ఎలాంటి డైట్‌తో మధుమేహాన్ని నివారించవచ్చు..?
సాక్షి లైఫ్: మధుమేహ సమస్య కు ఎట్టకేలకు సరైన పరిష్కారం దొరికింది. ఇప్పటివరకు దీనికి శాశ్వత పరిష్కారం లేకపోయినా సరైన డైట్‌తో మధుమేహాన్ని కొంత మేర నివారించవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల షుగర్ సమస్య 24శాతం వరకు తగ్గుతుందని "మెడ్‌యునీ వియెన్సాస్ సెంటర్" జరిపిన పరిశోధనలో వెల్లడైంది.
ఈ రీసెర్చ్ ప్రకారం..కాయకూరలు,పండ్లు, గింజలు, పప్పుదినుసులు, విత్తనాలు వంటి వెజ్ టేరియన్ ఫుడ్ తో మధుమేహాన్ని నివారించడంతో పాటు ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారికి మేలైన చికిత్సగా పనిచేస్తుందని గతంలోనూ పలురకాల అధ్యయనాలు స్పష్టం చేశాయి కూడా. తాజాగా మరోసారి ఇదే విషయం రుజువైంది. శాకాహారం తినడం వల్ల కాలేయం, కిడ్నీ పనితీరు మెరుగవడంమేకాకుండా, డయాబెటిస్ ముప్పు తగ్గడానికి తోడ్పుతుందని గుర్తించారు పరిశోధకులు.
మాంసాహారంలో అధికంగా ఉండే పిండిపదార్థాలు, మాంసకృత్తులు.. మధుమేహ సమస్యకు దారితీస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, వయసు పైబడటం, సహా జన్యపరమైన కారణాల వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉన్నా శాకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ను అదుపుచేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
షుగర్ సమస్య తలెత్తడానికి అనేక కారణాలున్నాయి. అటువంటి వాటిలో ఆహారంలో అధిక మొత్తంలో స్వీట్లు తీసుకోవడం, ప్రాసెస్ చేసిన పదార్థాలు, కూల్‌డ్రింక్స్ వంటివి టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని, ప్రతిరోజూ తీసుకునే ఆహారపదార్థాలు మధుమేహ నియంత్రణలో ప్రధానపాత్ర పోషిస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా మాంసాహారాన్ని వారానికి ఒకసారి కంటే ఎక్కువగా తినడం వల్ల కూడా టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని వారు చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
