అపోహలు - వాస్తవాలు : ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఎముకలు దెబ్బతింటాయా..?
సాక్షి లైఫ్: శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడానికి, ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ,పోషక పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం. అనేక రకాల సీజనల్ పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు పలు వ్యాధుల నుంచి రక్షించడంలో ఉపయోగపడుతుంది. అయితే మనం రోజూ ఏమి తినాలి అనే దానికంటే, ప్రస్తుత సమయంలో ఏయే వాటికి దూరంగా ఉండాలో కూడా తెలుసుకోవడం ముఖ్యమని వైద్యనిపుణులు అంటున్నారు.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే చక్కెర, ఉప్పు రెండింటినీ తగ్గించాలని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
ఉప్పు అధికంగా తీసుకోవడం అనేక విధాలుగా ఆరోగ్యానికి హాని జరుగుతుంది. దీని కారణంగా, రక్తపోటు పెరగడంతోపాటు గుండెకు హాని కలుగుతుంది. అంతేకాదు ఎముకలకు కూడా హానికరం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఉప్పు వల్ల శరీరంలో కాల్షియం తగ్గుతుందా..?
ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడానికి అత్యంత అవసరమైన పోషకాలలో కాల్షియం ఒకటి. ఎక్కువగా ఉప్పు తీసుకుంటే, అది శరీరంలో కాల్షియం లోపానికి కారణమవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎంత ఎక్కువ ఉప్పు తింటే, మీ శరీరం నుంచి అంత ఎక్కువ కాల్షియం పోతుందట, అంటే ఇది మీ ఎముకలకు కూడా చాలా హానికరం.
రక్తప్రవాహంలో సోడియం స్థాయులు పెరగడం మూత్రపిండాల పనిసామర్థ్యాన్ని తగ్గిస్తాయి. మూత్రపిండాలు శరీర వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయన్నది తెలిసిందే. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది కాస్తా రక్తపోటు చివరికి హార్ట్ స్ట్రోక్ ,హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలుగా హాని కలుగుతుంది. ఇది కండరాలు, ఎముకలతోపాటు అనేక ఇతర అవయవాలపై తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుంది.
గుండె కండరాల సమస్య
తలనొప్పి
మూత్రపిండ వ్యాధి
బోలు ఎముకల వ్యాధి
అధిక రక్త పోటు
మూత్రపిండాల్లో రాళ్లు. వంటి అనారోగ్య సమస్యలు ఉప్పు ఎక్కువగా తినడంవల్ల తలెత్తవచ్చని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
