Kidney Health : కిడ్నీల ఆరోగ్యం.. నిర్లక్ష్యం చేస్తే తప్పదు ప్రాణాపాయం..!
సాక్షి లైఫ్ : శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే గుండె, ఊపిరితిత్తులు, కాలేయం మాదిరిగానే మూత్రపిండాలు (kidneys) కూడా నిరంతరం సమర్థంగా పనిచేయాలి. ఇవి రాత్రింబవళ్లు విరామం లేకుండా రక్తాన్ని శుద్ధి చేస్తూ, అందులోని వ్యర్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. శరీరంలో నీరు, ఉప్పు, ముఖ్యమైన ఖనిజాల సమతుల్యతను కాపాడటంలోనూ కిడ్నీల పాత్ర ఎంతో కీలకం. అయితే, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా నేడు చాలామందిలో కిడ్నీల పనితీరు దెబ్బతింటోంది.
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
నిశ్శబ్దంగా పెరిగే ముప్పు..
కిడ్నీలు దీర్ఘకాలంగా సరిగ్గా పనిచేయకపోవడాన్ని వైద్య పరిభాషలో ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’ (Chronic Kidney Disease) అంటారు. ఈ వ్యాధిలో ప్రధాన సమస్య ఏమిటంటే.. ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు బయటపడవు. ఫలితంగా, కిడ్నీలు గణనీయంగా దెబ్బతిన్న తర్వాతే చాలామందికి తమకు ఈ సమస్య ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా మధుమేహం (diabetes), అధిక రక్తపోటు (hypertension) తో బాధపడుతున్నవారు తమ కిడ్నీల ఆరోగ్యం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ సంకేతాలను విస్మరించొద్దు..!
వ్యాధి క్రమంగా ముదురుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. కింది లక్షణాలు గమనిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. కిడ్నీలు అదనపు నీటిని, ఉప్పును బయటకు పంపలేకపోవడం వల్ల కాళ్లు, చీలమండలు, కొన్నిసార్లు ముఖంపై వాపు కనిపిస్తుంది.
మూత్రవిసర్జన చేసినప్పుడు నిరంతరం ఎక్కువగా నురుగు వస్తుంటే, అది మూత్రం ద్వారా ప్రొటీన్ బయటకు పోతున్నదనడానికి సంకేతం కావచ్చు. రాత్రి వేళల్లో సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం కూడా కిడ్నీ సమస్యకు ఒక సూచన.
కిడ్నీల సామర్థ్యం తగ్గి, రక్తంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల నిత్యం తీవ్రమైన నీరసం, అలసట ఆవహిస్తాయి. శరీరంలో మలినాలు అధికమైతే ఆకలి మందగించడంతో పాటు వికారం, వాంతులు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. శరీరంలో ఖనిజాల సమతుల్యత దెబ్బతినడం వల్ల చర్మంపై విపరీతమైన దురద, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు వేధిస్తాయి.
కిడ్నీల ఆరోగ్యాన్ని గురించి ఎలా తెలుసుకోవాలి..?
కిడ్నీల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం ద్వారా పెను ముప్పును తప్పించుకోవచ్చు. వైద్యుల సలహా మేరకు ఈ ప్రాథమిక పరీక్షలు చేయించుకోవాలి. క్రియాటినిన్ అండ్ ఈజీఎఫ్ఆర్ (eGFR)..ఈ రక్త పరీక్షల ద్వారా కిడ్నీలు రక్తాన్ని ఎంత సమర్థంగా శుద్ధి చేస్తున్నాయో స్పష్టంగా తెలుస్తుంది.
యూరిన్ ఆల్బుమిన్ టెస్ట్..ఈ మూత్ర పరీక్ష ద్వారా మూత్రంలో ప్రొటీన్ ఏమైనా బయటకు పోతుందా అనేది గుర్తిస్తారు. మధుమేహం, హై బీపీ ఉన్నవారు, అలాగే కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ వ్యాధుల చరిత్ర ఉన్నవారు ఎలాంటి లక్షణాలు లేకపోయినా క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీలను జీవితాంతం సురక్షితంగా కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
