Best diet : శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే ఆకుకూరలు.. మీ ప్లేట్లో తప్పక ఉండాల్సినవి..!
సాక్షి లైఫ్ : చలికాలం ఎన్నో రకాల తాజా ఆకుకూరలను, కూరగాయలను మన ముందుకు తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆవకూర , మెంతికూర, బతువా లాంటి సీజనల్ ఆకుకూరలను డైట్లో చేర్చుకోవడం వల్ల వంటకాల రుచి పెరగడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఈ చలికాలంలో మీ ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన ఆకుకూరలు, వాటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఆవకూర (Mustard Greens / Sarson Ka Saag)..
శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో అత్యంత ఇష్టంగా తినే సంప్రదాయ వంటకం ఇది. ఆవ ఆకుల్లో విటమిన్ 'కె', ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. దీన్ని పాలకూర లేదా బతువాతో కలిపి వండుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా సొంతమవుతుంది.
2. పాలకూర (Spinach)..
దీన్ని బహుముఖ ఆకుకూరగా చెప్పవచ్చు. పాలకూరలో ఐరన్, ఫోలేట్, కెరోటినాయిడ్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పప్పు, కూర, సూప్ లేదా పరాఠా.. ఇలా ఏ రూపంలో తీసుకున్నా మంచిదే.
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
3. మెంతికూర (Fenugreek Leaves)..
చలికాలంలో మెంతికూర ఎంతో తాజాగా లభిస్తుంది. ఫైబర్‌తో పాటు వృక్ష ఆధారిత పోషకాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. మెంతి పరాఠా, పప్పు లేదా కూర రూపంలో తీసుకుంటే రుచితో పాటు పోషకాలు దక్కుతాయి.
4. బతువా ఆకు (Bathua)..
ఇది చలికాలంలో మాత్రమే ఎక్కువగా లభించే ప్రత్యేకమైన ఆకుకూర. ఇందులో ఫైబర్‌తో పాటు విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని కూరగా, పరాఠాలో లేదా పెరుగుతో కలిపి తీసుకోవచ్చు.
5. తోటకూర (Amaranth Leaves)..
శీతాకాలపు డైట్లో తోటకూరకు కచ్చితంగా చోటు కల్పించాలి. దీంట్లో ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. పప్పులో వేసి వండుకున్నా, వేపుడు చేసుకున్నా ఎంతో మేలు చేస్తుంది.
6. మునగాకు (Moringa Leaves)..
పోషకాల గనిగా మునగాకుకు పేరుంది. రకరకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో దొరుకుతాయి. మునగాకును పప్పు, కూర లేదా సూప్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
7. పచ్చి వెల్లుల్లి (Green Garlic)..
చలికాలంలో లభించే పచ్చి వెల్లుల్లి వంటలకు మంచి సువాసన, రుచిని అందిస్తుంది. ఇందులో సల్ఫర్ ఆధారిత సమ్మేళనాలు ఉంటాయి. దీన్ని చట్నీ, కూరలు లేదా పరాఠాల్లో వాడుకోవచ్చు.
8. ఉల్లికాడలు (Spring Onions)..
ఉల్లికాడలు కూడా శీతాకాలంలో వంటకాల రుచిని రెట్టింపు చేస్తాయి. విటమిన్ 'కె' తో పాటు పలు రకాల పోషకాలు ఇందులో ఉంటాయి. సూప్స్, సలాడ్స్, కూరల్లో దీన్ని విరివిగా వాడొచ్చు.
9. టర్నిప్ ఆకులు (Turnip Greens)..
చాలామంది టర్నిప్ దుంపను వాడి ఆకులను పారేస్తుంటారు. కానీ ఆకుల్లోనే ఫైబర్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఇతర ఆకుకూరలతో కలిపి వండుకుంటే పోషకాలన్నీ శరీరానికి అందుతాయి.
10. ఎర్ర తోటకూర (Red Amaranth)..
ఎర్రటి రంగులో ఆకర్షణీయంగా ఉండే ఈ ఆకుకూరలో ఫైబర్, మినరల్స్‌తో పాటు వృక్ష సంబంధిత సహజ రంగులు (phytonutrients) ఉంటాయి. దీన్ని విడిగా కానీ, ఇతర ఆకుకూరలతో కలిపి కానీ వండుకోవచ్చు.
ఆకుకూరలు తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
వండటానికి లేదా కత్తిరించడానికి ముందే ఆకుకూరలను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఎప్పుడూ తాజా, శుభ్రమైన ఆకుకూరలనే కొనుగోలు చేయాలి. కూరల ను మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు, అలా చేస్తే వాటిలోని పోషకాలు ఆవిరైపోతాయి. రోజూ ఒకే రకమైన ఆకుకూర కాకుండా, రకరకాల ఆకుకూరలను మార్చి మార్చి తినాలి. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే లేదా ఆహార నియమాలు పాటిస్తుంటే, మీ డైటీషియన్ లేదా వైద్యుల సలహా మేరకే డైట్‌ను ఎంచుకోవాలి.
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
