Hemoglobin : హిమోగ్లోబిన్‌ను పెంచే అమేజింగ్ ఫుడ్స్..
సాక్షి లైఫ్ : ఆధునిక జీవనశైలి, సరైన పోషకాహార లోపం వల్ల ఈ రోజుల్లో చాలా మందిని వేధించే ప్రధాన సమస్య 'రక్తహీనత' (Anemia). శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల నిరంతరం అలసట, నీరసం, తల తిరగడం, ఆయాసం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు, గర్భిణీలలో ఐరన్ లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
రక్తహీనతను ప్రాథమిక దశలోనే గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే అది ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఐరన్, ఫోలేట్, విటమిన్ బి12, విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాన్ని రోజువారీ డైట్లో చేర్చుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలను సహజసిద్ధంగా పెంచుకోవచ్చు. మరి హిమోగ్లోబిన్‌ను పెంచే ఆ 7 రకాల సూపర్‌ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..?
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
1. పాలకూర..
ఆకుకూరల్లో రారాజైన పాలకూర ఐరన్, ఫోలేట్, విటమిన్ ఏ వంటివాటికి నిలయం. శరీరంలో రక్తాన్ని పెంచడానికి ఇది అద్భుతంగా తోడ్పడుతుంది. పాలకూరను పప్పు, కూర లేదా సూప్ రూపంలో క్రమంగా తీసుకోవచ్చు. అయితే, పాలకూరలోని ఐరన్‌ను శరీరం త్వరగా గ్రహించాలంటే.. విటమిన్-సి ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిది.
2. బీట్రూట్..
శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడానికి బీట్రూట్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇందులో ఐరన్, ఫోలేట్, నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని రోజువారీ సలాడ్లలో భాగంగా లేదా తాజా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. కేవలం బీట్రూట్ మాత్రమే కాకుండా సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మరింత మంచి ఫలితం ఉంటుంది.
3. దానిమ్మ..
దానిమ్మ గింజల్లో ఐరన్, విటమిన్-సి తో పాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రక్త ప్రసరణను మెరుగు పరచడమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ప్రతిరోజూ ఉదయం అల్పాహారంతో పాటు గుప్పెడు దానిమ్మ గింజలు లేదా ఒక గ్లాసు తాజా దానిమ్మ రసం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
4. బెల్లం-శనగలు..
మన పూర్వీకుల కాలం నాటి ఈ సాంప్రదాయ చిరుతిండి శరీరానికి తక్షణ శక్తిని, రక్తాన్ని అందిస్తుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉండగా, వేయించిన శనగలు ప్రోటీన్లు, ఇతర పోషకాలను అందిస్తాయి. సాయంత్రం పూట జంక్ ఫుడ్‌కు బదులుగా దీనిని స్నాక్‌గా తీసుకోవచ్చు. అయితే, మధుమేహం (Diabetes) ఉన్నవారు బెల్లాన్ని వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి.
5. పప్పుధాన్యాలు - చిక్కుళ్లు..
కందిపప్పు, పెసరపప్పు, శనగలు, బొబ్బర్లు మరియు వివిధ రకాల చిక్కుడు గింజల్లో ఐరన్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. శాకాహారులకు ఐరన్ లభించే ఉత్తమ వనరులలో ఇవి ముఖ్యమైనవి. వీటిని ఉడికించి లేదా మొలకెత్తిన గింజల (Sprouts) రూపంలో తీసుకోవడం వల్ల పోషకాలు మరింత ఎక్కువగా అందుతాయి.
6. డ్రై ఫ్రూట్స్..
ఖర్జూరాలు, నల్ల ఎండుద్రాక్షలలో ఐరన్‌తో పాటు అనేక రకాల ఖనిజాలు దాగి ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించడమే కాకుండా శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. రాత్రి వేళల్లో ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ వేగంగా పెరుగుతుంది.
7. సిట్రస్ పండ్లు..
నారింజ, బత్తాయి, ఉసిరి, నిమ్మ, జామకాయ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి నేరుగా ఐరన్‌ను అందించకపోయినా.. మనం తినే ఆహారంలోని ఐరన్‌ను శరీరం సమర్థవంతంగా గ్రహించేలా (Iron Absorption) చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఐరన్ ఆహారంతో పాటు వీటిని కూడా చేర్చుకోవాలి. రక్తహీనత నివారణకు కేవలం ఆహార మార్పులు మాత్రమే కాకుండా తగినంత నీరు తాగడం, చురుకైన జీవనశైలి అవసరం. ఒకవేళ మీకు నిరంతరంగా తీవ్రమైన నీరసం, తల తిరగడం వంటి లక్షణాలు ఉంటే, సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
