Nocturia : రాత్రిపూట తరచూ మూత్ర విసర్జనకు లేస్తున్నారా..? ఈ 5 తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రాత్రి నిద్రలో ఒకటి, రెండు సార్లు మూత్ర విసర్జనకు లేవడం సహజమే. కానీ, పదే పదే మెలకువ వచ్చి బాత్రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంటే మాత్రం దాన్ని అశ్రద్ధ చేయకూడదు. వైద్య పరిభాషలో ఈ సమస్యను 'నాక్టూరియా' (Nocturia) అంటారు. ఇది కేవలం వయసు పైబడటం వల్ల వచ్చే సమస్య మాత్రమే కాదు, మన శరీరంలో దాగి ఉన్న పలు తీవ్రమైన వ్యాధులకు ముందస్తు హెచ్చరిక కూడా కావచ్చు. రాత్రిపూట తరచూ మూత్రం రావడంతో పాటు విపరీతమైన దాహం, కాళ్ల వాపు, మూత్రంలో మంట, అలసట, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఈ సమస్య ఏయే అనారోగ్యాలకు సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

ఈ 5 తీవ్రమైన వ్యాధులకు ముందస్తు సంకేతాలు..

మధుమేహం (Diabetes)..

తరచూ మూత్రం రావడం మధుమేహానికి ముఖ్యమైన ప్రారంభ లక్షణం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, శరీరం అదనపు గ్లూకోజ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపేందుకు ప్రయత్నిస్తుంది. దీనివల్ల రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. దీనికి తోడు విపరీతమైన దాహం, ఆకలి, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.

కిడ్నీ సమస్యలు (Kidney Diseases)..

శరీరంలోని వ్యర్థాలను, అదనపు నీటిని బయటకు పంపడం కిడ్నీల ప్రధాన విధి. కిడ్నీల పనితీరు మందగించినప్పుడు మూత్ర విసర్జనలో మార్పులు వస్తాయి. కాళ్ల వాపు, విపరీతమైన అలసట, అధిక రక్తపోటుతో పాటు రాత్రిపూట తరచూ మూత్రం రావడం కిడ్నీ వ్యాధులకు సంకేతం కావచ్చు.

ప్రొస్టేట్ గ్రంథి వాపు (Enlarged Prostate)..

50 ఏళ్లు పైబడిన పురుషులలో ఇది సాధారణంగా కనిపించే సమస్య. ప్రొస్టేట్ గ్రంథి వాపు కారణంగా మూత్రాశయం (bladder) పై ఒత్తిడి పడి పదే పదే మూత్రానికి వెళ్లాలనిపిస్తుంది. మూత్ర విసర్జన ప్రారంభించడంలో ఇబ్బంది, మూత్రం ధార తగ్గడం, మూత్రం పోసిన తర్వాత కూడా బ్లాడర్ ఖాళీ అవ్వలేదనే భావన ఉంటే యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI)..

మూత్రనాళ ఇన్ఫెక్షన్ (UTI) వల్ల కూడా రాత్రిపూట తరచూ మూత్రం వస్తుంది. మూత్రం పోసేటప్పుడు మంట, దుర్వాసన, నొప్పి, తేలిక పాటి జ్వరం రావచ్చు. పురుషుల కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ కిడ్నీలకు చేరే ప్రమాదం ఉంది.

గుండె సంబంధిత సమస్యలు (Heart Failure)..

గుండె పనితీరు మందగించినప్పుడు పగటిపూట కాళ్లలో అదనపు ద్రవాలు పేరుకుపోతాయి. రాత్రి పడుకున్నప్పుడు ఆ ద్రవాలు తిరిగి రక్తప్రవాహంలో కలుస్తాయి. అప్పుడు కిడ్నీలు ఆ అదనపు ద్రవాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కాళ్ల వాపు, త్వరగా అలసిపోవడం వంటివి గమనిస్తే కార్డియాలజిస్ట్‌ను కలవడం మంచిది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?

రాత్రి నిద్రలో క్రమం తప్పకుండా రెండు కంటే ఎక్కువ సార్లు మూత్రానికి లేవాల్సి వస్తే. మూత్రంలో రక్తం పడటం, తీవ్రమైన మంట లేదా నొప్పి ఉంటే. అకస్మాత్తుగా బరువు తగ్గడం, విపరీతమైన దాహం వేస్తుంటే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా కాళ్ల వాపు ఉంటే. ఈ సమస్య వారం, పది రోజులకంటే ఎక్కువ కాలం కొనసాగుతుంటే.

పాటించాల్సిన జాగ్రత్తలు..?

నిద్రపోయే ముందు 2-3 గంటల వ్యవధిలో నీళ్లు, ఇతర ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగడం తగ్గించాలి.

రాత్రి పూట కాఫీ, టీ, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

రక్తపోటు (bp), మధుమేహం (diabetes) నియంత్రణలో ఉంచుకోవాలి.

వైద్యుల సలహా లేకుండా సొంత వైద్యం చేసుకోకూడదు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.