Risk Factors : మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం ఏమిటంటే..?   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య తలెత్తడానికి నిపుణులు చెప్పే అతిపెద్ద కారణం 'ఇన్సులిన్ రెసిస్టెన్స్'. మనం తిన్న ఆహారంలోని చక్కెరను కణాల్లోకి పంపి శక్తిగా మార్చడానికి 'ఇన్సులిన్' అనే హార్మోన్ తోడ్పడుతుంది. అయితే, శరీర కణాలు ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించనప్పుడు (insulin resistance), చక్కెర కణాల్లోకి వెళ్లకుండా రక్తంలోనే ఉండిపోతుంది. దీనిని నియంత్రించడానికి క్లోమగ్రంథి (Pancreas) మరింత ఎక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. కాలక్రమేణా ఈ ప్రక్రియ రక్తపోటు, కొలెస్ట్రాల్, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడానికి దారితీస్తుంది.

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 

సన్నగా ఉన్నవారికి కూడా రావచ్చా..?

చాలామంది తాము సన్నగా ఉన్నాము కాబట్టి తమకు ఎలాంటి ముప్పు లేదని భావిస్తుంటారు. కానీ, పైకి సన్నగా కనిపించే వారిలో కూడా అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోవచ్చు. దీనిని 'స్కిన్నీ ఫ్యాట్' అంటారు. వీరి బరువు సాధారణంగానే ఉన్నప్పటికీ, లోపల ఇన్సులిన్ నిరోధకత, అధిక కొలెస్ట్రాల్, బీపీ వంటి సమస్యలు దాగి ఉండే అవకాశం ఉంది.

పొట్ట కొవ్వు ఎందుకంత ప్రమాదకరం..?

చర్మం కింద ఉండే కొవ్వు కంటే, పొట్ట లోపల కాలేయం (liver), పేగులు, ఇతర ముఖ్య అవయవాల చుట్టూ పేరుకుపోయే కొవ్వును 'విసెరల్ ఫ్యాట్' (visceral fat)అంటారు. ఇది శరీర పనితీరును దెబ్బతీసే హానికర రసాయనాలను విడుదల చేస్తుంది. ఫలితంగా టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు, కాలేయ, కిడ్నీ వ్యాధుల ముప్పు భారీగా పెరుగుతుంది.

తెలియకుండానే పెరిగే ముప్పు.. పిల్లల్లోనూ కలవరం..!

స్ట్రెస్ ఈటింగ్..ఒత్తిడి, ఆందోళన, విచారంలో ఉన్నప్పుడు చాలామంది తీపి, నూనెలో వేయించిన, అధిక క్యాలరీల ఆహారాన్ని అతిగా తింటారు. దీర్ఘకాలంలో ఈ అలవాటు పొట్ట కొవ్వుకు, మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. పిల్లల్లో పెరుగుతున్న కేసుల.. గత కొన్నేళ్లుగా చిన్నపిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలోనూ ఈ సమస్య కనిపిస్తోంది. బాల్యంలోనే ఊబకాయం, గంటల తరబడి స్క్రీన్ చూడటం, శారీరక శ్రమ లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు.

ఈ పరిస్థితి రక్త ప్రసరణ, హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల పురుషుల్లో అంగస్తంభన సమస్యలు (erectile dysfunction), మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, సంతానోత్పత్తి (fertility) సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

డయాబెటిస్‌కు, దీనికి తేడా..

 డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెరను నియంత్రించలేని ఒక నిర్దిష్ట వ్యాధి. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది భవిష్యత్తులో డయాబెటిస్, గుండెపోటు వంటి వ్యాధులకు దారితీసే ప్రమాద కారకాల సముదాయం.

తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చా..? జీవనశైలి మార్పులే మందు..!

ప్రారంభ లేదా స్వల్ప స్థాయిలో ఉన్న మెటబాలిక్ సిండ్రోమ్‌ను మందుల కంటే మిన్నగా సరైన జీవనశైలి మార్పులతో పూర్తిగా తగ్గించవచ్చు. ఇందుకోసం నడుము చుట్టుకొలతను తగ్గించుకోవడమే తొలి లక్ష్యం కావాలి. ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయాలి. వారంలో కనీసం 2 నుండి 3 రోజులు కండరాలకు బలాన్నిచ్చే బరువులు ఎత్తడం వంటివి (strength training) చేయడం వల్ల ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుంది. ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం మానుకోవాలి.

ఆహారంలో జాగ్రత్తలు..ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, ముడి ధాన్యాలు, పండ్లు, నట్స్, తగినంత ప్రోటీన్ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. చక్కెర కలిపిన శీతల పానీయాలు, స్వీట్లు, అల్ట్రా-ప్రాసెస్డ్ (ultra-processed) ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.

కంటినిండా నిద్ర, ఒత్తిడి నియంత్రణ: ప్రతిరోజూ 7 నుండి 9 గంటల పాటు నాణ్యమైన, గాఢ నిద్ర పోవాలి. యోగా, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం, పొగాకు అలవాట్లను పూర్తిగా విడిచిపెట్టాలి. క్రమం తప్పకుండా పరీక్షలు: ఎలాంటి లక్షణాలు లేకపోయినా, క్రమం తప్పకుండా బీపీ, బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్ (cholesterol) పరీక్షలు చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండాలి.

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.