Karonda : మాన్సూన్ సూపర్ ఫుడ్ 'వాక్కాయ'తో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వానాకాలం మార్కెట్లో ఎక్కువగా కనిపించే వాక్కాయలను చాలామంది కేవలం పచ్చళ్లు, చట్నీల తయారీకే పరిమితం చేస్తుంటారు. కానీ, చూసేందుకు చిన్నగా ఉండే ఈ కాయలు ఆరోగ్యానికి అందించే మేలు అంతాఇంతా కాదు. ఖరీదైన పండ్లతో సమానంగా ఇవి పోషకాలను అందిస్తాయి. విటమిన్-సి, ఫైబర్, ఐరన్ మెండుగా ఉండే వాక్కాయలను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

వాక్కాయలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..  

1. మెరుగైన జీర్ణవ్యవస్థ..  

వాక్కాయల్లో పీచుపదార్థం (fiber) పుష్కలంగా ఉంటుంది. ఇది పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఫైబర్ వల్ల ఆహారం సులభంగా జీర్ణమవడమే కాకుండా, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. రోగనిరోధక శక్తి పెంపు.. 

వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల త్వరగా జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. విటమిన్-సి అధికంగా ఉండే ఈ వాక్కాయలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని ఇస్తాయి.

3. కణాల సంరక్షణ..  

శరీరాన్ని లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచే సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు వాక్కాయల్లో మెండుగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతూ, శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి.

4. రక్తహీనతకు చెక్.. 

శరీరానికి అవసరమైన ఐరన్ ఈ కాయల ద్వారా అందుతుంది. తరచుగా వాక్కాయలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత పోషణ అంది, రక్తహీనత (Anemia) ముప్పు తగ్గుతుంది.

5. బరువు నియంత్రణలో సహాయకారి..

ఊరికే ఆకలి వేస్తున్నట్లు అనిపించేవారికి వాక్కాయలు మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా పదే పదే ఏదో ఒకటి తినాలన్న కోరిక తగ్గి, బరువు అదుపులో ఉంటుంది.

6. మెరిసే చర్మం ..

వాక్కాయల్లో ఉండే విటమిన్-సి చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సరైన మోతాదులో వీటిని తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా, సహజమైన కాంతితో మెరుస్తూ ఉంటుంది.

7. ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు..  

కొద్దిగా పుల్లగా, వగరుగా, తీయగా ఉండే ఈ వాక్కాయలను కేవలం పచ్చళ్ల రూపంలోనే కాకుండా పప్పు, చట్నీ, మురబ్బా, జామ్, జ్యూస్, సలాడ్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. పండిన కాయలు కాస్త తీయగా ఉంటాయి కాబట్టి నేరుగా కూడా తినవచ్చు.

తినేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..  

ఎల్లప్పుడూ తాజా కాయలనే ఎంచుకోవాలి. తినే ముందు నీటిలో శుభ్రంగా కడగాలి. మొదటిసారి తింటున్నట్లయితే, కొద్ది మోతాదులో మాత్రమే తీసుకుని పరీక్షించండి.ఏదైనా ఆరోగ్య సమస్య ఉండి, మందులు వాడుతున్నవారు లేదా ప్రత్యేక డైట్‌లో ఉన్నవారు ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది. ఆరోగ్యానికి మంచిదే కదా అని మోతాదుకు మించి తినకూడదు.వాక్కాయల్లోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. అయితే, వీటిని ఏదైనా వ్యాధికి మందులా కాకుండా, ఆరోగ్యకరమైన ఆహారంలో ఒక భాగంగా మాత్రమే పరిగణించాలి.

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.