How to Prevent Food Poisoning: ఫుడ్ పాయిజనింగ్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
సాక్షి లైఫ్ : రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడినప్పటికీ, ఆరోగ్య పరంగా ఈ కాలం ఎన్నో సవాళ్లను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే వారి సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుంది. చాలామంది కడుపునొప్పి రాగానే సాధారణ అజీర్ణమే కదా అని తేలికగా తీసుకుంటారు. సొంత వైద్యంతో పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. కానీ, అది ఫుడ్ పాయిజనింగ్ ప్రారంభం కావచ్చు. తొలి లక్షణాలను గుర్తించి అప్రమత్తం కాకపోతే ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
బ్యాక్టీరియాకు అనుకూల వాతావరణం..
వర్షాకాలంలో గాల్లో తేమ (humidity) ఎక్కువగా ఉండటం వల్ల సాల్మొనెల్లా, ఇ. కోలి వంటి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. రోడ్డు పక్కన అమ్మే కలుషితమైన జ్యూస్‌లు, చాట్‌లు తినడం, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, ఈగలు వాలిన తినుబండారాల వల్ల ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరుతుంది. వండిన ఆహారాన్ని ఎక్కువసేపు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినా అందులో సూక్ష్మజీవులు సులభంగా చేరిపోతాయి.
సాధారణ కడుపునొప్పా..? ఫుడ్ పాయిజనింగా..? తేడా గుర్తించాలంటే ఎలా..?
కడుపులో అసౌకర్యంగా ఉన్నప్పుడు అది గ్యాస్ సమస్యనా లేక ఫుడ్ పాయిజనింగా అనేది పలు లక్షణాల ఆధారంగా తెలుసు కోవచ్చు.. అవేంటంటే..? సాధారణ కడుపునొప్పి..గ్యాస్, అజీర్ణం లేదా అతిగా తినడం వల్ల వస్తుంది. కాసేపటికి లేదా తగిన జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతుంది.
ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు..
కడుపునొప్పితో పాటు పదేపదే వాంతులు కావడం, వికారం, తీవ్రమైన విరేచనాలు, కడుపులో విపరీతమైన తిమ్మిర్లు (Cramps) ఉంటాయి.
తీవ్రతను తెలిపే సంకేతాలు..
ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే శరీర ఉష్ణోగ్రత పెరిగి జ్వరం రావడం, విపరీతమైన నీరసం ముంచెత్తడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మలంలో రక్తం కూడా పడవచ్చు. ఒకవేళ ఈ లక్షణాలు 1 నుంచి 2 రోజుల కంటే ఎక్కువగా అనిపించినా, లేదా రోగి స్పృహ కోల్పోయేలా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ఆసుపత్రికి తరలించాలి.
డీహైడ్రేషన్ ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు శరీరం నుండి నీరు, ఎలక్ట్రోలైట్లు వేగంగా హరించుకుపోతాయి. దీనివల్ల డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) ముప్పు పొంచి ఉంటుంది. అందువల్ల పలురకాల జాగ్రత్తలు తప్పనిసరి. ద్రవ పదార్థాలు..రోగికి నిరంతరం ఓఆర్ఎస్ (ORS) సొల్యూషన్, కాచి చల్లార్చిన శుభ్రమైన నీరు, కొబ్బరి నీరు లేదా మజ్జిగ వంటి ద్రవపదార్థాలను కొద్దికొద్దిగా ఇస్తూ ఉండాలి.
తేలికపాటి ఆహారం..జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది కాబట్టి కిచిడీ, గంజి, అరటిపండు వంటి సులభంగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారాన్ని మాత్రమే అందించాలి.సొంత వైద్యం వద్దు.. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా సొంతంగా విరేచనాల నివారణ మందులు (Anti-diarrheal drugs) లేదా యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఇది లోపల ఉన్న ఇన్ఫెక్షన్‌ను మరింత తీవ్రం చేస్తుంది. వర్షాకాలంలో కేవలం తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం, కాచి వడపోసిన నీటిని తాగడం, పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
