World Rabies Day 2026 : కుక్క కరిచిందా..? రేబిస్ టీకా ఎప్పుడు వేయించుకోవాలంటే..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కుక్క కరవడాన్ని చాలామంది సాధారణ గాయంగానే భావించి తేలిగ్గా తీసుకుంటారు. కానీ, ఆ కుక్కకు గనక 'రేబిస్' (Rabies) ఇన్ఫెక్షన్ ఉంటే అది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. రేబిస్ అనేది ఒక వైరల్ వ్యాధి. వ్యాధి సోకిన జంతువు కరవడం, రకడం లేదా మనకు ఉన్న గాయాలపై దాని లాలాజలం పడటం ద్వారా ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రేబిస్ లక్షణాలు బయటపడిన తర్వాత మనిషి ప్రాణాలు దక్కడం దాదాపు అసాధ్యం. సరైన సమయంలో టీకా వేయించుకోవడం ద్వారా మాత్రమే దీనిని అడ్డుకోగలం.

సెప్టెంబర్ 28న 'ప్రపంచ రేబిస్ దినోత్సవం' (World Rabies Day) సందర్భంగా.. కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి? టీకా ఎప్పుడు అవసరం? తదితర విషయాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

 

వెంటనే ఏం చేయాలి..?

కుక్క కరిచినా లేదా గోళ్లతో రక్కినా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ గాయాన్ని సబ్బు, పారే నీటితో కనీసం 15 నిమిషాల పాటు శుభ్రంగా కడగాలి. కుక్క కరిచిన చోట కారం, పసుపు, సున్నం, ఆకులు, యాసిడ్ వంటివి అస్సలు రాయకూడదు. దీనివల్ల ఇన్ఫెక్షన్ మరింత పెరిగే ప్రమాదం ఉంది. ప్రథమ చికిత్స చేసిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించాలి.

టీకా ఎప్పుడు అవసరం అంటే..?

కుక్క కరిచిన ప్రతిసారీ ఒకే రకమైన చికిత్స ఉండదు. గాయం తీవ్రతను బట్టి డాక్టర్లు చికిత్సను నిర్ణయిస్తారు. టీకా అవసరం లేని పరిస్థితి: చర్మంపై ఎలాంటి గాయం లేనప్పుడు జంతువు కేవలం తాకినా లేదా నాకినా సాధారణంగా రేబిస్ టీకా అవసరం ఉండదు. అయితే, డాక్టర్‌ను సంప్రదించి నిర్ధారించుకోవడం మంచిది. రక్తం రాకపోయినా చర్మంపై చిన్న గీతలు పడినా, పంటి గాట్లు పడినా దానిని 'రేబిస్ ఎక్స్‌పోజర్'గా పరిగణిస్తారు. అప్పుడు కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి.

అత్యవసర పరిస్థితి..

లోతైన గాయాలై రక్తం వచ్చినా, చర్మం తెగి ఉన్న చోట కుక్క లాలాజలం పడినా, లేదా కళ్లు, నోరు వంటి సున్నితమైన భాగాల వద్ద నాకినా అది తీవ్రమైన ముప్పు. ఇలాంటి సమయాల్లో రేబిస్ టీకాతో పాటు 'రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్' (Rabies Immunoglobulin) కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

కుక్క కరిచిన తర్వాత టీకా వేయించుకోవడానికి నిర్లక్ష్యం చేయకూడదు. రేబిస్ వ్యాధి లక్షణాలు కనిపించే వరకు వేచి చూడటం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. వెంటనే వైద్యుడిని కలిస్తే, గాయం తీవ్రతను బట్టి వ్యాక్సిన్ షెడ్యూల్‌ను నిర్ణయిస్తారు. డాక్టర్లు సూచించిన డోసులన్నీ సరైన సమయానికి తప్పకుండా పూర్తి చేయాలి. సగం డోసులు వేసి వదిలేయకూడదు.

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.