Green Tea vs Matcha Tea: గ్రీన్ టీ వర్సెస్ మాచా టీ ప్రధాన వ్యత్యాసాలు ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నేటి ఆధునిక కాలంలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బరువు తగ్గాలనుకునే వారు, జీవక్రియలను మెరుగుపరుచుకోవాలనుకునే వారు తమ రోజువారీ దినచర్యలో రకరకాల హెల్తీ డ్రింక్స్‌ను చేర్చుకుంటున్నారు. ఈ జాబితాలో ముందు వరుసలో వినిపించే పేర్లు.. ‘గ్రీన్ టీ’ (Green Tea), ‘మాచా టీ’ (Matcha Tea). ఇవి రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, చాలా మందికి ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏమిటి..? బరువు తగ్గడానికి, సంపూర్ణ ఆరోగ్యానికి ఈ రెండింటిలో ఏది ఉత్తమం..? అనే సందేహాలు ఉంటాయి. ఒకే మొక్క నుంచి వచ్చే ఈ రెండు పానీయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..Knee Pain : నడిచినా నొప్పి.. కూర్చున్నా నొప్పి..? మోకాళ్లలో 'టక్ టక్' శబ్దం వస్తుందా..? ఇదిగో పరిష్కారం.. 

ఇది కూడా చదవండి..Irritable Bowel Syndrome : ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ (IBS) అంటే ఏమిటి..? లక్షణాలెలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

ముఖ్యమైన తేడా ఎక్కడుంది..?

 

గ్రీన్ టీ, మాచా టీ రెండూ ‘కెమెల్లియా సినెన్సిస్’ (Camellia sinensis) అనే ఒకే రకమైన మొక్క ఆకుల నుంచి తయారవుతాయి. కానీ, వీటి తేడా అంతా ఆకులను పెంచే విధానం, ప్రాసెస్ చేసే పద్ధతిలోనే ఉంది. గ్రీన్ టీ..ఎండలో పెరిగిన టీ ఆకులను సేకరించి ఎండబెడతారు. దీనిని తయారుచేసేటప్పుడు ఆకులను వేడి నీటిలో నానబెట్టి, కేవలం ఆకుల సారాన్ని (Extract) మాత్రమే తాగుతాం.

మాచా టీ..ఈ మొక్కలను కోతకు కొన్ని వారాల ముందు నీడలో పెంచుతారు. దీనివల్ల ఆకుల్లో హరితకణం (Chlorophyll)అమైనో ఆమ్లాలు పెరుగుతాయి. అనంతరం ఈ ఆకులను ఎండబెట్టి, కాడలను తొలగించి చాలా సన్నని పొడిగా మారుస్తారు. ఈ పొడిని నేరుగా నీటిలో లేదా పాలలో పూర్తిగా కలుపుకుని తాగుతారు. అంటే ఇక్కడ మనం మొత్తం ఆకునే తీసుకుంటామన్నమాట.

గ్రీన్ టీ వర్సెస్ మాచా టీ..

1. పోషకాలు, యాంటీఆక్సిడెంట్ల మోతాదు.. 

గ్రీన్ టీతో పోలిస్తే మాచా టీలో పోషకాలు, ముఖ్యంగా ‘కేటచిన్స్’, ‘ఈజీసీజీ’ (EGCG) వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం మాచా టీలో ఆకు సారాన్ని మాత్రమే కాకుండా, మొత్తం ఆకు పొడిని నేరుగా తీసుకుంటాం. అయితే, గ్రీన్ టీ కూడా శరీరానికి తగినన్ని యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది.

2. కెఫీన్ పరిమాణం.. 

మాచా టీలో కెఫీన్ (Caffeine) శాతం గ్రీన్ టీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు మాచా టీలో సుమారు 40 నుంచి 70 మిల్లీగ్రాముల కెఫీన్ ఉండగా, గ్రీన్ టీలో ఇది కేవలం 20 నుంచి 45 మిల్లీగ్రాముల వరకే ఉంటుంది. కాబట్టి, కెఫీన్ పడని వారు, గుండె దడ, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు ఉన్నవారు మాచా టీని పరిమితంగా తీసుకోవడం లేదా నిపుణుల సలహా పాటించడం మంచిది.

3. రుచి, ఆకృతి..

గ్రీన్ టీ రుచి చాలా తేలికగా, కాస్త వగరుగా, తాజా అనుభూతిని ఇస్తుంది. అదే మాచా టీ విషయానికి వస్తే.. ఇది కాస్త చిక్కగా, క్రీమీగా, గాఢమైన మట్టి వాసనతో (Earthy flavor) కూడిన రుచిని కలిగి ఉంటుంది. ఇది పూర్తిగా ఒకరి వ్యక్తిగత ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది.

4. బరువు తగ్గడంలో ఏది బెస్ట్..? 

రెండు టీలలోనూ మెటబాలిజం (Metabolism) అనగా జీవక్రియలను వేగవంతం చేసే సహజ సమ్మేళనాలు ఉంటాయి. అయితే, కేవలం ఈ టీలు తాగేసి కూర్చుంటే బరువు తగ్గిపోతామ నుకోవడం భ్రమే అవుతుంది. బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం (Balanced Diet), క్రమం తప్పని వ్యాయామం, సరైన నిద్ర, చురుకైన జీవనశైలి అత్యంత ముఖ్యం. వీటికి అదనపు మద్దతుగా ఈ రెండు పానీయాలను డైట్‌లో చేర్చుకోవచ్చు. చివరగా చెప్పాలంటే.. గ్రీన్ టీ, మాచా టీ రెండూ ఆరోగ్యానికి మేలు చేసే సూపర్ డ్రింక్సే. మీ శరీర తత్వం, కెఫీన్ తట్టుకునే సామర్థ్యం, మీ రుచి అభిరుచులను బట్టి వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు. ఏ పానీయమైనా అమితంగా కాకుండా మితంగా తీసుకున్నప్పుడే ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.