ICMR నివేదిక.. దేశంలో క్యాన్సర్ మహమ్మారి పంజా.. అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్..!
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని హరిస్తున్న అతి భయంకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ముందు వరుసలో ఉంది. ఏటా లక్షలాది మందిని బలిగొంటున్న ఈ మహమ్మారికి సంబంధించిన సరికొత్త గణాంకాలు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) విడుదల చేసిన తాజా రాష్ట్రాలవారీ నివేదిక ప్రకారం.. దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు తేలింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 2.06 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు వెలుగు చూస్తుండగా, దాదాపు ఒక కోటి మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరినీ ఈ వ్యాధి కబళిస్తోంది.
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఐసీఎంఆర్ నివేదిక వెల్లడించిన భయానక నిజాలు..
దేశంలో పెరుగుతున్న భారం..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 15.6 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు బయటపడుతున్నాయి. ఇదే వేగం కొనసాగితే, 2030 నాటికి ఈ సంఖ్య ఏకంగా 17.5 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశారు.
ఉత్తర ప్రదేశ్‌దే అగ్రస్థానం..
దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్‌లో 2026 నాటికి ఏకంగా 2,31,671 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని అంచనా. 2030 నాటికి ఈ సంఖ్య 2,54,411కి పెరిగే ప్రమాదముంది.
ఇతర రాష్ట్రాల పరిస్థితి..
యూపీ తర్వాత మహారాష్ట్రలో 1,33,825 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 1,20,444 కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దేశ రాజధాని దిల్లీలో అత్యంత వేగంగా (7.1 శాతం వృద్ధి రేటుతో) క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగే ముప్పు పొంచి ఉంది.
క్యాన్సర్ ముప్పునకు అసలు కారణాలేమిటి..?
వ్యాధి తీవ్రత పెరగడానికి కేవలం వయసు ఒక్కటే కారణం కాదని, మారుతున్న ఆధునిక జీవనశైలే ప్రధాన ముప్పుగా మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పొగాకు, మద్యం సేవించడం..పురుషులలో క్యాన్సర్ ముప్పునకు ప్రధాన కారణం పొగాకు ఉత్పత్తుల వినియోగమే. కొన్ని ప్రాంతాల్లో పురుషుల్లో పొగాకు సంబంధిత క్యాన్సర్ కేసులు 60 శాతానికి పైగా ఉండటం గమనార్హం.
నిర్లక్ష్యం, అవగాహన లోపం: చాలామందిలో ఈ వ్యాధి ప్రాథమిక దశలో గుర్తించబడదు. వ్యాధి ముదిరిన తర్వాతే బయటపడటంతో చికిత్స సంక్లిష్టంగా మారుతోంది. ఉదాహరణకు, 30 నుంచి 49 సంవత్సరాల వయసు గల మహిళల్లో స్క్రీనింగ్ చేయించుకునే వారి సంఖ్య కేవలం 0.2 శాతంగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇతర ముప్పులు
వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఊబకాయం, వాయు కాలుష్యం వంటివి శరీరంలో క్యాన్సర్ కారకాలను ప్రేరేపిస్తున్నాయి. క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిలో సమూల మార్పులు రావాలి. పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండటంతో పాటు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముప్పును ప్రారంభ దశలోనే నివారించవచ్చు.
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
