Stomach Ulcers : ‘అల్సర్’ లక్షణాలను ఎలా గుర్తించాలి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మనం పూర్తి స్థాయిలో ఉత్సాహంగా ఉండగలం. అయితే, మారిన జీవనశైలి, వేళాపాళా లేని ఆహారపు అలవాట్ల వల్ల నేడు చిన్నవయసు వారి నుంచి పెద్దల వరకు అందరినీ గ్యాస్,(gas) అసిడిటీ,(acidity) ఛాతీలో మంట (heartburn) వంటి సమస్యలు వేధిస్తున్నాయి. చాలామంది కడుపులో నొప్పి, మంట లేదా తిన్న తర్వాత బరువుగా అనిపించడాన్ని సాధారణ గ్యాస్ సమస్యగా భావించి సొంత వైద్యం చేసుకుంటూ నిర్లక్ష్యం చేస్తుంటారు.

కానీ, ఈ లక్షణాలు దీర్ఘకాలం పాటు కొనసాగితే అది కడుపులో పుండ్లు (peptic ulcers) ఏర్పడటానికి సంకేతం కావొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రారంభ దశలో సాధారణ అజీర్తిలాగే కనిపించే ఈ సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు అల్సర్ ఎందుకు వస్తుంది..? దానిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

ఏమిటీ ‘పెప్టిక్ అల్సర్’..? నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది..?

మన జీర్ణాశయం లేదా చిన్నపేగు పైభాగంలోని లోపలి పొర (Mucous lining) దెబ్బతిని, అక్కడ పుండ్లు ఏర్పడటాన్ని వైద్య పరిభాషలో ‘పెప్టిక్ అల్సర్’ (Peptic Ulcer) అంటారు. కడుపులో ఆహారాన్ని జీర్ణం చేయడానికి విడుదలయ్యే ఆమ్లాలు (Acids), జీర్ణాశయ గోడలను తాకకుండా ఒక రక్షణ పొర కాపాడుతుంటుంది. ఈ పొర బలహీనపడినప్పుడు ఆమ్లాల ప్రభావం నేరుగా కడుపు గోడలపై పడి పుండ్లు ఏర్పడతాయి. సకాలంలో చికిత్స అందకపోతే ఈ పుండ్లు లోతుగా మారి, కడుపు లోపల రక్తస్రావం (Internal bleeding) జరగడం, జీర్ణాశయ గోడకు రంధ్రం పడటం వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉంది.

కడుపులో అల్సర్ ఉన్నట్లు గుర్తించే లక్షణాలు..

సాధారణ గ్యాస్ సమస్యకు, అల్సర్‌కు మధ్య కొన్ని స్పష్టమైన తేడాలు ఉంటాయి. కింది లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. కడుపు పైభాగంలో మంట, నొప్పి.. ఛాతీ కింది భాగంలో, కడుపు పైభాగంలో విపరీతమైన మంట లేదా నొప్పిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు లేదా రాత్రి వేళల్లో ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా తిన్న తర్వాత కొంతసేపు ఉపశమనం లభించినా, మళ్లీ నొప్పి మొదలవుతుంది.

వికారం, వాంతులు.. తరచూ కడుపులో తిప్పినట్లు ఉండటం, కొందరిలో వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కడుపు ఉబ్బరం, తేన్పులు.. కొద్దిగా ఆహారం తీసుకున్నా పొట్ట నిండిపోయినట్లు బరువుగా అనిపించడం, తరచూ పుల్లటి తేన్పులు రావడం, ఆకలి తగ్గిపోవడం జరుగుతుంది.

అల్సర్ ఎందుకు వస్తుంది..? ప్రమాదకర సంకేతాలేవి..?

అల్సర్‌కు చికిత్స అందించాలంటే ముందుగా అది ఏ కారణంతో వచ్చిందో తెలుసుకోవడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా రెండు కారణాల వల్ల ఇది వస్తుంది. హెచ్. పైలోరీ (H. pylori) బ్యాక్టీరియా.. ఈ బ్యాక్టీరియా కడుపులోని రక్షణ పొరను దెబ్బతీసి ఇన్ఫెక్షన్, పుండ్లు ఏర్పడటానికి కారణమవుతుంది.

పెయిన్ కిల్లర్స్ అతివాడకం.. వైద్యుల సలహా లేకుండా తరచూ నొప్పి నివారణ మాత్రలు (Painkillers) వేసుకోవడం వల్ల జీర్ణాశయ పొర దెబ్బతింటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణమే ఆసుపత్రికి వెళ్లండి.. వాంతిలో ఎర్రటి రక్తం పడటం లేదా కాఫీ పొడి రంగులో వాంతి కావడం. మలం నల్లగా, జిగటగా రావడం,కడుపులో రక్తస్రావానికి ఇది సంకేతం. భరించలేని విధంగా కడుపులో తీవ్రమైన నొప్పి రావడం.

నివారణ, జాగ్రత్తలు..?

గ్యాస్, మంట తగ్గడానికి సొంతంగా మందులు వాడకుండా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవాలి. కారంగా, మసాలాలు, నూనె ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానేయాలి; ఇవి అల్సర్ పుండ్లు మానకుండా అడ్డుకుంటాయి. ఒకేసారి ఎక్కువగా తినకుండా, కొద్దికొద్దిగా నిర్ణీత సమయానికి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థను కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి..: Stronger Immunity : చలికాలంలో ఈ 'సూపర్‌ ఫుడ్స్' తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..Tea Side effect : పరకడుపున టీ తాగితే జుట్టు ఎందుకు రాలుతుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.