Health tips : దీపావళి వేళ ప్రమాదవశాత్తు చేతులు కాలితే.. ఈ ప్రథమ చికిత్సలు తప్పక తెలుసుకోండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దీపావళి పండుగ అంటేనే ఆనందోత్సాహాలతో పాటు టపాసుల కోలాహలం. అయితే ఈ సంబరాల్లో కాస్త ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు తప్పవు. టపాసులు కాల్చేటప్పుడు చేతులు, వేళ్లు కాలడం లేదా నిప్పురవ్వలు పడి చర్మం కమిలిపోవడం వంటివి తరచూ జరుగుతుంటాయి. దీనివల్ల తీవ్రమైన మంట, చర్మం ఎర్రబడటం, బొబ్బలు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళన చెందకుండా వెంటనే సరైన ప్రథమ చికిత్స (First Aid) అందించడం చాలా ముఖ్యం. కాలిన వెంటనే ఏం చేయాలి..? ఎలాంటి పొరపాట్లు చేయకూడదు..? ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలో కచ్చితంగా తెలుసుకోవాలి.

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

వెంటనే చేయాల్సిన పనులు ఇవే..

చర్మం కాలిన వెంటనే ఆ భాగాన్ని చల్లబరచడం ద్వారా గాయం తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు. నిప్పురవ్వ పడినా లేదా చేతులు కాలినా వెంటనే ఆ భాగాన్ని సాధారణ చల్లటి నీటి ధార కింద సుమారు 20 నిమిషాల పాటు ఉంచాలి. మరీ చల్లగా ఉండే నీరు లేదా ఐస్ వాడకూడదు. అలాగే కాలిన చోట చేత్తో రుద్దకూడదు.

ఆభరణాలు తీసేయాలి..

చర్మం కాలిన తర్వాత వాపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చేతికి ఉన్న ఉంగరాలు, గాజులు, వాచీలను జాగ్రత్తగా తీసేయాలి. ఒకవేళ అవి చర్మానికి అతుక్కుపోయి ఉంటే బలవంతంగా లాగడానికి ప్రయత్నించకూడదు.

శుభ్రమైన వస్త్రంతో కప్పాలి..

 నీటితో కడిగిన తర్వాత కాలిన భాగాన్ని శుభ్రమైన, పొడిగా ఉండే వస్త్రంతో సున్నితంగా కప్పాలి. గాయంపై ఒత్తిడి తీసుకురాకూడదు. దూదిని నేరుగా గాయంపై పెట్టడం, మురికి బట్టలు వాడటం చేయకూడదు.

బొబ్బలు చిదపకూడదు..

కాలిన చోట బొబ్బలు వస్తే, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చిదపకూడదు. అలా చేస్తే ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది.

ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు..!

కాలిన వెంటనే చాలామంది ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్ని పనులు గాయాన్ని మరింత తీవ్రం చేస్తాయి. కాలిన చోట టూత్‌పేస్ట్ రాస్తే మంట, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

నూనె, నెయ్యి రాయొద్దు.. వీటిని రాయడం వల్ల చర్మంలో వేడి బయటకు పోకుండా ఉండిపోయి, గాయం త్వరగా మానకుండా చేస్తుంది. ఐస్ పెట్టొద్దు.. కాలిన చోట నేరుగా ఐస్ పెడితే చర్మానికి మరింత నష్టం వాటిల్లుతుంది.

దుస్తులు లాగకూడదు.. చర్మానికి అతుక్కుపోయిన బట్టలను బలవంతంగా లాగితే చర్మం దెబ్బతింటుంది. గాయాన్ని అలాగే వదిలేయకుండా శుభ్రమైన వస్త్రంతో కప్పి ఉంచాలి.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?

టపాసుల వల్ల అయ్యే గాయాలను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. మంటతో పాటు పేలుడు ప్రభావం కూడా చర్మంపై పడుతుంది. ఈ కింది లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

చేతులు లేదా వేళ్లపై పెద్ద పెద్ద బొబ్బలు రావడం..

కాలిన చోట చర్మం తెలుపు, నలుపు రంగులోకి మారినా లేదా మందంగా తయారైనా..గాయం చాలా లోతుగా అనిపించినా.. 
చేతులు, వేళ్లు మొద్దుబారినట్లు అనిపించినా, కదపడానికి ఇబ్బందిగా ఉన్నా.. ముఖం, కళ్లు లేదా సున్నితమైన భాగాల్లో గాయాలైనప్పుడు.. 

టపాసులు పేలడం వల్ల తీవ్ర రక్తస్రావం జరుగుతున్నప్పుడు లేదా లోతైన గాయాలైనప్పుడు తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలి. పిల్లల విషయంలో సొంతంగా పెయిన్ కిల్లర్స్ వాడకుండా వైద్యుల సలహా మేరకే మందులు వేసుకోవాలి.

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.