Nail health : గోళ్లు మీ ఆరోగ్యానికి అద్దం: ఈ మార్పులను అస్సలు విస్మరించకండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మనం ముఖ సౌందర్యంపై చూపే శ్రద్ధ, గోళ్ల మీద పెద్దగా చూపం. కానీ, మన శరీరంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలను ముందే పసిగట్టి హెచ్చరించే లక్షణం గోళ్లకు ఉంటుంది. పోషకాల లోపం, ఇన్ఫెక్షన్లు మొదలుకొని కాలేయం, కిడ్నీ, థైరాయిడ్ వంటి తీవ్రమైన సమస్యల వరకు.. గోళ్ల రంగు, ఆకృతిలో వచ్చే మార్పులు మనకు ఎన్నో సంకేతాలు ఇస్తాయి. అవేంటో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

పసుపు రంగులోకి మారడం..

గోళ్లు క్రమంగా పసుపు రంగులోకి మారుతుంటే అది ప్రధానంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ కు సంకేతం. అంతేకాకుండా సోరియాసిస్, ధూమపానం వంటి కారణాల వల్ల కూడా ఇలా జరుగుతుంది. గోళ్లు మందంగా మారి, సులభంగా విరిగిపోతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

నీలం రంగులోకి మారడం..

గోళ్లు నీలం లేదా ఊదా రంగులోకి మారితే శరీరానికి తగినంత ఆక్సిజన్ అందడం లేదని అర్థం. చలి తీవ్రత వల్ల కూడా తాత్కాలికంగా ఇలా జరగవచ్చు. కానీ, సాధారణ ఉష్ణోగ్రత వద్ద కూడా గోళ్లు నీలంగా ఉంటూ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే అది గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలకు సూచన కావచ్చు. పెదవులు, గోళ్లు అకస్మాత్తుగా నీలంగా మారితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

తెల్లటి మచ్చలు..

గోళ్లపై చిన్న తెల్లని మచ్చలు రావడం సాధారణమే. ఏదైనా దెబ్బ తగలడం లేదా ఒత్తిడి పడటం వల్ల ఇలా జరుగుతుంది. దీన్ని ప్రతిసారీ క్యాల్షియం లేదా విటమిన్ లోపంగా భావించకూడదు. అయితే మచ్చలు పెద్దవిగా మారి, రంగులో నిరంతర మార్పు ఉంటే మాత్రం వైద్య సలహా తీసుకోవాలి.

తరచుగా విరిగిపోవడం.. 

చిన్న ఒత్తిడికే గోళ్లు పొరలుగా విడిపోయి విరిగిపోతుంటే.. వాటికి బలం లేదని అర్థం. రసాయనాలు, నీటి ప్రభావం ఎక్కువగా ఉండటం, ఐరన్ లోపం, థైరాయిడ్ సమస్యలు, వృద్ధాప్యం దీనికి ప్రధాన కారణాలు.

నల్లటి గీతలు ఏర్పడటం..

వయసు పెరిగే కొద్దీ గోళ్లపై నిలువుగా గీతలు రావడం సహజం. కానీ అకస్మాత్తుగా ముదురు నలుపు లేదా గోధుమ రంగు గీతలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు దెబ్బ తగలడం వల్ల ఇలా జరిగినా, అరుదైన సందర్భాల్లో ఇది మెలనోమా (skin cancer) కు సంకేతం కావచ్చు. ఈ గీతలు వెడల్పుగా మారుతున్నా, పక్క చర్మానికి వ్యాపిస్తున్నా చర్మవ్యాధి నిపుణులను (dermatologist) కలవాలి.

చెంచా ఆకారంలో గోళ్లు..

గోళ్లు మధ్యలో గుంటలా పడి, అంచులు పైకి లేచి చెంచా (Koilonychia) ఆకారంలో ఉంటే అది తీవ్రమైన ఐరన్ లోపం (Anemia)తో బాధపడుతున్నారనడానికి సంకేతం. జన్యుపరమైన కారణాలు, ఇతర అనారోగ్య సమస్యల వల్ల కూడా ఇలా జరగవచ్చు.

గోళ్లు మందంగా మారడం.. 

గోళ్లు అకస్మాత్తుగా మందంగా, పసుపు రంగులో, పెళుసుగా మారడం ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను సూచిస్తుంది. సోరియాసిస్ వల్ల కూడా ఇలా జరుగుతుంది. సొంత వైద్యం చేసుకోకుండా సరైన నిర్ధారణ కోసం డాక్టర్‌ను కలవడం ముఖ్యం.

వేళ్ల చుట్టూ వంగిపోవడం..

 గోళ్లు గుండ్రంగా ఉబ్బి, వేళ్ల చివర్ల చుట్టూ వంగి ఉంటే దాన్ని నెయిల్ క్లబ్బింగ్ (Nail Clubbing) అంటారు. ఇది ఊపిరితిత్తులు, గుండె, కాలేయం లేదా పేగులకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉంటుంది. ఈ మార్పు క్రమంగా పెరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. గోళ్లలో వచ్చే ప్రతి మార్పూ ప్రమాదకరమైన వ్యాధికి సంకేతం కాదు. అయితే, ఈ అసాధారణ మార్పులు సుదీర్ఘకాలం పాటు వేధిస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.