Medical Alert : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 16 రకాల కాంబినేషన్ మందులపై తక్షణ నిషేధం..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఔషధాల కొనుగోలు విషయంలో దేశ ప్రజలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని, శాస్త్రీయ ఆధారాలు లేని 16 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందుల తయారీ, అమ్మకం, పంపిణీ, సరఫరాను తక్షణమే నిషేధిస్తూ కేంద్రం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధించిన వాటిలో మనం నిత్యం వాడే పారాసెటమాల్, కొన్ని రకాల యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మాత్రల ఫార్ములేషన్లు కూడా ఉండటం గమనార్హం.

 

ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?  

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..? 

 

ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) అంటే ఏమిటి..?

రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాల మిశ్రమాలను ఒక నిర్దిష్ట నిష్పత్తిలో కలిపి ఒకే టాబ్లెట్, క్యాప్సూల్ లేదా సిరప్ రూపంలో తయారు చేయడాన్ని 'ఫిక్స్‌డ్-డోస్ కాంబినేషన్' అంటారు. వేర్వేరుగా రెండు మూడు మాత్రలు వేసుకునే బదులు, ఒకే మాత్రతో పని పూర్తవుతుందనే ఉద్దేశంతో చాలామంది వీటిని వాడుతుంటారు.

ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువ..  

ఈ కాంబినేషన్ మందులు రోగులకు తాత్కాలిక సౌకర్యాన్ని అందించినప్పటికీ, వీటి వల్ల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మందుల వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉన్నట్లు శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. ఒకే మాత్రలో ఎక్కువ మందులు ఉండటం వల్ల రోగి అవసరాన్ని బట్టి మోతాదును మార్చడం సాధ్యం కాదు. దీనివల్ల శరీరంలో తీవ్రమైన అలెర్జీలు, దుష్ప్రభావాలు రావడంతో పాటు.. బ్యాక్టీరియాపై మందులు పనిచేయని 'యాంటీబయాటిక్ నిరోధకత' (antibiotic resistance) వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిషేధిత 16 మందుల పూర్తి జాబితా..  

ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం, 1940లోని సెక్షన్ 26A కింద కేంద్ర ప్రభుత్వం పలు  కాంబినేషన్లపై నిషేధం విధించింది.. అవేంటంటే..?

1. నొప్పి నివారణ, కండరాల నొప్పుల మందులు:
ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ + ఎథోహెప్టాజైన్

డైసైక్లోమైన్ + పారాసెటమాల్ + క్లిడినియం బ్రోమైడ్

డైసైక్లోమైన్ + పారాసెటమాల్ + క్లిడినియం బ్రోమైడ్ + క్లోర్డియాజెపాక్సైడ్

పారాసెటమాల్ + లిగ్నోకైన్

2. యాంటీబయాటిక్ మిశ్రమాలు..

అమోక్సిసిలిన్ + సెరాటియోపెప్టిడేస్

అమోక్సిసిలిన్ + సెరాటియోపెప్టిడేస్ + లాక్టోబాసిల్లస్ స్పోరోజెనెస్

అమోక్సిసిలిన్ + క్లోక్సాసిలిన్ + లాక్టిక్ యాసిడ్ బాసిల్లస్ + సెరాటియోపెప్టిడేస్
 
సెఫాడ్రాక్సిల్ + ప్రోబెనెసిడ్

సెఫ్యూరాక్సిమ్ + సెరాటియోపెప్టిడేస్

3. మధుమేహం..మందులు..

గ్లిక్లాజైడ్ + క్రోమియం పికోలినేట్

4. చర్మ సంరక్షణ ఉత్పత్తులు.. 

విటమిన్ ఇ, టీ ట్రీ ఆయిల్, జోజోబా ఆయిల్, ఆరెంజ్ ఆయిల్, గోధుమ శనగ నూనెలతో పాటు కలబంద సారం, డి పాంథెనాల్ వంటి రసాయనాలను కలిపి తయారు చేసిన కొన్ని రకాల చర్మ సౌందర్య ఉత్పత్తులు.

అధికారులకు కఠిన ఆదేశాలు.. 

ప్రజలు తరచుగా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో ఇలాంటి కాంబినేషన్ మందులను కొనుగోలు చేస్తుంటారని, ఇది అత్యంత ప్రమాదకరమని ప్రభుత్వం పేర్కొంది. మార్కెట్లో కేవలం సురక్షితమైన, శాస్త్రీయంగా నిరూపించిన మందులు మాత్రమే అందుబాటులో ఉండేలా చూడటమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం.

ఈ నిషేధాజ్ఞలను దేశవ్యాప్తంగా కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ సంస్థలను కేంద్రం ఆదేశించింది. ఔషధ తయారీదారులు, పంపిణీదారులు సైతం ఈ నిబంధనలకు కట్టుబడి తక్షణమే మార్కెట్ నుంచి ఈ ఉత్పత్తులను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. ప్రజలు సొంత వైద్యం మానుకోవాలి. ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా.. మెడికల్ షాపులకు వెళ్లి నేరుగా మందులు కొనే అలవాటును పక్కనపెట్టి, అర్హులైన వైద్యుడిని సంప్రదించిన తర్వాతే ప్రిస్క్రిప్షన్ ప్రకారం సురక్షితమైన మందులను వాడాలి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.