మధుమేహానికి కారణాలివే.. నివారించడానికి ఏం చేయాలి..? 

షేర్ చేయండి:
మధుమేహానికి కారణాలివే.. నివారించడానికి ఏం చేయాలి..? 

సాక్షి లైఫ్: మధుమేహానికి జీవనశైలి, ఒత్తిడి, అధిక మద్యపానం ప్రధాన కారణాలని మనం తరచూ వింటూంటాం. అయితే వీటితోపాటు ఇంకొన్ని కారణాల వల్ల కూడా మనం ఈ ఆరోగ్య సమస్య బారిన పడవచ్చు.

 
డయాబెటిస్‌...

రక్తంలో చక్కెర మోతాదులు పెరిగిపోతే... సహజసిద్ధంగా ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్‌ చక్కెర మోతాదులను నియంత్రించలేకపోతే మనం డయాబిటిస్‌ బారిన పడినట్లు లెక్క. అయితే ఈ జబ్బు జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంది.  జీవనశైలి, ఒత్తిళ్లూ కారణమవుతాయన్నది చాలాకాలంగా తెలిసిన విషయం. మధుమేహం రోగి రక్తంలో చక్కెర స్థాయులు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా సమస్యే. పరీక్షల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చక్కెర స్థాయి ఆకస్మికంగా పెరగడం లేదా ఆకస్మికంగా తగ్గడం, రెండు పరిస్థితులు రోగికి ప్రమాదకరం.  

నిద్రలేమి.. 

సరిపడా నిద్ర లేకపోవడం కూడా మధుమేహానికి కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్ర శారీరక ఒత్తిడిని తగ్గిస్తే... దాని లేమి పెంచుతుందన్నమాట. ఇది కాస్తా మధుమేహానికి దారితీసే అవకాశాలు హెచ్చు. ఆరోగ్యకరమైన జీవితానికి మనిషి (పెద్దవారు) రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరమని సైన్స్‌ చెబుతుంది.  మీరు దీనికంటే తక్కువ సమయం నిద్రపోతూంటే.. అది కూడా దీర్ఘకాలంగా చేస్తూంటే ఒకసారి మధుమేహ పరీక్షలు చేసుకోవడం మేలు. 

 శారీరక శ్రమ.. 

శారీరక శ్రమ అనేది చాలా అవసరం. తగిన శారీక  శ్రమ లేకపోతే అనేక వ్యాధులను ఆహ్వానించినట్లేనని వైద్యులు వెల్లడిస్తున్నారు. నిజానికి మనం ఏది తిన్నా, ఏ విధమైన ఎక్సర్ సైజ్ చేయకుంటే, అది శరీరంలో కొవ్వుగా పేరుకుపోతుంది. దీని వల్ల ఊబకాయం పెరుగుతుంది. ఊబకాయం అనేక హార్మోన్ల మార్పులకు కారణమవుతుంది, ఇది శరీర పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

ఒత్తిడి.. 

ఎలాంటి ఒత్తిడి అయినా ఆరోగ్యానికి హానికరమే. ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది. బీపీ పెరగడం వల్ల షుగర్ లెవెల్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒత్తిడి కూడా షుగర్ కు ప్రధాన కారణమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ఉప్పు.. 

ఆహారంలో  ఉప్పు ఎక్కువ గా తీసుకోవడం వల్ల బిపి పెరుగుతుంది.  రక్తపోటు చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. కనుక ఉప్పు తక్కువగా  తినడం మేలని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

చక్కెర.. 

ఆహారంలో చక్కెర లేదా తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయి పెరుగుతుంది. కాబట్టి తీపి పదార్థాలను తక్కువగా తీసుకోవడం ఉత్తమం. 

ధూమపానం.. 

ధూమపానం ఊపిరితిత్తులతో పాటు గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. ధూమపానం ఇన్సులిన్ పనితీరును ప్రభావితం చేస్తుంది. దీనికరణంగా కూడా మధుమేహ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.  

 మద్యం సేవించడం.. 

మద్యం సేవించడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికలుగుతుంది. దీని వల్ల ఊబకాయంతో పాటు బీపీ, షుగర్ కూడా పెరిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి.. డయాబెటిస్ అంత ప్రమాదకరమా..? ఎంత వరకు నిజం..?
 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.