మనస్సుపై రంగుల ప్రభావం ఎంతగా ఉంటుందంటే..?    

సాక్షి లైఫ్: ప్రపంచంలో నలుపు, తెలుపు  రంగులు మాత్రమే ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అబ్బే... చాలా ఇబ్బందిగా ఉంటుందంటున్నారా? నిజమే. ఇన్ని రంగులు ఉన్నాయి కాబట్టే మనం ఈ ప్రపంచాన్ని ఆస్వాదించగలుగుతున్నాం. ఉదయానే సూరీడి నారింజ రంగు శరీరాన్ని చైతన్యవంతం చేస్తుంది. సాయంకాలపు ఆకాశ నీలాలు ఆహ్లాదం పంచుతాయి... జాబిల్లి వెదజల్లే తెల్లదనం మనసుకు ఆనందం కలిగిస్తూంటుంది. ఇలా సృష్టిలోని ప్రతి రంగుకూ ఓ ప్రత్యేకత ఉంది.. అర్థం పరమార్థం ఉన్నాయి. మనస్సుపై కూడా ఈ రంగుల ప్రభావం ఉంటుందని తెలుసా..? కలర్స్ ఎఫెక్ట్ తప్పకుండా మనస్సుపై ఉంటుందని మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు. 

ఒక్కో రంగు.. ఒక్కో భావోద్వేగాన్ని పలికిస్తుంది. ఒక్కో రంగు.. ఒక్కోలా మనుషులతో మమేకమై పోతుంది. మన నిత్య జీవితంలో మన చుట్టూనే ఉంటూ మనకి తెలియకుండా మనపై అత్యంత ప్రభావాన్ని చూపించేవి కలర్స్. ఎన్నో వేల ఏళ్ల క్రితమే సృష్టిలో ఉన్న అనేక రంగులు మానవుడిపై ప్రభావం చూపిస్తాయని తెలుసుకున్నారు.ర‌క‌ర‌కాల రంగులు మ‌న నిత్యజీవితంలో భాగ‌మ‌య్యాయి. అన్ని ర‌కాల రంగులు మ‌న రంగును ఇట్టే ప‌ట్టేస్తాయి. మ‌న రంగేంటో బ‌య‌ట‌పెడ‌తాయి. 

 తెలుపు రంగు.. 

ఈ రంగును తరచూ వెలుతురుకు, భద్రతకు, పరిశుభ్ర తకు ప్రతీకగా ఉపయోగిస్తారు. మంచితనం, నిర్దోషత్వం, స్వచ్ఛత వంటి లక్షణాలను సూచించడానికి కూడా వాడతారు. నారింజ రంగు.. మ‌న‌లో మానసిక సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. ఈ రంగు మ‌న‌లో పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది. 

పసుపు రంగు.. 

మెదడు విడుదల చేసే సెరోటోనిన్ అనే కెమికల్‌ మనల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు..మన జీర్ణవ్యవస్థ బాగుపడేందుకు కూడా ఈ రంగు తోడ్పడుతుంది. 

ఎరుపు రంగు.. 

అన్ని రంగుల్లోకెల్లా స్పష్టంగా కనిపిస్తుంది. భావోద్వేగాల మీద ఎరుపు రంగు చూపించే ప్రభావం చాలా ఎక్కువ. మనుషుల్లో జీవక్రియను, శ్వాసవేగాన్ని, రక్తపోటును పెంచుతుంది. పచ్చ రంగు.. ఇది ఎరుపు రంగుకు వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. జీవక్రియ వేగాన్ని తగ్గిస్తుంది. ప్రశాంతతను తీసుకువస్తుంది.

 ఆకుప‌చ్చ రంగు.. 

ప్రకృతికి చిహ్నం ఈ రంగు. మీ దృష్టికోణాన్ని మార్చే రంగు కూడా. ఆఫీసులో మీకు ప్రశాంతంగా అనిపించకపోతే ఈ రంగు చుట్టు పక్కల ఉండేలా చూసుకోండి. దీనివల్ల చేసే పనిలో సంతృప్తి చెందడమే కాదు, ఒత్తిడి కూడా మాయమవుతుంది. 

నలుపు రంగు.. 

మనలోని శక్తి, అధికారాన్ని నిద్ర లేపుతుంది. ఎవ్వరినైనా అందంగా చూపించడంలో మొదటిస్థానం కూడా ఈ రంగుకే దక్కుతుంది. 

నీలం రంగు..

మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. అలాగే ఆకలిని తగ్గించే పనిలో కూడా ఈ రంగు ముందుంటుంది. 

గులాబీ రంగు..

ఒత్తిడిని, ఆతృతను తగ్గించే రంగుగా దీనికి పేరుంది. పైగా ఆడవాళ్లకు బాగా నచ్చే రంగు. కోపంలో ఉన్నప్పుడు ఈ రంగును ఒక్కసారి చూస్తే చాలు.. కోపం పటాపంచలవుతుంది. మ‌నం నివసించే ఇంటికి వేసే రంగులు మన‌ ప్రవర్తన, ఆలోచనాస‌ర‌ళి, భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయని చైనా వాస్తుశాస్త్రం ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

 ఇంటికి మనం వాడే రంగులను బట్టి శుభ, అశుభ ఫలితా లుంటాయని వాస్తుశాస్త్ర నిపుణులు అంటున్నారు. రంగులు పిల్లల మనస్సుపై ఎంతో ప్రభావం చూపిస్తాయని, పిల్లల్లో హుషార్ తీరుకురావా లన్నా, హైపర్ యాక్టివ్ గా ఉన్న పిల్లలను కుదురుగా ఉంచాలన్నా.. రంగుల వల్లే సాధ్యం అవుతుందంటున్నారు చైనా వాస్తుశాస్త్ర నిపుణులు.

 పిల్లల బెడ్ రూమ్స్ కు వేసే రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వారు అంటున్నారు. జీవితాన్ని ఆస్వా దించేలా సృష్టే ప్రేమతో ఇన్ని రంగుల్ని చూసే సామర్థ్యాన్ని మనకు బహుమతిగా ఇచ్చింది. కాబట్టి అన్నివేళలా ఈ ప్రకృతికి కృతజ్ఞులై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.


 

Tags : effect-mind

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com