Blood Pressure Risks : అధిక ఉష్ణోగ్రతలతో బీపీ ముప్పు.. జాగ్రత్త పడకపోతే ప్రాణాలకే ప్రమాదం..!

షేర్ చేయండి:
Blood Pressure Risks : అధిక ఉష్ణోగ్రతలతో బీపీ ముప్పు.. జాగ్రత్త పడకపోతే ప్రాణాలకే ప్రమాదం..!

సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేస్తున్నాయి. తీవ్రమైన ఎండలు, వడగాలుల కారణంగా ఆసుపత్రుల్లో ఓపీడీలు (OPD) కిక్కిరిసిపోతున్నాయి. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం, వడదెబ్బ వంటి సమస్యలతో రోగులు క్యూ కడుతున్నారు. అయితే ఈ వేసవిలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో 'తక్కువ రక్తపోటు' (Low Blood Pressure) ఒకటని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా హై బీపీ గురించే అందరూ ఆందోళన చెందుతుంటారు, కానీ లో-బీపీ కూడా అంతే ప్రమాదకరమని, నిర్లక్ష్యం చేస్తే గుండె, మెదడు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

వేసవిలో రక్తపోటు ఎందుకు తగ్గుతుంది..?

తీవ్రమైన వేడి వాతావరణంలో మన శరీరం తనను తాను చల్లబరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో రక్తనాళాలు విస్తరిస్తాయి. ఫలితంగా రక్తప్రసరణ వేగం తగ్గి, రక్తపోటు పడిపోతుందని ఇంటెన్సివ్ కేర్ నిపుణులు వివరిస్తున్నారు. ఎండల వల్ల నిరంతరం చెమట పట్టడం ద్వారా శరీరంలోని నీటి శాతంతో పాటు సోడియం, పొటాషియం వంటి అత్యవసర ఎలక్ట్రోలైట్లు బయటకు వెళ్లిపోతాయి. ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండటం,ఉపవాసాలు చేయడం, ఎండలో మితిమీరి శ్రమించడం, సరిపడా నిద్ర లేకపోవడం, అధికంగా కాఫీ,టీలు లేదా మద్యం సేవించడం వల్ల కూడా బీపీ అకస్మాత్తుగా పడిపోతుంది.

లక్షణాలు ఎలా ఉంటాయి..?

రక్తపోటు తగ్గినప్పుడు అకస్మాత్తుగా కళ్లు తిరగడం, విపరీతమైన నీరసం, కంటిచూపు మసకబారడం, తల తేలికైనట్లు అనిపించడం, కొన్నిసార్లు స్పృహ తప్పి పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అకస్మాత్తుగా బీపీ పడిపోతే.. వెంటనే ఏం చేయాలి..?

ఎవరికైనా లో బీపీ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే రక్తపోటును తనిఖీ చేయాలి. రీడింగ్ గనుక 90/60 mm Hg కంటే తక్కువగా ఉంటే తక్షణమే కింది జాగ్రత్తలు తీసుకోవాలి. రోగికి వెంటనే ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు చిటికెళ్ల ఉప్పు కలిపిన నిమ్మరసం తాగించాలి. ఇది శరీరంలో సోడియం శాతాన్ని పెంచుతుంది. రోగిని వెల్లకిలా పడుకోబెట్టి, వారి కాళ్ల కింద దిండు లేదా మరేదైనా వస్తువును ఉంచి కాళ్లను గుండె మట్టం కంటే కొద్దిగా పైకి ఎత్తాలి. దీనివల్ల మెదడుకు రక్తప్రసరణ వేగంగా అందుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ల కొరతను భర్తీ చేయడానికి ఓఆర్‌ఎస్ (ORS) ద్రావణాన్ని త్రాగించాలి. గుండె జబ్బులు లేదా కిడ్నీ సమస్యలు ఉన్న రోగులకు అదనంగా ఉప్పు ఇచ్చే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.

ఏం చేయకూడదు..?

బీపీ తక్కువగా ఉన్న వ్యక్తిని అకస్మాత్తుగా లేచి నిలబడమని లేదా నడవమని చెప్పకూడదు. దీనివల్ల కిందపడి తలకు గాయాలయ్యే ప్రమాదం ఉంది. రోగి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది లేకుండా వారి దుస్తులను వదులు చేయాలి. ఎక్కువ సమయం పాటు ఆకలితో ఉండకూడదు. వేసవిలో తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు తేలికపాటి, పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. రక్తపోటు పడిపోవడం వల్ల రోగి స్పృహ కోల్పోయినా లేదా శ్వాస వేగంగా తీసుకుంటున్నా ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.