తక్కువ కేలరీలున్న కూరగాయలు.. ఇవిగో..
సాక్షి లైఫ్ : తక్కువ కేలరీల కూరగాయలు కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వైద్యులు కూడా బరువు తగ్గాలనుకునేవాళ్ళు తమ ఆహారంలో కూరగాయలను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. బరువు నియంత్రణలో సహాయపడే వాటి కోసం చూస్తారు. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ తక్కువ కేలరీల కూరగాయలను తినవచ్చు.
బరువు తగ్గడానికి ఆహారం అంటే కేలరీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. డైటింగ్ చేసినా, చేయకపోయినా, బరువు తగ్గాలనుకున్న వాళ్లు తమ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన కూరగాయలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. తక్కువ కేలరీలున్న కూరగాయల గురించి తెలుసుకుందాం..
దోసకాయ..
ఇందులో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తపోటును తగ్గించడమే కాకుండా గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది.
కొత్తిమీర..
ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. గుండె, మెదడు, చర్మం, జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ "కె" రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది.
పాలకూర..
ఇందులో విటమిన్ "ఏ" , విటమిన్ "కె" ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఎముకలను ధృడంగా ఉంచుతుంది. కళ్లకు మేలు చేస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. ఫైబర్, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజ పదార్థాలు ఇందులో ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టు, చర్మంతోపాటు శరీర ఆరోగ్యానికి పనికి వచ్చే అద్భుతమైన పోషకాలున్నాయి. అంతేకాదు వెయిట్ తగ్గాలను కున్నవాళ్లకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
క్యాబేజీ..
ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడమేకాకుండా, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. క్యాబేజీ తిన్న తర్వాత, ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. తద్వారా ఆకలిని తగ్గించి, బరువును అదుపులో ఉంచుతుంది.
గుమ్మడికాయ..
కళ్ళు, చర్మం, గుండెకు మేలు చేయడమే కాకుండా, ఇందులో ఉండే కార్టినాయిడ్లు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్ల నుంచి కూడా రక్షిస్తాయి. ఇది చాలా తక్కువ కేలరీల కంటెంట్‌ను కలిగి ఉంటుంది కాబట్టి సులభంగా జీర్ణమవుతుంది.
బీన్స్..
వీటిలో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. గ్రీన్ బీన్స్ ఆరోగ్యకరమైన ఆహారంలో ప్రధానమైనవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జీర్ణ ప్రక్రియను సజావుగా అమలు చేయడంలో సహాయపడుతుంది. గుండె, ఎముకల ఆరోగ్యానికి బీన్స్ లో ఉండే పోషకాలు చాలా అవసరం.
తోటకూర..
ఇందులో విటమిన్ "ఇ", విటమిన్ "కె", ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. తోటకూర బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
