World hepatitis day 2026 : హెపటైటిస్.. నిజంగా ప్రాణాలు తీస్తోందా..? ఇది ఎన్ని రకాలు..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చడం దగ్గర్నుంచి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడం, జీర్ణక్రియను మెరుగుపరచడం వరకు ఇది ఎన్నో కీలక బాధ్యతలను నిర్వర్తిస్తుంది. అయితే, ఈ కాలేయానికి వాపు రావడాన్నే వైద్య పరిభాషలో 'హెపటైటిస్' అంటారు.

 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

హెపటైటిస్-బి వైరస్‌ను గుర్తించిన నోబెల్ బహుమతి గ్రహీత.. 

ప్రధానంగా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే ఈ వ్యాధి.. ఎక్కువగా మద్యం సేవించడం, కలుషిత ఆహారం తీసుకోవడం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు, ఆటో-ఇమ్యూన్ సమస్యల వల్ల కూడా దరిచేరుతుంది. కాలేయ ఆరోగ్యానికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా జూలై 28న 'ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం' జరుపుకుంటారు. హెపటైటిస్-బి వైరస్‌ను గుర్తించిన నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ బరూచ్ బ్లంబెర్గ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం.. 

ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మందిలో ఈ ఇన్ఫెక్షన్ కొద్ది రోజుల్లోనే తగ్గిపోయినా, మరికొందరిలో మాత్రం ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. ప్రారంభంలోనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోకపోతే లివర్ సిర్రోసిస్, కాలేయ వైఫల్యం, చివరకు కాలేయ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది.

వైద్యుల సూచనల ప్రకారం హెపటైటిస్ ప్రధానంగా ఐదు రకాలు. వాటి లక్షణాలు, వ్యాప్తి చెందే విధానం వేర్వేరుగా ఉంటాయి.

1. హెపటైటిస్-ఎ (Hepatitis A)..

ఎలా వస్తుంది..?

 ప్రధానంగా కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత లోపించిన ప్రాంతాల్లో దీని ముప్పు ఎక్కువ.

లక్షణాలు..? 

తీవ్రమైన జ్వరం, విపరీతమైన నీరసం, కడుపునొప్పి, వాంతులు, ఆకలి మందగించడం, పచ్చకామెర్లు.

నివారణ ఎలా..? 

వండిన వేడి ఆహారం, సురక్షితమైన నీరు తీసుకోవాలి. పిల్లలకు సకాలంలో టీకా (వ్యాక్సిన్) వేయించడం ద్వారా దీన్ని నివారించవచ్చు.

2. హెపటైటిస్-బి (Hepatitis B)..

ఎలా వస్తుంది..?

 వ్యాధి సోకిన వారి రక్తం ఎక్కించడం, అసురక్షిత శృంగారం, ఒకరు వాడిన సూదులు (సిరంజిలు) మరొకరు వాడటం వల్ల వ్యాపిస్తుంది. అలాగే, ఇన్ఫెక్షన్ ఉన్న గర్భిణుల నుంచి పుట్టబోయే శిశువుకు సంక్రమించే ప్రమాదం ఉంది.

ప్రభావం..

కొందరిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా మారి లివర్ సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఎక్కువ.

నివారణ ఎలా..? 

 హెపటైటిస్-బి బారిన పడకుండా ముందుస్తుగా నివారించేందుకు అత్యంత సమర్థవంతమైన టీకాలు అందుబాటులో ఉన్నాయి.

3. హెపటైటిస్-సి (Hepatitis C)..

ఎలా వస్తుంది..?

 హెపటైటిస్-బి లాగే ఇది కూడా ప్రధానంగా కలుషిత రక్తం ద్వారానే వ్యాపిస్తుంది. ఒకే సిరంజిని పలువురు వాడటం, అసురక్షిత వైద్య పరికరాల వాడకం వల్ల ముప్పు పెరుగుతుంది. స్క్రీనింగ్ పెరిగిన తర్వాత రక్తమార్పిడి ద్వారా వచ్చే ముప్పు తగ్గింది.

ప్రభావం..?

ఈ వ్యాధి సోకిన చాలా మందిలో ఎలాంటి ప్రారంభ లక్షణాలు కనిపించవు. కొన్నేళ్ల పాటు వైరస్ శరీరంలోనే ఉండిపోయి లోపలి నుంచే కాలేయాన్ని దెబ్బతీస్తుంది.

నివారణ ఎలా..? 

 హెపటైటిస్-సి కి ప్రస్తుతం ఎలాంటి టీకా అందుబాటులో లేదు. కాబట్టి సురక్షిత వైద్య విధానాలు పాటించడం ఒక్కటే మార్గం.

4. హెపటైటిస్-డి (Hepatitis D)..

ఎలా వస్తుంది..?

 ఈ వైరస్ స్వతహాగా రాదు. ఇప్పటికే హెపటైటిస్-బి ఇన్ఫెక్షన్ ఉన్నవారిపైనే ఈ వైరస్ దాడి చేస్తుంది. ఈ రెండు కో-ఇన్ఫెక్షన్ కలిస్తే కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

నివారణ ఎలా..? 

 ఇది కూడా రక్తం, శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. హెపటైటిస్-బి కి వ్యాక్సిన్ వేయించుకుంటే, 'డి' వైరస్ నుంచి కూడా ఆటోమేటిక్‌గా రక్షణ పొందవచ్చు.

5. హెపటైటిస్-ఇ (Hepatitis E)..

ఎలా వస్తుంది..? 

హెపటైటిస్-ఎ లాగానే ఇది కూడా కలుషిత జలాలు, అపరిశుభ్రమైన ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో దీని ముప్పు అధికం.

నివారణ ఎలా..? 

 మలవిసర్జన తర్వాత, భోజనానికి ముందు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం, కాచి చల్లార్చిన నీటిని తాగడం ద్వారా ఈ వైరస్‌ను అడ్డుకోవచ్చు.

కాలేయ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. కడుపునొప్పి, ఆకలి లేకపోవడం, కళ్లు/చర్మం పసుపు పచ్చగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అవసరమైన రక్త పరీక్షలు చేయించుకుని, సకాలంలో మందులు వాడితే కాలేయాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. టీకాలతో ఈ మహమ్మారి ముప్పును ముందుగానే అడ్డుకోవచ్చు. 

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.