చీమలు వ్యాధులను గుర్తిస్తాయా..? సైంటిస్టులు.. ఏమంటున్నారు..?
సాక్షి లైఫ్: సైంటిస్టులు చీమలను గురించి కొత్త విషయాన్ని కనుక్కొన్నారు. చీమలు మనిషిలోని క్యాన్సర్ కణాలను గుర్తించ గలుగుతాయని తమ పరిశోధనల ద్వారా గుర్తించారు. చీమలు వాసన చూడడం ద్వారా క్యాన్సర్ కణాలను గుర్తిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
అధ్యయనంలో..
శాస్త్రవేత్తలు పలు అధ్యయనాలు, పరిశోధనల ద్వారా మనుషుల మనుగడకు ఉపయోగపడే పలు అంశాలను గుర్తిస్తుంటారు. అందులో భాగంగానే శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనంలో చీమలు మానవ శరీరంలోని క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించగలవని తేల్చారు. చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు వాటి వాసన సామర్థ్యాన్ని ఉపయోగించగలుగుతాయని పరిశోధకుల బృందం కనుగొంది.
ఫార్మికా ఫుస్కా..
ఈ రీసెర్చ్ లో ‘‘ఫార్మికా ఫుస్కా’’ అనే చీమలను వినియోగించారు. వీటికి సిల్కీ చీమలు అని కూడా పేరుంది. శాస్త్రవేత్తలు ఈ చీమలకు రివార్డ్ సిస్టమ్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చారు. చీమలు తమ వాసన సామర్ధ్యంతో ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అదేవిధంగా వాటి స్మెల్ పవర్ తో మనిషిలోని క్యాన్సర్ కణాల నుంచి ఆరోగ్యకరమైన కణాలను వేరుచేయగలుగుతాయని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు.
శాస్త్రవేత్త బృందం చాలా సమర్ధవంతంగా క్యాన్సర్‌ని నయం చేసే పద్ధతులను కనుగొనే క్రమంలోనే ఈ విషయాన్ని కనుగొన్నారు. మానవ క్యాన్సర్ కణాలను గుర్తించడానికి చీమను సాధనంగా ఉపయోగించడం అత్యంత సులభమైనదని, తక్కువ శ్రమతో కూడినదని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా శిక్షణ..
అలా క్యాన్సర్ కణాలను గుర్తించటానికి చీమలకు శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఈ చీమలకు చక్కెర ద్రావణంతో వాసనకు సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చి..ఆ తర్వాత అవి క్రమంగా రెండు వేర్వేరు రకాల క్యాన్సర్ కణాలను గుర్తించుకునేలా చేశారు. అలా చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించటానికి వాటి స్మెల్ పవర్ కారణమని పరిశోధకులు తమ అధ్యయనం ద్వారా కనుగొన్నారు.
క్లినికల్ ట్రయల్స్..
ఈ విషయంలో ఆయా చీమలకు మరింతగా ట్రైనింగ్ ఇచ్చి వాటి సామర్థ్యాన్ని మనిషి శరీరంపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి అంచనా వేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఈ మొదటి అధ్యయనం ప్రకారం పలు అంశాలను వెంటనే గుర్తించడంలో చీమలు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని..చాలా త్వరగా, తక్కువ ఖర్చుతో నేర్చుకోవడమే కాక సమర్థవంతంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇతర వాసనలు కూడా..
ఇవేకాకుండా ఈ చీమలు మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, ఇతర వ్యాధులకు సంబంధించిన వాసనలను కూడా పసిగట్టగలిగే సామర్థ్యంపై కూడా శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తున్నారు. చీమలకు వేగంగా గ్రహించ గలిగేశక్తి ఉందని.. కుక్కుల కంటే ఇవి చాలా త్వరగా క్యాన్సర్ కణాల గుర్తించగలవని సైంటిస్టులు వెల్లడించారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
