Acidity : ఎసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా..? ఉపశమనం కోసం అద్భుతమైన ఇంటి చిట్కాలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఛాతీలో మంట, పుల్లటి త్రేన్పులు, గొంతులో మంటగా అనిపించడం.. ఇవన్నీ ఎసిడిటీ (acidity)కి ప్రధాన సంకేతాలు. సమయానికి భోజనం చేయకపోవడం, మసాలాలు దట్టించిన ఆహారం తీసుకోవడం, రాత్రిపూట ఆలస్యంగా తినడం, మానసిక ఒత్తిడి వంటివి ఈ సమస్యను మరింత జటిలం చేస్తాయి. దీన్ని సాధారణ సమస్యే కదా అని నిర్లక్ష్యం చేస్తే, అది రోజువారీ పనులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే, మన వంటగదిలో దొరికే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో ఎసిడిటీకి సులభంగా చెక్ పెట్టవచ్చు.

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 

ఎసిడిటీని తగ్గించే ఇంటి చిట్కాలు..
 
చల్లటి పాలు ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. పాలలో ఉండే కాల్షియం కడుపులోని ఆమ్లాలను సమతుల్యం చేసి మంటను తగ్గిస్తుంది. ఫ్రిజ్‌లో ఉంచిన పాలను చక్కెర కలపకుండా కొద్దిగా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే, పాలు పడని వారు దీనికి దూరంగా ఉండటం మంచిది.

సోంపు గింజలు..

జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సోంపు అద్భుతంగా పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత ఒక స్పూను సోంపు గింజలను నమలడం లేదా, ఒక గ్లాసు నీటిలో సోంపు వేసి మరిగించి ఆ నీటిని తాగడం వల్ల గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ సమస్యలు దరిచేరవు.

అరటిపండు..

ఆమ్ల గుణాలు తక్కువగా ఉండే పండ్లలో అరటిపండు ఒకటి. ఇది జీర్ణాశయం లోపలి గోడలపై ఒక రక్షణ పొరలా ఏర్పడి, యాసిడ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఎసిడిటీతో బాధపడేవారు రోజూ ఒక పండిన అరటిపండు తినడం అలవాటు చేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది.

అల్లం..

అల్లంలో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా అల్లం రసం కలుపుకుని లేదా తేలికపాటి అల్లం టీ రూపంలో తీసుకుంటే కడుపులో మంట, అసౌకర్యం తగ్గుతాయి. అయితే, అల్లాన్ని మోతాదుకు మించి తీసుకోకూడదు.

జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులు..

మందులు, చిట్కాలు పాటించడంతో పాటు కొన్ని అలవాట్లను మార్చుకుంటే ఎసిడిటీ దరిచేరకుండా చూసుకోవచ్చు. భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. తిన్న తర్వాత కనీసం 2 నుంచి 3 గంటల వ్యవధి ఇచ్చి పడుకోవాలి. ఒకేసారి కడుపునిండా తినకుండా, కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడం అలవాటు చేసుకోండి.

నూనె, వేపుళ్లు, మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి. టీ, కాఫీలు, కూల్ డ్రింక్స్ తాగడం తగ్గించాలి. నీరు ముఖ్యం..రోజువారీగా శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి. పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఎసిడిటీని తీవ్రతరం చేస్తాయి. వాటిని మానుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు రోజూ యోగా, ధ్యానం చేయాలి. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?

సాధారణంగా ఇంటి చిట్కాలతో ఎసిడిటీ తగ్గిపోతుంది. కానీ, వారంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఈ సమస్య వేధిస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఎసిడిటీతో పాటు తరచుగా వాంతులు కావడం, బరువు తగ్గడం, ఆహారం మింగడంలో ఇబ్బంది, ఛాతీలో తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే నిపుణులైన వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.