Phototherapy : ఫోటోథెరపీ అంటే ఏమిటి..? ఇది ఎలా పనిచేస్తుంది..?
సాక్షి లైఫ్ : నవజాత శిశువుల్లో రక్తంలో బిలిరుబిన్ (Bilirubin) స్థాయిలు పరిమితికి మించి పెరిగినప్పుడు వైద్యులు ప్రాథమికంగా సూచించే సురక్షితమైన చికిత్సా పద్ధతి ఫోటోథెరపీ (Phototherapy). సరైన సమయంలో ఈ చికిత్స అందించడం వల్ల బిలిరుబిన్ మెదడుకు చేరకుండా అడ్డుకోవచ్చు. ఫోటోథెరపీ అంటే ప్రత్యేక తరంగదైర్ఘ్యం కలిగిన కాంతి ప్రధానంగా నీలిరంగు కాంతి (Blue light) ద్వారా చేసే చికిత్స.
పనిచేసే విధానం.. శిశువు శరీరంపై ఈ నీలికాంతి పడినప్పుడు, చర్మ కణాల్లో ఉన్న బిలిరుబిన్ రసాయన నిర్మాణం మారుతుంది. ఇది నీటిలో కరిగే రూపం (Lumirubin) లోకి మారి, కాలేయంతో సంబంధం లేకుండానే మూత్రం, మలం ద్వారా సులభంగా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది.
చికిత్స ఎలా అందిస్తారు..?
శిశువు దుస్తులు తొలగించి, గరిష్ఠ శరీర ఉపరితలంపై కాంతి పడేలా ప్రత్యేక వార్మర్ లేదా ఇంక్యుబేటర్‌లో ఉంచుతారు. కాంతి తీవ్రత నుంచి రక్షణ కోసం శిశువు కళ్లకు ప్రత్యేక ఐ-ప్యాచెస్ (Eye patches) పెడతారు.
మర్మాంగాల భాగాన్ని చిన్న డైపర్ తో కప్పుతారు.
ఫోటోథెరపీ చికిత్స అందించే సమయంలో ఆసుపత్రిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉంటూ పలు కీలక జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా చికిత్సలో వాడే తీవ్రమైన నీలికాంతి శిశువు రెటీనాపై నేరుగా పడకుండా కంటి రక్షణ కోసం ప్రత్యేక ఐ-ప్యాచెస్ అమర్చుతారు. అవి జారిపోకుండా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారు.
అలాగే లైట్ల నుంచి వెలువడే వేడిమి వల్ల బిడ్డకు జ్వరం రాకుండా లేదా శిశువు శరీరం చల్లబడిపోకుండా శరీర ఉష్ణోగ్రతను క్రమం తప్పకుండా కొలుస్తూ సమతుల్యతను కాపాడతారు. డీహైడ్రేషన్‌ను నివారించేందుకు ప్రతి 2 నుంచి 3 గంటలకోసారి ఫోటోథెరపీని కాసేపు ఆపి, తల్లిపాలు పట్టేందుకు అనుమతిస్తారు. దీనితో పాటు, శరీరంలో బిలిరుబిన్ మోతాదు ఎంతమేర తగ్గుతోందనేది నిర్ధారించుకోవ డానికి నిర్ణీత కాల వ్యవధుల్లో సీరం బిలిరుబిన్ రక్త పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స పురోగతిని పర్యవేక్షిస్తారు.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక పాటించాల్సిన జాగ్రత్తలు..
ఫోటోథెరపీ ముగిసి బిలిరుబిన్ సాధారణ స్థాయికి చేరిన తర్వాత శిశువును డిశ్చార్జ్ చేస్తారు. అయితే, ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. బిడ్డకు రోజూ కనీసం 8 నుంచి 12 సార్లు తల్లిపాలు ఇవ్వాలి. శిశువు ఎంత ఎక్కువగా పాలు తాగితే, మలమూత్రాల ద్వారా మిగిలిన వ్యర్థాలు అంత వేగంగా బయటకు వెళ్లిపోతాయి.
శిశువు రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తోందో ..కనీసం 6-8 సార్లు తడి డైపర్లు, మలం రంగు సాధారణ స్థితికి వస్తోందో లేదో గమనించాలి. ఫోటోథెరపీ ఆపిన 24 నుంచి 48 గంటల్లో కొందరిలో బిలిరుబిన్ స్వల్పంగా మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. చర్మం మళ్లీ ఎక్కువగా పసుపు రంగులోకి మారుతుంటే వెంటనే వైద్యుడికి చూపించాలి.
పాతకాలంలో పసిపిల్లలను ఉదయం ఎండలో ఉంచేవారు. అయితే, లేత ఎండ శరీరానికి విటమిన్-డి సమకూర్చడానికి కొంతవరకు తోడ్పడినా, ఇది ఫోటోథెరపీకి ప్రత్యామ్నాయం కాదు. శిశువును నేరుగా తీవ్రమైన ఎండలో ఉంచడం వల్ల చర్మం కాలిపోవడం లేదా డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంది. వైద్యులు సూచించిన తేదీన తప్పకుండా పునఃపరిశీలన (Follow-up) కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి బిలిరుబిన్ స్థాయులను సరిచూసుకోవాలి.
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ లక్షణాలు..?
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
