ఆక్యుపంక్చర్ థెరపీతో మధుమేహాన్ని నియంత్రించవచ్చా..?
సాక్షి లైఫ్ : ఆక్యుపంక్చర్ థెరపీ టైప్ -2 డయాబెటిస్‌ను నివారించడానికి ఆక్యుపంక్చర్ థెరపీ ఉపయోగకరమైందని ఆస్ట్రేలియాకు చెందిన ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
రక్తంలో ఉన్న గ్లూకోజ్ లేదా చక్కెరను శరీరం సరిగ్గా ఉపయోగించు కోలేనప్పుడు, ఆ వ్యక్తి కి మధుమేహ సమస్య ఉన్నట్లు నిర్ధారిస్తారు. ఆక్యుపంక్చర్ చికిత్స మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని తేలింది. ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధనా బృందం ప్రీడయాబెటిస్ ఉన్న 3,600 మందికి పైగా ఆక్యుపంక్చర్ థెరపీ ప్రభావాలపై అనేకసార్లు అధ్యయనాలను పరిశీలించింది.
ఆక్యుపంక్చర్ థెరపీ..
ఆక్యుపంక్చర్ థెరపీలో తినక ముందు ప్లాస్మా గ్లూకోజ్, తిన్నతర్వాత రెండు గంటలకు ప్లాస్మా గ్లూకోజ్ ను పరిశీలించగా ప్రీడయాబెటిస్ తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది. అయితే ఈ సమయంలో రోగులలో ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించకపోవడం విశేషం.
మధుమేహాన్ని అధిగమించడానికి ఆక్యుపంక్చర్ థెరపీ చాలా బాగా ఉపయోగపడుతుందని ప్రధాన పరిశోధకుడు మిన్ జాంగ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 11 శాతం మందికి పైగా పెద్దలను మధుమేహం ప్రభావితం చేస్తుందని అంచనా. 2045 నాటికి దాదాపు 1.3 బిలియన్ల మంది మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అంచనా వేస్తోంది. అంతేకాదు ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో 93 శాతం మందికి 20 ఏళ్లలోపు టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
టైప్-2 డయాబెటిస్ ..?
టైప్ 2 డయాబెటిస్ అనేది జీవనశైలి వ్యాధి, దీనిలో ఇన్సులిన్ లోపం లేదా ఇన్సులిన్ నిరోధకత కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరుగుతాయి. ఈ సందర్భంలో, శరీరం ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించడంలో విఫలమవుతుంది. ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేకపోవడం వల్ల రక్తంలో చక్కెర పేరగడం జరుగుతుంది. ఇది మధుమేహం,అధిక రక్తపోటు లేదా నరాలు దెబ్బతినడం వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. పిల్లల్లో టైప్-2 డయాబెటిస్‌కు ఊబకాయం కారణమవుతోందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
