Leg Swelling : కాళ్ల వాపు.. అలసట, ఆయాసం వేధిస్తున్నాయా..? గుండె, కిడ్నీ జబ్బులకు సంకేతం కావొచ్చు..!
సాక్షి లైఫ్ : సాధారణంగా ఎక్కువసేపు ప్రయాణం చేసినప్పుడో, నిలబడి ఉన్నప్పుడో కాళ్లు, పాదాలు కొద్దిగా వాయడం సహజమే. కానీ ఎలాంటి కారణం లేకుండా తరచూ కాళ్లు, మడమల వద్ద వాపు వస్తుంటే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కాళ్ల వాపుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన అలసట, మూత్ర విసర్జనలో మార్పులు కనిపిస్తే.. అది శరీరంలోని కీలక అవయవాలైన గుండె లేదా కిడ్నీల పనితీరు దెబ్బతిందనడానికి సంకేతం కావొచ్చని సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
వాపు ఎందుకు వస్తుంది అసలు..?
శరీర కణజాలాల్లో అవసరానికి మించి ద్రవాలు (water) నిలిచిపోవ డాన్ని వైద్య పరిభాషలో 'ఎడిమా' (Edema) అంటారు. దీనివల్ల కాళ్లు, మడమలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణాలు..గుండె శరీర భాగాలకు రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు, రక్త ప్రసరణ నెమ్మదించి కాళ్లు, మడమల వద్ద ద్రవాలు పేరుకుపోతాయి. హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవారిలో కాళ్ల వాపుతో పాటు కొద్దిపాటి పనికే ఆయాసం, అలసట కనిపిస్తాయి. శరీరంలోని అదనపు నీరు, ఉప్పును బయటకు పంపడం మూత్ర పిండాల(kidneys) ప్రధాన విధి. కిడ్నీల పనితీరు మందగించినప్పుడు ఆ వ్యర్థాలు, నీరు శరీరంలోనే ఉండిపోయి కాళ్లు, పాదాలతో పాటు కొన్నిసార్లు ముఖం కూడా ఉబ్బినట్లు అవుతుంది.
కాళ్లలోని సిరలు (veins) రక్తాన్ని తిరిగి గుండెకు పంపడంలో విఫలమైనప్పుడు (chronic venous insufficiency) కాళ్లలో వాపు వస్తుంది. గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం, ఎక్కువసేపు నిలబడటం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలిగి వాపు రావొచ్చు. అలాగే ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా శరీరంలో నీరు నిలిచిపోతుంది.
గమనించాల్సిన లక్షణాలు ఏమిటంటే..?
పాదాలు, మడమల వద్ద చర్మం ఉబ్బి, బిగుతుగా లేదా మెరుస్తున్నట్లు కనిపించడం.
వాచిన చోట వేలితో నొక్కితే గుంట పడి, తిరిగి సాధారణ స్థితికి రావడానికి సమయం పట్టడం.
కాళ్లు బరువుగా అనిపించడం, నొప్పిగా ఉండటం.
మూత్రం తక్కువగా రావడం లేదా రంగులో మార్పు కనిపించడం.
వెంటనే వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?
కాళ్ల వాపుతో పాటు ఛాతీలో నొప్పి, శ్వాస ఆడకపోవడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. అలాగే రెండు కాళ్లకు కాకుండా కేవలం ఒకే కాలిలో అకస్మాత్తుగా వాపు వచ్చి, ఆ ప్రాంతం ఎర్రగా మారి, వేడిగా, నొప్పిగా ఉంటే అది రక్తం గడ్డకట్టడానికి (deep vein thrombosis) సంకేతం కావొచ్చు. దీనికి తక్షణ చికిత్స అవసరం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఆహారంలో ఉప్పు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి కాసేపు నడవాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. పడుకునేటప్పుడు లేదా విశ్రాంతి తీసుకునే సమయంలో కాళ్ల కింద దిండు పెట్టుకుని కాస్త ఎత్తులో ఉంచుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి వాపు తగ్గుతుంది. వైద్యులు నీటిని తక్కువగా తాగమని సూచించకపోతే, రోజుకు తగినంత మోతాదులో నీరు తాగాలి. వాపు తగ్గకుండా రోజుల తరబడి వేధిస్తుంటే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
