పిల్లలలో టైప్-2 డయాబెటీస్ కు కారణాలు..?
సాక్షి లైఫ్: మధుమేహం... ఒక్కసారి వస్తే వదలని జబ్బు. పెద్దల్లో సర్వసాధారణమైపోతోంది కూడా. అయితే దురుదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇటీవలి కాలంలో ఈ జబ్బు పిల్లల్లోనూ పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు పిల్లల్లో టైప్-2 మధుమేహ బాధితులు ఎక్కువ అవుతున్నారని అంటున్నారు కింగ్‌జార్జ్ మెడికల్ యూనివర్శిటీ వైద్య నిపుణులు. ‘‘మధుమేహ చికిత్స చేస్తున్న వాళ్లలో ఇప్పుడ ఏడవ తరగతి పిల్లలూ ఉంటున్నారు. ఆ కుర్రాడి కుటుంబంలో ఎవరికీ ఈ సమస్య లేదు. అయినా సరే. కుర్రాడు మాత్రం వ్యాధి బారిన పడ్డాడు’’ అని కింగ్‌గ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ మెడిసిన్ విభాగం సీనియర్ సిబ్బంది కౌసర్ ఉస్మాన్ తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతోందని ఉస్మాన్ చెబుతున్నారు.
వంశపారంపర్యంగా కంటే..
పిల్లల్లో టైప్-2 మధుమేహానికి వంశపారంపర్య లక్షణాల కంటే ఈ కాలపు జీవనశైలే ఎక్కువ కారణమవుతోందని చెబుతున్నారు... ఎన్.ఎస్.వర్మ. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం అధిపతి అయిన ఈయన మాట్లాడుతూ..“పిల్లలు ఇప్పుడు బయట ఆహారం ఎక్కువగా తింటున్నారు, పాఠశాలలకు ఇంట్లోంచి భోజనం తెచ్చుకోవడం లేదు" అని అన్నారు.
ఒత్తిడిని గుర్తించాలి..
రకరకాల ఒత్తిళ్ల కారణంగా ఈ కాలపు తల్లిదండ్రులు వండిన ఆహారానికి బదులు డబ్బులిచ్చి బయట తినమని పిల్లలకు చెబుతున్నారు. పైగా అన్ని రంగాల్లోనూ బాగా రాణించాలన్న ఒత్తిడి కూడా పిల్లలపై పెంచుతున్నారు. చిన్నప్పటి నుంచే వైద్యం, లేదా ఇంజినీరింగ్ చదవాల్సిందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ పిల్లల్లో మానసిక ఒత్తిడిని పెంచేస్తున్నాయి. గతంలో ఈ ఒత్తిడి అనేది పదవ తరగతి పూర్తయిన తరువాతే కనిపిచేదని కానీ ఇప్పుడు నాలుగైదు తరగతుల విద్యార్థుల్లోనూ కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. " కుటుంబంలో ఎవరికీ డయాబెటిస్ లేకున్నా,.. పిల్లల్లో ఈ వ్యాధి కనిపిస్తోందని, 17 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులను ప్రభావితం చేస్తుంది" అని ఉస్మాన్ చెబుతున్నారు.
ప్రీ-డయాబెటిస్..
ప్రొఫెసర్ వర్మ మాట్లాడుతూ.. “ ICMR డేటా ప్రకారం... ఉత్తరప్రదేశ్‌లోని జనాభాలో వయస్సుతో సంబంధం లేకుండా 18 శాతం మందికి మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ICMR అధ్యయనం ప్రకారం, వారు ప్రీ-డయాబెటిస్ విభాగంలోకి వస్తారు. వారు ఇప్పటికీ మధుమేహాన్ని నిరోధించగలరు, కానీ వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరం.'' రోజూ కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని,ఆహారపు అలవాట్లను సమీక్షించుకుని శరీరానికి ఏది సరిపోతుందో అదే తినాలని ఆయన సూచించారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
