఎలా ఉంటాయి..?
రోగకారక సూక్ష్మజీవులు..
బ్యాక్టీరియా వైరస్‌ల కారణంగా అనేక జబ్బులు వస్తాయనే విషయం తెలిసిందే. అయితే వీటి నుంచి కాపాడేందుకు శరీరంలో చాలా ఏర్పాట్లే ఉన్నాయి. శరీరంలోకి చొచ్చుకొచ్చిన రోగకారక సూక్ష్మజీవులను గుర్తించడం మొదలుకొని వాటిని నాశనం చేసే వరకూ అన్ని రకాల చర్యలు రోగ నిరోధక వ్యవస్థ తీసుకుంటుంది.
ఇందుకోసం ఇందులో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. రోగ నిరోధక శక్తి తగ్గితే అనేక రుగ్మతల బారిన పడాల్సి వస్తుంది. అంతేకాదు ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వివిధ పరిశోధనల్లో సైతం వెల్లడైంది.
ఇమ్యూనిటీ తగ్గితే..
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంది. ఏ పనిచేయాలన్నా నీరసంగా ఉంటుంది. చాలా నీరసంగా ఉండడంవల్ల బద్దకం పెరుగుతుంది. ఉత్సాహం తగ్గుతుంది. తరచూ ఆరోగ్య సమస్యల బారిన పడుతూంటాం.
ఒత్తిడి కూడా అధికం..
అలాగే తరచూ దగ్గు, జలుబు, జ్వరం, ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. అలాగే తరచూ జీర్ణ సమస్యలు వస్తుంటాయి. గాయాలు అంత త్వరగా మానుతాయి. గాయాలు, పుండ్లు మానేందుకు చాలా సమయం పడుతుంది. ఈ లక్షణాలన్నిటినీ బట్టి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని గమనించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
