చలికాలంలో నారింజ తినకూడదా..?
సాక్షిలైఫ్ : శీతాకాలంలో సహజంగానే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆ సమయంలో పుల్లగా ఉండే ఆహారపదార్థాలకు కొందరు దూరంగా ఉంటారు. వింటర్ సీజన్ లో రోజూ పండ్లు తింటే జలుబు, దగ్గు వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చట.
చలికాలంలో నారింజ తింటే జలుబు వస్తుందనే భయం చాలా మందిలో సహజంగానే ఉంటుంది. అందుకోసమే వింటర్ సీజన్ లో నారింజ పండు తినొచ్చా..? లేదా అనే సందేహం తలెత్తుతుంది. వైద్యనిపుణులు మాత్రం చలికాలంలో నారింజ పండ్లు తినడం చాలా మంచిదని అంటున్నారు. అంతేకాదు నారింజ జలుబు,దగ్గు వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుందని వారు వెల్లడిస్తున్నారు. ఊపిరితిత్తులలో ఉండే కఫాన్ని తొలగించి ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. చలికాలంలో నారింజ పండ్లు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటంటే..?
నారింజ పండులో విటమిన్ "సి" పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ "సి" శరీరం లోపల నుంచి విషాన్ని తొలగించడంలో పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. ప్రతిరోజూ రెండు నారింజ పండ్లను తింటే, రోజువారీ మోతాదుకు అవసరమైన విటమిన్ "సి" లభిస్తుంది.
ఇది శరీరాన్ని ఎక్కువసేపు తేమగా ఉంచుతుంది. ముఖంపై పగుళ్లు, పొడిబారడం వంటి సమస్యలను ఇది సరిచేస్తుంది. నారింజ పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. ఇది మీ శరీరంలో ఎసిడిటీకి దారితీస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. పూర్తి ప్రయోజనాలు పొందాలంటే మధ్యాహ్నం పూట ఈ పండును తినడం మంచిది. అయితే మంచిది కదా అని రోజుకు రెండు పండ్ల కంటే ఎక్కువ తినకూడదు. అలా తినడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి.
నారింజ పండ్లను తినడం వల్ల ముఖం, ముఖంపై ఉండే మొటిమలు మాయమవుతాయి. అంతేకాదు ఫలితంగా శరీరం లోపల బలం పెరుగుతుంది. ఇది కాకుండా, నారింజలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
