న్యూ స్టడీ : ఉప్పు ఎక్కువ తిన్నా మధుమేహం?

షేర్ చేయండి:
న్యూ స్టడీ : ఉప్పు ఎక్కువ తిన్నా మధుమేహం?

సాక్షి లైఫ్ : భారత దేశంలో రోజురోజుకీ మధుమేహం తీవ్రమైన సమస్యగా మారుతోంది. షుగర్ వ్యాధి ఉన్నవారి సంఖ్య పెరగడానికి ఎన్ని కారణాలున్నా.. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల మాత్రమే మధుమేహం వస్తుందని ఇప్పటివరకూ విన్నాం కదా..? ఉప్పుతో కూడా డయాబెటిస్ వస్తుందట. ఇదే విషయం ఇటీవల జరిగిన అధ్యయనంలో తేలింది. చక్కెర మాత్రమే కాదు, ఉప్పు కూడా డయాబెటీస్ కి కారణమని తేలింది.

అధిక పరిమాణంలో తినడం వల్ల.. 

 ఉప్పు మన ఆహారంలో ముఖ్యమైన భాగం. అది లేకుండా, చాలా వంటకాలు రుచిగా అనిపించవు. సోడియం (ఉప్పు) మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. కానీ అధిక పరిమాణంలో తినడం వల్ల కూడా హాని కలుగుతుంది. అధిక ఉప్పు వల్ల కలిగే అనర్థాల గురించి మీరు తరచుగా వినే ఉంటారు, అయితే  ఎక్కువగా ఉప్పు తింటే మధుమేహానికి కూడా కారణమవుతుందని మీకు తెలుసా..? 

ఈ విషయం మేం చెప్పడం లేదు, కానీ ఈ విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధన ప్రకారం..టైప్ 2 డయాబెటీస్  వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి.


అసలు అధ్యయనం ఏం చెబుతోంది..?

తులనే యూనివర్సిటీకి చెందిన తాజా అధ్యయనంలో ఆహారంలో అదనపు ఉప్పు తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలపై దృష్టి సారించారు.  టైప్ 2 డయాబెటిస్‌తో వచ్చే ప్రమాదం ఉంటుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. బ్రిటన్‌లోని నాలుగు లక్షలమందికి సంబంధించి రోజువారీగా ఉప్పు తీసుకునే వారి అలవాట్లపై సర్వే చేసింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులను ఐదు వర్గాలుగా విభజించారు. 

అందులో "ఎప్పుడూ ఉప్పు ఎక్కువగా తినేవారు, "అరుదుగా ఎక్కువ ఉప్పు తీసుకునేవారు," "కొన్నిసార్లు మాత్రమే ఉప్పు అదనంగా తినేవారు", "నార్మల్ గా ఉప్పు తీసుకునేవారు",  "ఉప్పును ఆహారంలో ఉపయోగించని వారు. ఇలా ఐదు రకాల వారిని ఎంపిక చేశారు. వారి అలవాట్లపై ప్రత్యేకంగా పరిశోధనచేశారు. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను "మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్" జర్నల్‌లో ప్రచురించారు.

ఉప్పు వల్ల మధుమేహం ఎలా వస్తుంది.. ?

 ఆహారంలో ఉప్పు ఎక్కువగా వినియెగించడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌కు ఎలా దారి తీస్తుందనే విషయంపై పరిశోధకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉప్పు ఆహారపదార్థాల రుచిని పెంచుతుంది. దీంతో ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపిస్తున్నారని వారు తమ అధ్యయనంలో తేల్చారు. ఉప్పు ఊబకాయ సమస్యలేకాకుండా, మధుమేహ వ్యాధి ప్రమాదాన్నిపెంచుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.