హెల్త్ ఇన్సూరెన్స్ న్యూ రూల్స్..
సాక్షి లైఫ్: జనవరి నెల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన నియమ, నిబంధనలు మారాయి. భారతదేశంలో ఆరోగ్య బీమా కోసం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐ.ఆర్.డీ.ఏ) కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. బీమా రెగ్యులేటర్ ప్రకారం.. దేశంలో ప్రస్తుతం ఉన్న బీమా పాలసీల కొనుగోలు, విక్రయ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్ధవంతంగా చేయడం కోసమే ఈ కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు.
మారిన కొత్త నిబంధనల ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించిన అన్ని రకాల ముఖ్యమైన సమాచారాన్ని కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్(సీ.ఐ.ఎస్)లో పాలసీ హోల్డర్‌కు సాధారణ పదాలలో అందించాల్సి ఉంటుంది. ఆరోగ్య బీమా పాలసీల జారీకి సంబంధించి దేశంలోని అన్ని బీమా కంపెనీలకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐ.ఆర్.డీ. ఏ) కొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం దేశంలోని అన్ని బీమా కంపెనీలకు రూల్స్ మారతాయి. జనవరి నెల నుంచి ఆరోగ్య బీమా పాలసీని జారీ చేస్తే తప్పనిసరిగా పాలసీ దారునికి కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌ను అందించాల్సిఉంటుంది.
ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు..?
హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించిన అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌లో పాలసీ హోల్డర్‌కు సాధారణ పదాలలో అందించాలి. పాలసీ కవరేజీ ఎంత..? ఈ పాలసీ వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో వారికి తెలియజేయాల్సి ఉంటుంది. దీనితో పాటు, పాలసీ హోల్డర్ ఆరోగ్య బీమా క్లెయిమ్ చేయాలనుకుంటే దాని ప్రక్రియ గురించి కూడా ఆరోగ్య బీమా కంపెనీలు ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. వినియోగదారులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి కంపెనీ ఎలాంటి ప్రమాణాలను రూపొందించింది..? కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌లో గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ను సంప్రదించడానికి అవసరమైన సమాచారం కూడా అందించాల్సి ఉంటుంది.
పాలసీని కొనుగోలు చేసిన తర్వాత..
పాలసీని కొనుగోలు చేసిన తర్వాత, మీరు దానిని పరిమిత సమయం వరకు రద్దు చేసుకోవచ్చు. పాలసీదారు ఎవరైనా ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసిన తర్వాత దానిని రద్దు చేయాలనుకుంటే, అతనికి కూడా ఈ అవకాశం ఉంటుందని బీమా రెగ్యులేటర్ తొలిసారిగా బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.
పరిమిత కాలానికి మాత్రమే..
ఇప్పుడు ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసిన తర్వాత, బీమా పాలసీదారు ఈ పాలసీ తనకు సరిపోదని భావిస్తే, పరిమిత కాలానికి పాలసీని రద్దు చేసుకోవచ్చు. కానీ ఈ సదుపాయం పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పరిమితిని బీమా కంపెనీలు నిర్ణయిస్తాయి.
బీమా క్లెయిమ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదు..
ఇలా చేయడం వల్ల బీమా క్లెయిమ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనితో పాటు, ప్రతి పాలసీ హోల్డర్, ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, భవిష్యత్తులో బీమా క్లెయిమ్‌లలో ఎటువంటి సమస్య లేకుండా పారదర్శకంగా బీమా కంపెనీలకు కస్టమర్లు తమ ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందించాలి.
