సాక్షి లైఫ్ : తెల్లవెంట్రుకలు తీసేయ్యడం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి..? అసలు వైట్ హెయిర్స్ ను తొలగించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా..? అసలు అలా చేయడం వల్ల లాభమా..? నష్టమా..? ఈ డౌట్ ప్రతిఒక్కరికీ వస్తూనే ఉంటుంది. ఒక్క తెల్లవెంట్రుక తొలగిస్తే, దాని చుట్టుపక్కల ఉండే వెంట్రుకలు కూడా తెల్లగా మారుతాయంటారు. ఇది ఎంతవరకు వాస్తవం.. డెర్మటాలజిస్టులు దీనిపై ఏమంటున్నారో తెలుసుకుందాం..?
తెల్లవెంట్రుకలు..
నాలుగు పదుల వయసు దాటిన తర్వాత తెల్లవెంట్రుకలు రావడం చాల సహజం ఇది ఒకప్పటి పరిస్థితి. ప్రస్తుతం పట్టుమని పదేళ్లు నిండనివారిలో సైతం తెల్లవెంట్రుకలు వస్తున్నాయి. ఇలా తక్కువ వయసులోనే వైట్ హెయిర్స్ రావడం అనేదానికి కారణాలు చాలానే ఉన్నాయి.
తెల్లవెంట్రుకను తొలగిస్తే..
ముఖ్యంగా ఒక్క తెల్లవెంట్రుకను తొలగిస్తే పది వస్తాయనే డౌటు చాలామందిలో ఉన్నది. అంతేకాదు అది కొందరి మనసులో నాటుకుపోయింది. ఒక్క తెల్లవెంట్రుకను పీకేస్తే, ఆ వెంట్రుక చుట్టుపక్కల ఉన్న నల్ల వెంట్రుకలు కూడా తెల్లగా మారిపోతాయనుకుంటారు.
అపోహమాత్రమే..
ఇది కేవలం అపోహమాత్రమేనని ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. తెల్లవెంట్రుకలను తీసెయ్యడం వల్ల మరిన్ని వైట్ హెయిర్స్ వస్తాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వారు అంటున్నారు.
నల్లవెంట్రుకలకు..
మెలనిన్ అనే వర్ణద్రవ్యం అనేది తెల్లవెంట్రుకలకు, నల్లవెంట్రుకలకు మధ్య తేడాను నిర్ణయిస్తుందని డెర్మటాలజిస్టులు వెల్లడిస్తున్నారు. తెల్లవెంట్రుకల్లో మెలనిన్ అనేది ఉండదు. దీనిలోపం వల్లే తెల్లవెంట్రుకలు వస్తాయట. నల్లవెంట్రుకల్లో పూర్తిస్థాయిలో మెలనిన్ ఉంటుంది.
మెలనిన్ ఉత్పత్తి..
గోధుమరంగు వెంట్రుకల్లో మెలనిన్ యాభైశాతం వరకు ఉంటుంది. వెంట్రుకలు తలపై ఉన్న రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఎపిడెర్మిస్ అని పిలిచే ఉపరితల చర్మం కింద ఉన్న డెర్మిస్ ప్రాంతంలో ఉంటాయి. అక్కడే మెలనిన్ ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయిన మెలనిన్, వెంట్రుక గొట్టాల్లోకి చొచ్చుకునివెళ్లి పేరుకుపోతుంది. అందుకే వెంట్రుకలు నల్లగా ఉంటాయి.
అయితే కొన్ని వెంట్రుకల కుదుళ్ల వద్ద మెలనిన్ ఆశించిన స్థాయిలో ఉత్పత్తి అవ్వదు. కాబట్టి ఆ వెంట్రుకలు గోధుమరంగులో గానీ తెల్లగా గానీ మారిపోతుంటాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో మెలనిన్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ముసలితనంలో తెల్లవెంట్రుకలు ఎక్కువగా వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు.
సూర్యుని నుంచి..
మెలనిన్ రేణువులు సాధారణ కాంతితో పాటూ సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలను కూడా శోషించుకుని మరింత నల్లగా మారతాయి. చాలా పాశ్చాత్య దేశాల్లో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది.
అందుకే వారి జుట్టు తెల్లగా, గోధుమ రంగులో, తెలుపు నలుపు కలిసి పోయినట్లు కనిపిస్తుంది. దానికి తక్కువ మెలనిన్ ఉత్పత్తే కారణం అని డెర్మటాలజిస్టులు పేర్కొంటున్నారు.
నిజం లేదని..
తెల్లవెంట్రుకలను పీకేస్తే పక్కనున్న వెంట్రుకలు తెల్లగా మారతాయనడంలో ఏమాత్రం నిజం లేదని డాక్టర్లు చెబుతున్నారు. మెలనిన్ సరిగా ఉత్పత్తి కాని వెంట్రుకలు మాత్రమే తెల్లగా మారుతాయని అంటున్నారు.
తొలగించడం కారణంగా..
తలపై ఒకేప్రాంతంలో వెంట్రుకలు తెల్లగా మారడం వల్ల ఆ అభిప్రాయం జనాల్లో నాటుకుపోయి ఉండొచ్చని, వైట్ హెయిర్స్ ఉన్నప్రాంతంలో మెలనిన్ ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల అక్కడున్న వెంట్రుకలన్నీ తెల్లగా మారిపోతాయని, అంతే తప్ప తెల్లవెంట్రుకలు తొలగించడం కారణంగా మరిన్ని తెల్లవెంట్రుకలు వస్తాయనుకోవడం కేవలం అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com