Eye Health : మీ రోజువారీ చిన్న తప్పులతోనే కంటి సమస్యలకు ముప్పు.. వెంటనే సరిదిద్దుకోండిలా..!
సాక్షి లైఫ్ : మన శరీరంలో అత్యంత కీలకమైన, సున్నితమైన అవయవాల్లో కళ్లు ముందు వరుసలో ఉంటాయి. కంటిచూపు లేనిదే లోకాన్ని చూడలేం, ఏ పనీ చేసుకోలేం. అయినా సరే మనం కళ్ల ఆరోగ్యాన్ని తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటాం. ఆధునిక జీవనశైలి, గంటల తరబడి స్మార్ట్ఫోన్లు వాడటం, పోషకాహార లోపం, నిద్రలేమి వంటివి కంటి సమస్యలకు ప్రధాన కారణాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు వయసు పైబడిన వారికే దృష్టి లోపాలు వచ్చేవి, కానీ ఇప్పుడు చిన్నపిల్లలు సైతం కళ్లద్దాలు వాడుతున్నారు. మరి మన కంటికి కీడు చేస్తున్న ఆ అలవాట్లు ఏమిటి..? వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
డిజిటల్ స్క్రీన్లతో పొంచి ఉన్న ప్రమాదం..
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్, ల్యాప్టాప్, టీవీలకే అతుక్కుపోతున్నాం. గంటల తరబడి స్క్రీన్లను రెప్పవేయకుండా చూడటం వల్ల కళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కళ్లు పొడిబారడం, మంటలు, దురద, అలసట, చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి. వైద్య పరిభాషలో దీనినే 'డిజిటల్ ఐ స్ట్రెయిన్' (Digital Eye Strain) అంటారు. పని మధ్యలో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కళ్లకు విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం.
కంటికి కావాలి సరైన పోషకాహారం..
కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినన్ని విటమిన్లు, మినరల్స్ అందాలి. ముఖ్యంగా విటమిన్ ఎ, సి, ఇ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి లోపం వల్ల కంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. కంటి ఆరోగ్యానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో అవసరం. మీ రోజువారీ ఆహారంలో క్యారెట్, బచ్చలికూర, పాలకూర లాంటి ఆకుకూరలు, బ్రకోలీ, చేపలు వంటివి తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. సమతులాహారం తీసుకోవడంతో పాటు శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి. అప్పుడే కళ్లలో తగినంత తేమ ఉంటుంది.
నిద్రలేమితోనూ చిక్కులే..
నిద్రలేమి ప్రభావం కేవలం శరీరంపైనే కాకుండా కళ్లపై కూడా తీవ్రంగా పడుతుంది. సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల కళ్లు ఎర్రబడటం, వాపు, అలసటగా అనిపించడం జరుగుతుంది. కొన్నిసార్లు కళ్లలో తీవ్రమైన మంట, పొడిబారినట్లు అనిపిస్తుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం తప్పనిసరి. నిద్రించడానికి కనీసం గంట ముందు మొబైల్, ల్యాప్టాప్ వాడటం మానేయాలి.
నిద్రపోయే సమయం, మేల్కొనే సమయం ప్రతిరోజూ ఒకేలా ఉండేలా మీ దినచర్యను మార్చుకోవాలి. జీవనశైలిలో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. కంటికి సంబంధించిన సమస్యలు మంటలు, చూపు మందగించడం, నొప్పి వంటివి రెండు మూడు రోజుల కంటే ఎక్కువగా బాధిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆప్తాల్మాలజిస్ట్ సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
