Menopause at 40 : నలభైకే మెనో పాజ్... మహిళలకు హెచ్చరిక..! లక్షణాలు గుర్తించకుంటే పెను ముప్పే..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సాధారణంగా మహిళల్లో రుతుక్రమం 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఆగిపోవడం సహజం. కానీ కొందరిలో ఇది ముప్పై ఏళ్లలోపే మొదలవుతుంది. దీన్నే వైద్య పరిభాషలో 'ప్రీమెచ్యూర్ మెనోపాజ్' లేదా 'ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్‌సఫిసియెన్సీ (Premature Ovarian Insufficiency)' అని పిలుస్తారు. యుక్త వయసులోనే అండాశయాలు పనిచేయడం మందగించి, రుతుక్రమం అనూహ్యంగా నిలిచిపోవడం మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

ఎలా గుర్తించాలి..?

పీరియడ్స్ క్రమం తప్పడం, ఒక్కసారిగా వేడి ఆవిర్లు (hot flashes) రావడం, రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం, నిద్ర సరిగా పట్టకపోవడం, మానసిక స్థితిలో ఒడుదొడుకులు, యోని పొడిబారిపోవడం, లైంగిక కోరిక తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం వంటివి ఈ సమస్యకు సంకేతాలుగా చెప్పవచ్చు. అయితే వీటిని చాలామంది ఒత్తిడి, ఆందోళన లక్షణాలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల అసలు సమస్యను గుర్తించడంలో జాప్యం జరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

కారణాలు ఏమిటి..?

కుటుంబంలో ఎవరికైనా ముందుగా రుతువిరతి వచ్చిన చరిత్ర ఉంటే, వారసత్వంగా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఆటో ఇమ్యూన్ వ్యాధులు, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు తీసుకున్నవారిలో, అలాగే ధూమపాన అలవాటు ఉన్నవారిలో ఈ ముప్పు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే చాలా సందర్భాల్లో ఖచ్చితమైన కారణం ఏమిటో స్పష్టంగా తెలియకపోవడం గమనార్హం.

నిర్లక్ష్యం చేస్తే నష్టమే..

చిన్న వయసులోనే ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయులు పడిపోవడం వల్ల ఎముకలు బలహీనపడి బోలు ఎముకల వ్యాధి (osteoporosis) వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే గుండె జబ్బులముప్పు కూడా అధికమవుతుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే సంతానోత్పత్తిపైనా, జీవన నాణ్యతపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

జాగ్రత్తలు ఎలా..?

నలభై ఏళ్లలోపు వయసున్నవారిలో రుతుక్రమం క్రమం తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగానే గుర్తించి, తగిన చికిత్స తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించు కోవచ్చు. మహిళలు తమ శరీరంలో వచ్చే మార్పులపై అప్రమత్తంగా ఉండటం, నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతైనా అవసరం అని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..Green Potatoes : బంగాళాదుంపలు పచ్చగా ఉంటే తినకూడదా..?

 

ఇది కూడా చదవండి..Protect Your Liver Naturally : కాలేయం పదిలంగా ఉండాలంటే రోజూ ఈ ఐదు ఆహారాలు తీసుకోవాల్సిందే..!

ఇది కూడా చదవండి.. High Triglycerides : ట్రైగ్లిజరైడ్స్  ఈ సమస్య ఎందుకు వస్తుంది..? లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.