Headache : తరచూ తలనొప్పికి కేవలం ఒత్తిడే కాదు.. ఇవి కూడా  కారణాలు కావొచ్చు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : తలనొప్పి అనేది చాలా సాధారణ సమస్య. పని ఒత్తిడి, ఆఫీసులో టెన్షన్ లేదా నిద్రలేమి వల్లే ఇది వస్తుందని చాలామంది భావిస్తుంటారు. కాస్త విశ్రాంతి తీసుకున్నా, ఓ కప్పు టీ తాగినా తగ్గిపోతుందని కొట్టిపారేస్తుంటారు. కానీ, తరచూ తలనొప్పి వేధిస్తుంటే, క్రమంగా నొప్పి తీవ్రత పెరుగుతుంటే మాత్రం దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. పదే పదే వచ్చే తలనొప్పి వెనుక పలు అనారోగ్య కారణాలు దాగి ఉండొచ్చు. అవేంటో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

1. మైగ్రేన్ సమస్య..

తలకు ఒకవైపు లేదా రెండు వైపులా తీవ్రమైన, పల్సేటింగ్ ..నరాలు లాగుతున్నట్లు నొప్పి వస్తుంటే అది మైగ్రేన్ కావొచ్చు. ఈ సమస్య ఉన్నవారు వెలుతురు, శబ్దాలను అస్సలు తట్టుకోలేరు. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు వికారం, వాంతులు కూడా అవుతుంటాయి.

2. కళ్లపై తీవ్ర ఒత్తిడి..

గంటల తరబడి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు చూడటం వల్ల కళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దృష్టి లోపం ఉన్నా, కళ్లపై భారం పడినా అది తలనొప్పికి దారి తీస్తుంది. అందుకే డిజిటల్ స్క్రీన్లు చూసేటప్పుడు మధ్యమధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం.

3. డీహైడ్రేషన్..

శరీరానికి తగినంత నీరు అందకపోవడం తలనొప్పికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఎండలో తిరగడం వల్ల ఎక్కువగా చెమట పట్టినా, లేదా రోజువారీగా తక్కువ నీళ్లు తాగినా డీహైడ్రేషన్ బారిన పడతారు. దీనివల్ల నీరసంతో పాటు తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

4. నిద్రలేమి, ఆహారపు అలవాట్లు..

రోజూ సరిపడా నిద్ర లేకపోవడం, షిఫ్టుల వల్ల నిద్రపోయే సమయాలు మారిపోవడం తలనొప్పికి దారి తీస్తాయి. అంతేకాకుండా ఉదయం అల్పాహారం మానేయడం, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కూడా మెదడుకు తగినంత శక్తి అందక తలనొప్పి బాధిస్తుంది.

5. సైనస్, ఇతర ఇన్ఫెక్షన్లు..

వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడినప్పుడు సైనస్ తలనొప్పి వస్తుంది. ముఖం, నుదురు భాగంలో భారం అనిపిస్తుంది. దీనితో పాటు జ్వరం, మెడ పట్టేయడం వంటివి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

6. పెయిన్ కిల్లర్స్ అతివాడకం..

నొప్పి రాగానే మెడికల్ షాపుకెళ్లి పెయిన్ కిల్లర్ తెచ్చుకుని వేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇలా తరచూ మందులు వాడటం వల్ల 'రీబౌండ్ హెడేక్' వచ్చే ప్రమాదం ఉంది. అంటే, మందుల వల్లే మళ్లీ మళ్లీ తలనొప్పి వస్తుందన్నమాట. వారంలో రెండు కంటే ఎక్కువసార్లు పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తే తప్పక వైద్యుల సలహా తీసుకోవాలి.

ఉపశమనం కోసం ఏం చేయాలి..?

రోజూ శరీరానికి సరిపడా నీరు తాగాలి. పోషకాహారం సమయానికి తీసుకోవాలి. కనీసం 7 నుంచి 8 గంటల పాటు కంటినిండా నిద్రపోవాలి. నిరంతరం స్క్రీన్లు చూడకుండా ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కళ్లకు విరామం ఇవ్వాలి. వైద్యుల సూచన లేకుండా సొంతంగా నొప్పి నివారణ మాత్రలు మింగకూడదు. జీవితంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా అకస్మాత్తుగా తలనొప్పి వస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. తలనొప్పితో పాటు తీవ్రమైన జ్వరం, మెడ బిగుసుకుపోవడం, చేతులు లేదా కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం, మాట తడబడటం, కళ్లు బైర్లు కమ్మడం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎమర్జెన్సీ వైద్య సహాయం తీసుకోవాలి.

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.