తరచూ అలసటా? కీళ్లనొప్పులు కూడానా? అది 'లూపస్' కావచ్చు..!
ఎలాంటి కారణం లేకుండానే ఎప్పుడూ నీరసంగా, అలసటగా అనిపిస్తోందా..? సాయంత్రం అయ్యేసరికి ఒళ్లంతా నొప్పులు మొదలవుతున్నాయా.? ముఖం మీదో, చర్మం మీదో వింత ఎర్రటి మచ్చలు, మొటిమలు కనిపిస్తున్నాయా..? అయితే ఇవి సాధారణ అలసట లక్షణాలు కాకపోవచ్చని అమెరికా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి 'సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్' (SLE) అనే వ్యాధి సంకేతాలు కావచ్చని వారు స్పష్టం చేశారు.
SLE అంటే ఏమిటి?
లూపస్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వివరించిన ప్రకారం, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున సొంత అవయవాలు, కణజాలాలపైనే దాడి చేయడం వల్ల SLE వ్యాధి వస్తుంది. దీనివల్ల శరీరమంతటా మంట (ఇన్ఫ్లమేషన్) ఏర్పడుతుంది. ఈ మంట చర్మం, కీళ్లు, రక్తం వంటివే కాకుండా, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె వంటి కీలక అవయవాలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే, లక్షణాలను అదుపులో ఉంచడంతో పాటు వ్యాధి మరింత తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.
గమనించాల్సిన ప్రధాన లక్షణాలు
వ్యాధి లక్షణాలు ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే సాధారణంగా కనిపించే సంకేతాలు ఇవి:
- తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకున్నా తగ్గని నిరంతర అలసట, నీరసం
- తరచూ జ్వరం రావడం
- ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం రావడం
- కీళ్ల నొప్పులు
- చర్మంపై ఎర్రటి దద్దుర్లు, మొటిమలు, మచ్చలు
ఎవరికి ముప్పు ఎక్కువ?
కొన్ని అంశాలు SLE వచ్చే అవకాశాన్ని పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు:
- కుటుంబంలో ఇప్పటికే ఈ వ్యాధి చరిత్ర ఉండటం
- శరీరంలో హార్మోన్ల మార్పులు
- ఎండకు ఎక్కువసేపు గురికావడం
ఏం చేయాలి?
పైన పేర్కొన్న లక్షణాల్లో ఏవైనా కనిపిస్తే, ఆలస్యం చేయకుండా అనుభవం ఉన్న వైద్యుడిని లేదా రుమటాలజిస్ట్ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. సకాలంలో రక్త పరీక్షలు చేయించుకోవడం, డాక్టర్ సూచించిన మార్గదర్శకాలను పాటించడం ద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించి, తగిన చికిత్స ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు.
గమనిక: ఇది సాధారణ ఆరోగ్య సమాచారం మాత్రమే. ఏవైనా లక్షణాలు కనిపిస్తే స్వీయ చికిత్స చేసుకోకుండా, తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
