Monsoon Dental Care : వర్షాకాలంలో దంతాల సంరక్షణ విషయంలో ఇలాంటి తప్పులు అస్సలు చేయొద్దు..!
సాక్షి లైఫ్ : వాతావరణంలో తేమ, ఆహారపు అలవాట్లలో మార్పులు వర్షాకాలంలో సాధారణం. అయితే వీటి ప్రభావం కేవలం మన శరీరంపైనే కాకుండా దంతాలు, చిగుళ్లపై కూడా పడుతుందని మీకు తెలుసా..? నోటి పరిశుభ్రత (Oral Hygiene) విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి. అంతేకాదు దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, నీళ్లు తక్కువగా తాగడం వల్ల దంత సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో మీ చిరునవ్వు చెక్కుచెదరకుండా ఉండాలంటే ఈ ఐదు తప్పులు అస్సలు చేయొద్దు..!
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
1. బ్రష్ చేయడంలో నిర్లక్ష్యం..
ఉదయం నిద్రలేవగానే, రాత్రి పడుకునే ముందు.. ఇలా రెండు పూటలా బ్రష్ చేయడం నోటి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. హడావుడిగా పళ్లు తోమడం లేదా రోజుకు ఒక్కసారే బ్రష్ చేయడం వల్ల దంతాలపై ప్లాక్ (plaque) ఎక్కువగా పేరుకుపోతుంది.
2. నాలుకను శుభ్రం చేయకపోవడం..
కేవలం పళ్లు తోముకుంటే సరిపోదు. నాలుకపై కూడా బ్యాక్టీరియా, మురికి పేరుకుపోయి నోటి దుర్వాసనకు దారితీస్తుంది. కాబట్టి రోజూ పళ్లు తోముకున్న తర్వాత టంగ్ క్లీనర్ లేదా బ్రష్‌తో నాలుకను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి.
3. తిన్న తర్వాత పుక్కిలించకపోవడం..
వర్షాకాలంలో వేడివేడిగా స్నాక్స్, టీ లాంటివి పదే పదే తినాలనిపిస్తుంది. అయితే ఏది తిన్నా నోరు శుభ్రం చేసుకోకపోతే ఆహార కణాలు దంతాల మధ్య ఇరుక్కుపోతాయి. ఇవి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. అందుకే ఏదైనా తిన్న వెంటనే మంచి నీటితో కనీసం రెండుసార్లు నోరు పుక్కిలించడం అలవాటు చేసుకోండి.
4. టూత్‌బ్రష్‌ను తడిగా ఉంచడం..
బ్రష్ వాడిన తర్వాత దాన్ని సరిగ్గా కడగకుండా లేదా తడిగానే మూసి ఉన్న డబ్బాలో పెట్టడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. తేమ ఎక్కువగా ఉండే చోట బ్రష్‌ను ఉంచితే అందులో బ్యాక్టీరియా సులభంగా వృద్ధి చెందుతుంది. బ్రష్‌ను బాగా కడిగి, గాలి తగిలే పొడి ప్రదేశంలో ఉంచాలి.
5. నీళ్లు తక్కువగా తాగడం..
వాతావరణం చల్లగా ఉండటం వల్ల వర్షాకాలంలో చాలామంది నీళ్లు తాగడం తగ్గిస్తారు. కానీ శరీరానికే కాకుండా నోటి శుభ్రతకు కూడా తగినన్ని నీళ్లు తాగడం ఎంతో అవసరం. పదే పదే నీరు తాగడం వల్ల నోటిలోని ఆహార కణాలు, బ్యాక్టీరియా కొట్టుకుపోయి నోరు శుభ్రంగా ఉంటుంది.
వర్షాకాలంలో దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. సరైన పద్ధతిలో బ్రష్ చేయడం, టూత్ బ్రష్‌ను పొడిగా ఉంచుకోవడం వంటి చిన్న చిన్న మంచి అలవాట్లతో దంత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఏదైనా తీవ్రమైన పంటి నొప్పి లేదా చిగుళ్ల సమస్య ఉంటే వెంటనే దంత వైద్యుడిని (dentist) సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
