వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?  

షేర్ చేయండి:
వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?  

సాక్షి లైఫ్: రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. దీని కారణంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎండాకాలంలో వేడి గాలులు కళ్లకు కూడా హాని కలిగిస్తాయి. వేడి వాతావరణం కారణంగా కళ్లు దురద,  వాపు ,ఎర్రబడడం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ కళ్ళను జాగ్రత్తగా చూసుకోవడానికి ఏం చేయాలంటే..? 

వేసవి కాలంలో తగినంత నీరు తీసుకోక పోవడం వల్ల కళ్లు పొడిబారతాయి. కాబట్టి కెఫిన్ ,ఆల్కహాల్ పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అవి తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా కళ్లపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కళ్ళు , కాంటాక్ట్ లెన్స్‌లను తాకే ముందు చేతులు కడుక్కోవాలి. కాంటాక్ట్ లెన్స్ కేసును క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.   

ఇది కూడా చదవండి.. మధుమేహం ఉన్నవారికి మేలుచేసే పప్పు..? 

డిజిటల్ యుగంలో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఓపక్క మండుటెండలు, మరోపక్క డిజిటల్ స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల కళ్లు పొడిబారడం, చూపు మందగించడం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్రతి 20 నిమిషాలకు..  

కంటి సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి..? డిజిటల్ స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్లపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల దృష్టిలోపాలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఎక్కువసేపు చూడడం వల్ల కళ్ళు పొడిబారడం, తలనొప్పి, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి.  ఈ సమస్యలను అధిగమించడానికి ప్రతి 20 నిమిషాలకు ఓసారి విరామం తీసుకోవాలి, డిజిటల్ స్క్రీన్ కు కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 

వ్యాయామం కంటి కండరాలను సడలిస్తుంది. కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత (యూవీ) కిరణాలు కళ్లను దెబ్బతీస్తాయి. ఎండ బాగా ఉన్నప్పుడు బయటికి వెళ్లేటప్పుడు100శాతం సూర్యునికిరణాలను నిరోధించే సన్ గ్లాసెస్ ధరించాలి. అన్ని కోణాల నుంచి కళ్ళను రక్షించే సన్ గ్లాసెస్ ఎంచుకోవడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.

కంటి ఆరోగ్యం కోసం.. 

కంటి ఆరోగ్యం కోసం పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకోసం విటమిన్ "సి", "ఇ", ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, లుటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి కంటిచూపునకు మేలు చేయడమే కాకుండా, వయసు సంబంధిత సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

తగినంత నిద్ర.. 

విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా సాయంత్రానికల్లా కళ్ళు అలసట, ఇరిటేట్ గా అనిపిస్తాయి. దీని వల్ల కళ్లకు ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ సమస్య నుంచి బయట పడడానికి తగినంత నిద్ర పోవడం చాలా ముఖ్యం. 

  టోపీ ధరించండి.. 

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా టోపీ ఉపయోగించండి. కళ్ళు , ముఖంపై ప్రత్యక్షంగా సూర్యకాంతి పడకుండా ఎల్లప్పుడూ తగినంత పెద్ద టోపీ వాడాలి. 

ఇది కూడా చదవండి.. మండే ఎండల్లో చల్లటి నీరు తాగుతున్నారా..?
 
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.