Childhood Obesity : తాజా అధ్యయనం : చైల్డ్ హుడ్ ఒబేసిటీ.. మాతృత్వానికి శాపం..!
సాక్షి లైఫ్ : పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నారని మురిసిపో కండి. ఆ అధిక బరువే వారి పాలిట శాపంగా మారొచ్చు. ముఖ్యంగా ఆడపిల్లల్లో చిన్ననాటి ఊబకాయం (childhood obesity) వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వారు తల్లి అయ్యే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. అధిక బరువు కారణంగా చిన్న వయసులోనే మధుమేహం, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయన్న విషయం తెలిసిందే. అయితే, దీని వల్ల ఆడపిల్లల్లో భవిష్యత్తులో సంతానలేమి (infertility) సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..Hands and Legs Numbness : కాళ్లు, చేతులు మొద్దుబారుతున్నాయా..? ఎప్పుడు సాధారణం.. ఎప్పుడు ప్రమాదం..?
ఇది కూడా చదవండి..Diabetes and Fatty Liver Risk : మధుమేహంతో ఫ్యాటీ లివర్ ముప్పు.. 70 శాతం రోగుల్లో ఈ సమస్యే..!
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
అధ్యయనంలో ఏం తేలిందంటే..?
ప్రముఖ మెడికల్ జర్నల్ 'జామా' (JAMA)లో ప్రచురితమైన ఓ తాజా అధ్యయనం ఈ ఆందోళనకర విషయాలను వెల్లడించింది. కోపెన్హాగన్ యూనివర్సిటీ ఆసుపత్రి పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర, కలవరపెట్టే నిజాలు వెలుగుచూశాయి.
42 శాతం తక్కువ అవకాశం..
6 ఏళ్ల వయసు నుంచే స్థూలకాయం లేదా అధిక బరువుతో బాధపడుతున్న ఆడపిల్లల్లో.. 30 నుంచి 35 ఏళ్ల వయసు వచ్చే సరికి తల్లి అయ్యే అవకాశాలు, సాధారణ బరువు ఉన్నవారితో పోలిస్తే 42 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
దీర్ఘకాలిక పరిశోధన..
1950 నుంచి 1989 మధ్య జన్మించిన సుమారు 60,864 మంది మహిళల ఆరోగ్య డేటాను పరిశోధకులు విశ్లేషించారు. వారి పాఠశాల దశలోని బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 78 శాతం మంది సగటున 27 ఏళ్ల వయసులో పిల్లలకు జన్మనివ్వగా, 22 శాతం మంది సంతానలేమితో మిగిలిపోయారు. ఈ 22 శాతం మందిలో ఎక్కువ శాతం మంది చిన్ననాటి నుంచే ఊబకాయులు కావడం గమనార్హం.
ఎందుకిలా జరుగుతుంది..?
వయసు పైబడటం, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం వంటివి సంతానలేమికి ప్రధాన కారణాలని ఇప్పటివరకు భావించేవారు. కానీ, చిన్ననాటి ఊబకాయం కూడా దీనికి ఒక బలమైన కారణమని తాజా పరిశోధన స్పష్టం చేస్తోంది.
అండాల నాణ్యత లోపం..
డాక్టర్ డోర్తే పెడెర్సన్, డాక్టర్ జెన్నిఫర్ బేకర్ అనే నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న వయసులోనే ఊబకాయం రావడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది నేరుగా అండాల నాణ్యతను దెబ్బతీస్తుంది.
పునాది చిన్నప్పుడే..
వయసు పెరిగాక పిల్లల కోసం ప్రయత్నించేటప్పుడు చాలామందికి సంతానలేమి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే, ఈ సమస్యకు బీజం వాళ్ల చిన్నతనంలోనే పడి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు.
తల్లిదండ్రులు ఏం చేయాలి..?
సంతానలేమి అనేది కేవలం పెద్దల సమస్య మాత్రమే కాదు. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు పాఠశాల విద్యార్థినుల్లో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇది భవిష్యత్తు తరాలకు అతిపెద్ద ముప్పు.
తల్లిదండ్రులు తమ పిల్లల బరువు, బీఎంఐ (BMI) పట్ల చిన్నప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారిని జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచుతూ, పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం అందించాలి. రోజువారీగా శారీరక వ్యాయామం, ఆటల వైపు వారిని ప్రోత్సహించాలి. చిన్న వయసులోనే బరువును నియంత్రిస్తే, భవిష్యత్తులో వచ్చే అతిపెద్ద గర్భధారణ సమస్యల నుంచి ఆడపిల్లలను కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి..Menopause effect : మహిళలూ.. హెచ్ఆర్టీతో జాగ్రత్త ..! శృతి మించితే ప్రాణాంతకమే..!
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
