Health Risks : కూర్చుని లేవగానే కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా..? అయితే ఈ ముప్పు ఉన్నట్లే.. ఇలా గుర్తించండి..!
సాక్షి లైఫ్ : మన శరీరం ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే అవయవాలన్నింటికీ రక్త ప్రసరణ సక్రమంగా జరగాలి. దీనికోసం మన గుండె నిరంతరం రక్తాన్ని సరఫరా చేస్తూనే ఉంటుంది. ధమనుల గుండా రక్తం ప్రవహించేటప్పుడు వాటి గోడలపై పడే ఒత్తిడినే 'రక్తపోటు (బ్లడ్ ప్రెషర్)' అంటారు. సాధారణంగా హై బీపీ, లో బీపీ సమస్యల గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. కానీ, మీరు ఎప్పుడైనా 'పోశ్చురల్ హైపోటెన్షన్' (Postural Hypotension) గురించి విన్నారా..? పేరు కొత్తగా అనిపించినా.. జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ సమస్యను దాదాపు అందరూ అనుభవించే ఉంటారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఏమిటీ పోశ్చురల్ హైపోటెన్షన్..?
మీరు ఎప్పుడైనా పడుకుని నిద్రలేచిన వెంటనే లేదా కుర్చీలో ఎక్కువసేపు కూర్చుని అకస్మాత్తుగా నిలబడినప్పుడు తల తిరిగినట్లు అనిపించిందా..? కళ్ల ముందు చీకట్లు కమ్మడం, బ్యాలెన్స్ తప్పి పడిపోతామేమో అన్న భయం కలగడం వంటివి జరిగాయా..? చాలామంది దీనిని సాధారణ నీరసం లేదా అలసటగా భావించి తేలిగ్గా తీసుకుంటారు. కానీ, వైద్య పరిభాషలో దీనిని 'పోశ్చురల్ హైపోటెన్షన్' లేదా 'ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్' అని పిలుస్తారు. ఇది ఎప్పుడో ఒకసారి జరిగితే పర్వాలేదు కానీ, తరచుగా తల తిరగడం, కళ్లు మసకబారడం లేదా స్పృహ తప్పిపోవడం వంటివి జరిగితే మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు.
అకస్మాత్తుగా బీపీ ఎందుకు పడిపోతుంది..?
మనం అకస్మాత్తుగా నిలబడినప్పుడు, గురుత్వాకర్షణ శక్తి కారణంగా శరీరంలోని రక్తం కొంతమేర కాళ్లు, పొట్ట కింది భాగంలోకి చేరుతుంది. సాధారణ ఆరోగ్యవంతుల్లో అయితే.. ఆ సమయంలో నరాలు ముడుచుకుని, గుండె స్పందనల వేగం పెరిగి రక్తపోటును వెంటనే బ్యాలెన్స్ చేస్తాయి. కానీ, ఎప్పుడైతే శరీరం ఈ సమతుల్యతను సాధించలేకపోతుందో అప్పుడు అమాంతం బీపీ పడిపోతుంది. మనం నిలబడిన మూడు నిమిషాల వ్యవధిలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 20 mmHg లేదా డయాస్టోలిక్ 10 mmHg కంటే ఎక్కువగా పడిపోతే దాన్ని పోశ్చురల్ హైపోటెన్షన్గా గుర్తిస్తారు.
ప్రధాన కారణాలివే..
ఈ సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో తగినంత నీరు లేకపోవడం (Dehydration). రక్తపోటును తగ్గించే కొన్ని రకాల మందుల దుష్ప్రభావం. మధుమేహం (Diabetes), నరాలకు సంబంధించిన సమస్యలు. పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత (Neurological disorders) వ్యాధులు. శరీరంలో రక్తం కొరత (Anemia), గుండె సంబంధిత సమస్యలు, అనారోగ్యంతో ఎక్కువ కాలం మంచానికే పరిమితమవ్వడం.
ప్రమాదాలు - నివారణ చర్యలు..?
పదే పదే ఇలా బీపీ పడిపోవడం వల్ల స్పృహతప్పి ఒక్కసారిగా కింద పడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల తలకు తీవ్రమైన గాయాలు కావడం లేదా ఎముకలు విరగడం జరగవచ్చు. వయసు పైబడిన వారిలో ఈ ముప్పు మరింత ఎక్కువ. పడుకున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా, వేగంగా పైకి లేవకూడదు.
మంచం మీద నుంచి లేచేటప్పుడు ముందుగా కాసేపు కూర్చుని, ఆ తర్వాత నెమ్మదిగా నిలబడాలి.శరీరంలో నీటి శాతం తగ్గకుండా రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్న ప్పటికీ సమస్య పదే పదే బాధిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి, అసలు కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
