Heart-Friendly Salt : 'హార్ట్ ఫ్రెండ్లీ' సాల్ట్ గురించి తెలుసా..? గుండె, కిడ్నీలకు ఎంతో మేలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తీవ్రంగా పెరుగుతోంది. చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రక్తపోటు (bp), కొలెస్ట్రాల్ (cholesterol), మధుమేహం (diabetes)అదుపులో ఉంచుకోవడంతో పాటు ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించడం చాలా ముఖ్యం. ఎక్కువ ఉప్పు వాడితే రక్తపోటు పెరిగి, గుండెతో పాటు మూత్రపిండాల (kidneys) పైనా తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే, ఉప్పు వాడకం తగ్గించలేక ఇబ్బంది పడేవారికి నిపుణులు ఒక శుభవార్త చెబుతున్నారు. అదే 'పొటాషియం ఎన్రిచ్డ్ సాల్ట్' (Potassium Enriched Salt). దీనినే 'హార్ట్ ఫ్రెండ్లీ సాల్ట్' అని కూడా పిలుస్తున్నారు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 

పొటాషియం ఉప్పుతో ప్రయోజనాలు..

సాధారణ ఉప్పు స్థానంలో పొటాషియం ఉన్న ఉప్పును వాడటం ద్వారా గుండె జబ్బుల ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చిన్న మార్పు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 30 లక్షల మరణాలను అడ్డుకోవచ్చని, కోటికి పైగా కొత్త గుండె, కిడ్నీ వ్యాధులను నివారించవచ్చని అంచనా వేస్తున్నారు.

హార్ట్ ఫ్రెండ్లీ ఉప్పులో..


సాధారణ ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ హార్ట్ ఫ్రెండ్లీ ఉప్పులో సోడియం తక్కువగా ఉండి, పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది.శరీరంలో సోడియం మోతాదు పెరిగితే అది నీటిని నిలిపి ఉంచు తుంది. దీనివల్ల రక్తనాళాలపై ఒత్తిడి పడి బీపీ పెరుగుతుంది. అదే పొటాషియం అయితే శరీరంలో సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేసి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యమైన విషయమేమిటంటే.. ఈ పొటాషియం ఉప్పు రుచిలో అచ్చం మనం రోజూ వాడే సాధారణ ఉప్పు లాగానే ఉంటుంది.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..?

'నేచర్ హెల్త్ మెడికల్ జర్నల్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. అధిక రక్తపోటు కేవలం గుండెపైనే కాకుండా కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బీపీ పెరిగినప్పుడు కిడ్నీల్లోని అత్యంత సున్నితమైన రక్తనాళాలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల రక్తాన్ని వడపోసి, శరీరంలోని మలినాలను, అదనపు నీటిని బయటకు పంపే వాటి సామర్థ్యం క్రమంగా క్షీణిస్తుంది.

ద జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ప్రతినిధుల అభిప్రాయం ప్రకారం.. కేవలం ఇళ్లలో వంటలకు వాడే ఉప్పును పొటాషియం ఉప్పుగా మార్చడం వల్ల ఏటా 18.5 లక్షల మరణాలను, 60 లక్షల కొత్త కేసులను నివారించవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన మార్గం ఇది.

అందరికీ సురక్షితమేనా..?

ఈ ఉప్పుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇది అందరికీ సురక్షితం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు దీని వాడకం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు, రక్తంలో పేరుకుపోయిన అదనపు పొటాషియంను అవి బయటకు పంపలేవు.

అటువంటప్పుడు శరీరంలో పొటాషియం స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతాయి. ఈ పరిస్థితిని 'హైపర్‌కలేమియా' (Hyperkalemia) అంటారు. దీనివల్ల గుండె స్పందనల లయ తప్పి, ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు, కొన్ని రకాల మందులు వాడుతున్న వారు వైద్యుల సలహా లేకుండా ఈ ఉప్పును వాడకూడదు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రం సాధారణ ఉప్పుకు బదులుగా దీన్ని వాడటం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.