Protein Maxxing Trend on Social Media : సోషల్ మీడియాలో 'ప్రోటీన్ మ్యాక్సింగ్' ట్రెండ్.. ఇది ఆరోగ్యానికి సురక్షితమేనా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఫిట్‌నెస్, సిక్స్ ప్యాక్, బరువు తగ్గడం.. ఈ రోజుల్లో యువతను అమితంగా ఆకర్షిస్తున్న అంశాలివి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో 'ప్రోటీన్ మ్యాక్సింగ్' (Protein Maxxing) అనే కొత్త డైట్ ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. కండరాలు త్వరగా పెంచుకోవాలనే ఆరాటంలో చాలామంది అవసరానికి మించి ప్రోటీన్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఈ ట్రెండ్ ఫాలో అవ్వడం ఆరోగ్యానికి మంచిదేనా..? దీని వల్ల ఏవైనా నష్టాలు ఉన్నాయా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

అసలేంటి ఈ 'ప్రోటీన్ మ్యాక్సింగ్'..?

కండరాల వృద్ధి కోసం, కడుపు నిండిన భావన కలగడం కోసం, తద్వారా బరువును అదుపులో ఉంచుకోవడం కోసం రోజువారీ ఆహారంలో ప్రోటీన్ మోతాదును అమాంతం పెంచేయడాన్నే 'ప్రోటీన్ మ్యాక్సింగ్' అంటారు. ఇందులో భాగంగా గుడ్లు, చికెన్, చేపలు, పాలు, పెరుగు, పనీర్, పప్పుధాన్యాలు, సోయా, నట్స్‌తో పాటు కృత్రిమ ప్రోటీన్ పౌడర్లను (Whey Protein) వగైరాఎక్కువగా తీసుకుంటుంటారు.

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

 

శరీరానికి ప్రోటీన్ ఎందుకు అవసరం..?

శరీర కణాల నిర్మాణానికి, వాటి మరమ్మతులకు ప్రోటీన్ చాలా ముఖ్యం. కండరాల అభివృద్ధితో పాటు హార్మోన్లు, ఎంజైమ్‌ల ఉత్పత్తికి ఇది అత్యవసరం. సమతుల్య ఆహారంలో ప్రోటీన్ కచ్చితంగా ఉండాలి. రోజూ జిమ్, వెయిట్ లిఫ్టింగ్ లేదా కఠిన వ్యాయామాలు చేసేవారికి సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువ ప్రోటీన్ అవసరం. నిపుణుల అంచనా ప్రకారం, వ్యాయామం చేసేవారు ప్రతి కిలో శరీర బరువుకు 1.4 నుంచి 2.0 గ్రాముల ప్రోటీన్ తీసుకోవచ్చు. ఇలాంటప్పుడు ప్రోటీన్ పెంచడం శరీరానికి మేలు చేస్తుంది.

మోతాదు మించితే జరిగే అనర్థాలు ఇవే..!

ఏదైనా అతిగా తీసుకుంటే అనర్థమే, ప్రోటీన్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. మోతాదుకు మించి తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు తప్పవు. మోతాదుకు మించి ప్రోటీన్ తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణకోశ సమస్యలు (Gastrointestinal issues) తలెత్తుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

 కిడ్నీ సంబంధిత వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ లేదా డైటీషియన్ సలహా లేకుండా 'హై-ప్రోటీన్ డైట్' అస్సలు తీసుకోకూడదు. ఇది మూత్రపిండాలపై తీవ్రమైన భారం మోపుతుంది.

ఈ ట్రెండ్‌లో యువత చేస్తున్న అతిపెద్ద పొరపాటు..

చాలామంది ప్రోటీన్ మ్యాక్సింగ్ పేరుతో కేవలం ప్రోటీన్ మాత్రమే తీసుకుంటూ.. శరీరానికి అత్యవసరమైన కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు (Healthy Fats), ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌ను గాలికొదిలేస్తున్నారు. శరీర సమతుల్యత దెబ్బతినడానికి ఇది ప్రధాన కారణం. అలాగే, కేవలం మాంసం, ప్రోటీన్ పౌడర్ల పైనే ఆధారపడకుండా.. పప్పులు, రాజ్మా, సోయా, పాలు, పనీర్ వంటి విభిన్న రకాల సహజ ఆహారాల ద్వారా ప్రోటీన్ పొందేలా చూసుకోవాలి.

సోషల్ మీడియాలో ఎవరో చేస్తున్నారని కళ్లు మూసుకుని ఏ ట్రెండ్‌నూ గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. మీ శరీర తత్వం, బరువు, శారీరక శ్రమను బట్టి మీకు ఎంత ప్రోటీన్ అవసరమో నిపుణులను అడిగి తెలుసుకోండి. బరువు తగ్గాలన్నా, కండరాలు పెరగాలన్నా సరైన ఆహారంతో పాటు క్రమం తప్పని వ్యాయామం, తగినంత నిద్ర కూడా చాలా అవసరమని మర్చిపోకండి.

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.