Nighttime Mistakes : రాత్రి వేళ ఈ పొరపాట్లు అసలు చేయొద్దు.. ఆయుర్వేదం చెబుతున్న ముఖ్యమైన ఆహారపు అలవాట్లు ఇవే..!
సాక్షి లైఫ్ : రోజంతా పనులతో అలసిపోయిన శరీరానికి రాత్రి సమయం విశ్రాంతినిస్తుంది. అయితే, రాత్రి పూట మనం తీసుకునే ఆహారం, నిద్రపోయే సమయం మన జీర్ణక్రియపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఆలస్యంగా భోజనం చేయడం, సమయానికి నిద్రపోకపోవడం వల్ల ఎసిడిటీ, అజీర్తి, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్ర వేళల్లో తరచూ మార్పులు జరగడం వల్ల శరీర జీవగడియారం (circadian rhythm) దెబ్బతింటుంది. అందుకే రాత్రి సమయంలో కొన్ని అలవాట్లను మార్చుకోవడం ఎంతో అవసరం. ఆరోగ్యంగా ఉండటానికి ఆయుర్వేదం సూచిస్తున్న కీలక మార్పులు ఏంటో చూద్దాం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?
1. రాత్రి భోజనం మితంగా, త్వరగా..
రాత్రి పూట మరీ ఎక్కువగా లేదా భారీగా భోజనం చేస్తే, ఆ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి పొట్టపై విపరీతమైన భారం పడుతుంది. అందుకే రాత్రి భోజనం ఎప్పుడూ తేలికగా ఉండాలి. సాయంత్రం త్వరగానే, అంటే నిద్రపోవడానికి కనీసం 2 నుంచి 3 గంటల ముందే డిన్నర్ పూర్తి చేయాలని ఆయుర్వేదం సూచిస్తోంది.
2. పెరుగు, మజ్జిగకు దూరంగా ఉండండి..
ఆయుర్వేద నియమాల ప్రకారం.. రాత్రి సమయంలో పెరుగు, మజ్జిగ, అతిగా చల్లగా లేదా పుల్లగా ఉండే పదార్థాలను తినకూడదు. ముఖ్యంగా మీకు తరచూ జలుబు, దగ్గు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తుంటే రాత్రి పూట వీటికి పూర్తిగా దూరంగా ఉండటం శ్రేయస్కరం.
3. సాయంత్రం దాటితే టీ, కాఫీ వద్దు..
చాలామందికి రాత్రి భోజనం తర్వాత టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ, వీటిలో ఉండే కెఫిన్ మీ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే సాయంత్రం 5 గంటల తర్వాత టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. రాత్రి వేళ ఏదైనా వేడిగా తాగాలనిపిస్తే, గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
4. హడావుడిగా తినడం మానుకోండి..
రోజంతా బిజీగా ఉండటం వల్ల కొందరు రాత్రి భోజనాన్ని కూడా గబగబా తినేస్తుంటారు. ఈ అలవాటును వెంటనే మార్చుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి, ప్రశాంతంగా తినాలి. భోజనానికి ముందు దానిమ్మ, బొప్పాయి, యాపిల్ లేదా సలాడ్ వంటివి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభమవుతుంది.
5. తీపి పదార్థాలను తగ్గించండి..
డిన్నర్ తర్వాత ఏదైనా స్వీట్ తినాలనిపించడం సహజమే. కానీ, రాత్రి పూట మిఠాయిలు లేదా చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను అతిగా తినడం ఆరోగ్యానికి హానికరం. రోజూ రాత్రి స్వీట్లు తినే అలవాటు ఉంటే బరువు పెరగడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి తీపిని పరిమితం చేసి సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టండి.
6. అర్ధరాత్రి వరకు మేల్కొనవద్దు..
రాత్రి పొద్దుపోయే వరకు ఫోన్ చూడటం, టీవీ ముందు కూర్చోవడం లేదా ఆఫీసు పనులు చేయడం వల్ల నిద్ర సమయం దెబ్బతింటుంది. ఆయుర్వేదం ప్రకారం రాత్రి 10 గంటలలోపే నిద్రపోవడం ఉత్తమం. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోండి.
7. తిన్న వెంటనే పడకపైకి వెళ్లొద్దు..
రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడానికి బదులు, కాసేపు ప్రశాంతంగా నడవండి. దీనివల్ల పొట్టలో బరువుగా అనిపించే సమస్య తగ్గి, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అయితే, తిన్న వెంటనే కఠినమైన వ్యాయామాలు లేదా వేగంగా నడవడం వంటివి చేయకూడదని గుర్తుంచుకోండి. రాత్రి వేళ ఈ చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీ నిద్ర నాణ్యతను, జీర్ణశక్తిని మెరుగుపరుచుకోవచ్చు. మీ వయసు, వాతావరణం, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహారపు అలవాట్లను ఎంచుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
