Digestive problems : భోజనం చేసిన వెంటనే మలవిసర్జనకు వెళ్లాలనిపించడం వ్యాధి లక్షణమా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : 'జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే, మనమూ ఆరోగ్యంగా ఉన్నట్లే' అని పెద్దలు చెబుతుంటారు. కానీ, ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, కొంతమందికి భోజనం చేసిన వెంటనే టాయిలెట్‌కు పరుగెత్తాల్సిన పరిస్థితి వస్తుంటుంది. తాము తిన్న ఆహారం శరీరానికి వంటబట్టకుండా, వెంటనే బయటకు వచ్చేస్తోందేమో అని వారు తెగ కంగారు పడిపోతుంటారు. కానీ, వైద్యపరంగా చూస్తే దీని అసలు కారణం వేరే ఉంది.

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

 

భోజనం చేసిన వెంటనే మలవిసర్జనకు వెళ్లాలనిపించడం వ్యాధి లక్షణమా..? లేక సాధారణమైన ప్రక్రియా..? ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి..? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటే ఏంటి..?

మనం ఆహారం తీసుకున్నప్పుడు అది నేరుగా జీర్ణాశయంలోకి చేరుతుంది. అప్పుడు కడుపు ఉబ్బి, నరాలు, హార్మోన్ల ద్వారా పెద్దప్రేగుకు సంకేతాలు వెళ్తాయి. 'కొత్త ఆహారం వస్తోంది.. పాత దానిని పంపించేయండి' అని ఆ సంకేతాల అర్థం. అప్పుడు పెద్దప్రేగులో అప్పటికే ఉన్న మలం కిందికి నెట్టబడుతుంది. దీనివల్లే భోజనం చేసిన కొన్ని నిమిషాలకే టాయిలెట్‌కు వెళ్లాలనే భావన కలుగుతుంది. వైద్య పరిభాషలో దీనిని 'గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్' (Gastrocolic Reflex) అంటారు. ఇది పూర్తిగా సహజమైన శారీరక ప్రక్రియ.

కొంతమందిలో ఈ ఫీలింగ్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే..?

అతిగా తినడం..కడుపు నిండా మోతాదుకు మించి తిన్నప్పుడు జీర్ణాశయం ఎక్కువగా సాగుతుంది. దీంతో పెద్దప్రేగుకు వెళ్లే సంకేతాలు తీవ్రంగా ఉండి, వెంటనే బాత్రూమ్‌కి వెళ్లాల్సి వస్తుంది. మసాలా, నూనె పదార్థాలు..అధిక క్యాలరీలు ఉండే ఫుడ్, నూనెతో చేసిన పదార్థాలు, హెవీ మీల్స్ తీసుకున్నప్పుడు కూడా ప్రేగుల కదలికలు (Bowel movements) ఒక్కసారిగా వేగవంతం అవుతాయి.

ఎప్పుడు ఆందోళన చెందాలి..? 

అప్పుడప్పుడూ ఇలా జరిగి, మలవిసర్జన సాధారణంగా ఉంటే భయపడాల్సిన పనిలేదు. కానీ, ఈ కింది లక్షణాలు కనిపిస్తే మాత్రం అప్రమత్తం కావాలి.

ప్రతిసారీ భోజనం చేసిన వెంటనే విరేచనానికి వెళ్లాల్సి రావడం.

నీళ్ల విరేచనాలు (diarrhea) కావడం.

కడుపులో నొప్పి, పేగుల్లో తిమ్మిరి, కడుపు ఉబ్బరంగా అనిపించడం.

ఈ లక్షణాలు దీర్ఘకాలంగా వేధిస్తుంటే అది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS - Irritable Bowel Syndrome)కు సంకేతం కావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ప్రేగులు చాలా సున్నితంగా మారి, వాటి పనితీరు దెబ్బతింటుంది. ఐబీఎస్ కారణంగా కొందరిలో మలబద్ధకం, మరికొందరిలో విరేచనాలు తీవ్రమవుతాయి.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..?

భోజనం చేసిన తర్వాత మలవిసర్జనకు వెళ్లడం, విరేచనాలు కావడం అనేవి రెండు వేర్వేరు విషయాలని వైద్యులు వివరిస్తున్నారు. కేవలం వెళ్లాలనే భావన కలిగి, మలవిసర్జన సాఫీగా జరిగితే అది సాధారణ 'గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్'. అలా కాకుండా తరచుగా నీళ్ల విరేచనాలు అవుతూ, కడుపునొప్పి వేధిస్తుంటే మాత్రం వెంటనే జీర్ణకోశ నిపుణులను సంప్రదించాలి. సరైన సమయంలో వ్యాధిని నిర్ధారించి చికిత్స తీసుకుంటే పెద్ద సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు. వదిలేస్తే మాత్రం శరీరం డీహైడ్రేషన్ బారిన పడి, పోషకాహార లోపం తలెత్తే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

  ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.