Typhoid : టైఫాయిడ్ ముప్పు వర్షాకాలంలోనే ఎందుకు ఎక్కువ అంటే..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ప్రకృతి ఎంత అందంగా మారుతుందో, రోగాల ముప్పు కూడా అంతే వేగంగా పొంచి ఉంటుంది. ఈ సీజన్‌లో కేవలం దోమల వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా మాత్రమే కాదు.. కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు కూడా విజృంభిస్తాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైనది ‘టైఫాయిడ్’ (Typhoid). ఈ రోజుల్లో బయట దొరికే చాట్, పానీపూరి, రోడ్డు పక్కన కోసి ఉంచిన పండ్లు తినడం లేదా కలుషిత నీరు తాగడం వల్ల చాలా మంది టైఫాయిడ్ బారిన పడుతున్నారు. ప్రారంభంలో వచ్చే జ్వరాన్ని సాధారణ వైరల్ ఫీవర్‌గా భావించి నిర్లక్ష్యం చేస్తే, ఈ సమస్య ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..Rare IgG4-Related Disease Mimics Cancer : క్యాన్సర్‌ను పోలి ఉండే అరుదైన వ్యాధి 'IgG4' .. భారత్ లో విజృంభిస్తున్న న్యూ డిసీజ్.. 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?

 

టైఫాయిడ్ అంటే ఏమిటి..?

టైఫాయిడ్ అనేది ‘సాల్మొనెల్లా టైఫీ’ (Salmonella typhi) అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే తీవ్రమైన ఇన్‌ఫెక్షన్. ఇది ప్రధానంగా ఈ బ్యాక్టీరియా ఉన్న కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. సకాలంలో సరైన వైద్యం అందకపోతే, ఈ బ్యాక్టీరియా ప్రేగులు, కాలేయం (Liver) శరీరంలోని ఇతర కీలక భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

వర్షాకాలంలోనే ఎందుకు ముప్పు ఎక్కువ..?

ఈ సీజన్‌లో కురిసే వర్షాల వల్ల చాలా చోట్ల మురుగునీరు, తాగునీటి పైపులైన్లలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఈ కలుషిత నీటిని తాగడం వల్ల లేదా ఆ నీటితో చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి..?

తీవ్రమైన జ్వరం..రోజురోజుకూ జ్వరం తీవ్రత పెరగడం టైఫాయిడ్ ప్రధాన లక్షణం.

శారీరక ఇబ్బందులు.. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విపరీతమైన నీరసం, అలసట.

జీర్ణక్రియ సమస్యలు..ఆకలి పూర్తిగా తగ్గిపోవడం, కడుపు నొప్పి, వాంతులు, కొందరిలో మలబద్ధకం లేదా విరేచనాలు (Diarrhea) కావడం.

తీవ్రత పెరిగితే..జ్వరం చాలా రోజుల పాటు తగ్గకుండా ఉంటే, అది ప్రేగులలో పుండ్లు (Ulcers) పడటానికి, అంతర్గత రక్తస్రావానికి దారితీయవచ్చు.

టైఫాయిడ్ నిర్ధారణ అయితే ఏం చేయాలి..?

టైఫాయిడ్ జ్వరం వచ్చినట్లు రక్త పరీక్షల ద్వారా నిర్ధారణ అయితే, వైద్యులు సూచించిన యాంటీబయాటిక్ (Antibiotics) మందులను ఖచ్చితంగా వాడాలి. చాలా మంది జ్వరం తగ్గగానే మందులు వేసుకోవడం ఆపేస్తుంటారు. కానీ, వైద్యులు సూచించిన కోర్సును పూర్తిగా పూర్తి చేయకపోతే ఈ బ్యాక్టీరియా మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంది. దీనితో పాటు రోగికి తగినంత విశ్రాంతి, శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఓఆర్‌ఎస్ (ORS) లేదా ద్రవాహారం అందించాలి.

వ్యాధి దరిచేరకుండా తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు.. 

1. కాచి చల్లార్చిన నీరే శరణ్యం..

వర్షాకాలంలో నేరుగా టాప్ వాటర్ తాగడం అస్సలు మంచిది కాదు. నీటిని బాగా మరిగించి, చల్లార్చిన తర్వాతే తాగాలి లేదా నమ్మకమైన ప్యూరిఫైడ్ వాటర్ ఉపయోగించాలి.

2. బయటి ఆహారానికి దూరం..

రోడ్డు పక్కన తెరిచి ఉంచే చాట్, పానీపూరి, కట్ చేసిన పండ్లను తినకూడదు. ఇంట్లో వండిన తాజా, వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

3. చేతుల పరిశుభ్రత ముఖ్యం..

మరుగుదొడ్డి వాడిన తర్వాత, అలాగే వంట చేసే ముందు, తినే ముందు చేతులను కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

4. కూరగాయల శుద్ధీకరణ..

మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలను వండే ముందు లేదా తినే ముందు ఉప్పు నీటితో బాగా కడిగి ఉపయోగించాలి.

5. వ్యాక్సిన్ తీసుకోవడం..

టైఫాయిడ్ నివారణకు టీకాలు (Typhoid Vaccines) అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలకు వైద్యుల సలహాతో ఈ వ్యాక్సిన్ ఇప్పించడం ద్వారా ముప్పును తగ్గించవచ్చు. వర్షాకాలంలో రెండు రోజుల కంటే ఎక్కువ కాలం జ్వరం, కడుపు నొప్పి ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడమే సురక్షితమైన మార్గం.  

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.