Text Neck Syndrome : 'టెక్స్ట్ నెక్ సిండ్రోమ్' అంటే ఏమిటి..? ఎలాంటి వారికి వస్తుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల వాడకం మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది. ఆఫీసు పనులు, ఆన్‌లైన్ క్లాసులు, సోషల్ మీడియా లేదా వినోదం.. ఇలా కారణం ఏదైనా ప్రజలు గంటల తరబడి స్క్రీన్లకే అతుక్కుపోతున్నారు. ఇలా తల వంచుకుని, కదలకుండా మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించడం వల్ల ఒక కొత్త ఆరోగ్య సమస్య పుట్టుకొచ్చింది. వైద్య పరిభాషలో దీనినే 'టెక్స్ట్ నెక్ సిండ్రోమ్' (Text Neck Syndrome) అని పిలుస్తున్నారు. సకాలంలో ఈ సమస్యను గుర్తించకపోతే, తీవ్రమైన మెడ నొప్పి, వెన్నెముక సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. అసలు ఈ సిండ్రోమ్ అంటే ఏమిటి..? దీని లక్షణాలు, నివారణా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

'టెక్స్ట్ నెక్ సిండ్రోమ్' అంటే ఏమిటి..?

సాధారణంగా మన తల బరువును మెడ, వెన్నెముక చాలా బ్యాలెన్స్‌డ్‌గా మోస్తాయి. కానీ, గంటల తరబడి తల కిందికి దించి మొబైల్ లేదా ల్యాప్‌టాప్ చూస్తున్నప్పుడు.. మెడ కండరాలు, వెన్నెముకపై అదనపు భారం పడుతుంది. తల ఎంత కిందికి వంచితే, మెడపై అంత ఒత్తిడి పెరుగుతుంది. కాలక్రమేణా ఈ నిరంతర ఒత్తిడి తీవ్రమైన నొప్పికి, కండరాలు బిగుసుకుపోవడానికి కారణమ వుతుంది. ఈ పరిస్థితినే 'టెక్స్ట్ నెక్ సిండ్రోమ్' అంటారు.

ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి..? 

మెడలో నిరంతర నొప్పి లేదా మెడ పట్టేయడం, బిగుసుకుపోవడం.

భుజాలు, వీపు పైభాగంలో భరించలేని నొప్పి రావడం.

తల వెనుక భాగం నుంచి మొదలై ముందుకు వ్యాపించే తలనొప్పి.

మెడను అటూ ఇటూ తిప్పడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవడం.

చేతుల్లో లేదా వేళ్లలో తిమ్మిర్లు రావడం, స్పర్శ కోల్పోయినట్లు అనిపించడం.

ఎక్కువసేపు కూర్చున్న తర్వాత ఈ నొప్పులు మరింత తీవ్రమవడం.

దీనికి కారణాలు ఇవే..

మొబైల్ చూసేటప్పుడు తలను వంచి గంటల తరబడి గడపడం.

కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను కంటికి సమాంతరంగా (Eye Level) ఉంచుకోకుండా, వంగి పనిచేయడం.

పని మధ్యలో ఎలాంటి విరామం (Break) తీసుకోకపోవడం వల్ల కండరాలు అలసిపోవడం.

కూర్చునే భంగిమ (Body Posture) సరిగా లేకపోవడం, వెన్నెముక నిటారుగా ఉంచకపోవడం.

నివారణా చర్యలు - జాగ్రత్తలు..?

కంటి స్థాయికి గ్యాడ్జెట్స్.. మొబైల్ వాడేటప్పుడు తల వంచకుండా, ఫోన్‌ను మీ కంటికి సమాంతరంగా పైకి ఎత్తి పట్టుకుని చూడటం అలవాటు చేసుకోవాలి. ల్యాప్‌టాప్ కూడా కంటికి సమాంతరంగా ఉండేలా స్టాండ్స్ ఉపయోగించాలి.

విరామం తప్పనిసరి..ప్రతి 20 నుంచి 30 నిమిషాలకు ఒకసారి కనీసం రెండు నిమిషాల పాటు బ్రేక్ తీసుకోండి.

స్ట్రెచింగ్ వ్యాయామాలు.. బ్రేక్ సమయంలో మెడ, భుజాలను నెమ్మదిగా అటూ ఇటూ తిప్పుతూ చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి.

సరైన భంగిమ..కూర్చునేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి. కుర్చీలో వెనక్కి వాలి, మెడకు సరైన సపోర్ట్ ఉండేలా చూసుకోవాలి.

స్క్రీన్ టైమ్ తగ్గింపు..అవసరం లేనప్పుడు మొబైల్ వాడకాన్ని తగ్గించండి. రోజూ యోగా, వ్యాయామం చేయడం వల్ల కండరాలు దృఢంగా మారతాయి.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..?

మెడ నొప్పి కొన్ని రోజుల పాటు తగ్గకుండా వేధిస్తున్నా, ఆ నొప్పి మెడ నుంచి చేతుల వరకు పాకుతున్నా నిర్లక్ష్యం చేయకూడదు. చేతుల్లో పటుత్వం తగ్గడం, తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆర్థోపెడిక్ లేదా ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించాలి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ఈ సమస్య తీవ్రం కాకుండా అడ్డుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు.. 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.