Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
సాక్షి లైఫ్ : వర్షాకాలం ఆరంభమైందంటే చాలు.. దేశవ్యాప్తంగా దోమల జోరు, డెంగ్యూ కేసుల హోరు ఒక్కసారిగా పెరిగిపోతుంటాయి. దోమ కాటు ద్వారా వ్యాపించే ఈ వైరల్ ఇన్ఫెక్షన్‌ను సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే, అది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, ప్రజల్లో అవగాహన పెంచేందుకు అవసరమైన సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది సాక్షి లైఫ్.. డెంగ్యూ సోకిన ప్రారంభంలో వచ్చే లక్షణాలు సాధారణ వైరల్ జ్వరాన్ని పోలి ఉండటం వల్ల చాలామంది పొరబడుతుంటారు. అయితే, డెంగ్యూను ఎంత త్వరగా గుర్తిస్తే అంత సులభంగా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. వెంటనే అప్రమత్తం కావాల్సిన ఆ 5 ముఖ్యమైన లక్షణాలు, నివారణ ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
1. అకస్మాత్తుగా వచ్చే అధిక జ్వరం..
డెంగ్యూ ప్రాథమిక లక్షణాలలో మొదటిది.. ఉన్నట్టుండి విపరీతమైన జ్వరం రావడం. ఇది సాధారణంగా 102 నుంచి 104 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు ఉంటుంది. ఈ జ్వరం అకస్మాత్తుగా ప్రారంభమై 2 నుంచి 7 రోజుల వరకు తగ్గకుండా వేధిస్తుంది. దీనితో పాటు విపరీతమైన చలి, వణుకు, ఒళ్లు నొప్పులు ఉంటాయి.
2. తీవ్రమైన తలనొప్పి.. కళ్ల వెనుక నొప్పి..
సాధారణ జ్వరాల్లో వచ్చే తలనొప్పి కంటే డెంగ్యూలో వచ్చే నొప్పి చాలా భిన్నంగా ఉంటుంది. తల భారంతో పాటు కళ్ల వెనుక భాగంలో భరించలేని నొప్పి పుడుతుంది. కనుగుడ్లను కదల్చాలన్నా లేదా వెలుతురు వైపు చూడాలన్నా రోగి తీవ్ర ఇబ్బంది పడతాడు. ఈ లక్షణం కనిపిస్తే అది డెంగ్యూ కావచ్చునని అనుమానించాలి.
3. కండరాలు, కీళ్ల నొప్పులు..
డెంగ్యూను వైద్య పరిభాషలో 'బ్రేక్ బోన్ ఫీవర్' ఎముకలు విరిచే జ్వరం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ జ్వరం వచ్చినప్పుడు శరీరం, కండరాలు, కీళ్లలో ఎముకలు విరిగిపోయినంత తీవ్రమైన నొప్పిగా అనిపిస్తుంది. రోగి కనీసం పడకపై నుంచి లేవడానికి, కూర్చోవడానికి కూడా శక్తి లేనంతగా నీరసించిపోతాడు.
4. చర్మంపై ఎర్రటి దద్దుర్లు (Rashes)..
డెంగ్యూ తీవ్రతను సూచించే ప్రధాన సంకేతాలలో చర్మంపై వచ్చే మార్పులు ఒకటి. జ్వరం వచ్చిన కొన్ని రోజులకు లేదా జ్వరం తగ్గుముఖం పట్టే సమయంలో శరీరంపై ఎర్రటి దద్దుర్లు, మచ్చలు కనిపిస్తాయి. వీటి వల్ల చర్మంపై దురద, మంట పుట్టే అవకాశం ఉంది.
5. తీవ్రమైన అలసట, నీరసం..
రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవడం, వైరస్ ప్రభావం వల్ల రోగి శరీరంలో శక్తి పూర్తిగా క్షీణిస్తుంది. నిరంతర అలసట, కళ్లు తిరగడం వంటి సమస్యలు వేధిస్తాయి. జ్వరం తగ్గిన తర్వాత కూడా శరీరం పూర్వస్థితికి రావడానికి చాలా రోజులు పడుతుంది.
నివారణ మార్గాలు..
నీటి నిల్వలను తొలగించండి: ఇంటి పరిసరాలలో, పూల కుండీలు, కూలర్లు, పాత టైర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. 'ఏడిస్' దోమలు నిల్వ ఉన్న శుభ్రమైన నీటిలోనే పెరుగుతాయి. దోమల నుంచి రక్షణ.. రాత్రి వేళల్లో దోమతెరలు వాడటం, ఇంట్లో మస్కిటో రిపెల్లెంట్స్ ఉపయోగించడం మంచిది. దుస్తుల ఎంపిక..శరీరం పూర్తిగా కప్పబడేలా పొడవాటి చేతులున్న దుస్తులను ధరించడం ద్వారా దోమ కాటు నుంచి తప్పించుకోవచ్చు. డెంగ్యూ సోకినప్పుడు శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి ఓఆర్‌ఎస్ (ORS) ద్రావణం, కొబ్బరి నీళ్లు, మంచి నీరు పుష్కలంగా తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?
ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
