Nursing Staff Shortage in Telangana : తెలంగాణాలో నర్సింగ్ సిబ్బంది కొరత.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల ప్రకారం ఎంతమంది ఉండాలి..?
సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్రంలో ఆసుపత్రులు, వైద్య కళాశాలల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అత్యాధునిక పరికరాలతో ఐసీయూలు, డయాలసిస్ కేంద్రాలు విస్తరిస్తున్నాయి. కానీ, ఈ సేవలను రోగులకు చేరువ చేసే నర్సింగ్ సిబ్బంది సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. గడిచిన రెండున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం పది వేల మందికి పైగా నర్సింగ్ ఆఫీసర్లను నియమించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఇంకా దాదాపు 55 వేల మంది నర్సుల అవసరం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది కేవలం కాగితాలపై కనిపించే లోటు కాదు.. ఆసుపత్రికి వెళ్లే ప్రతి రోగికి అందే వైద్య సేవలపై ప్రత్యక్ష ప్రభావం చూపే తీవ్రమైన సమస్య.
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి.. Are You Healthy : ఆరోగ్యం సరైన ట్రాక్‌లోనే ఉందో లేదో ఈ లక్షణాల ద్వారా చెక్ చేసుకోండి.
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
డబ్ల్యూహెచ్‌ఓ (WHO) ప్రమాణాలకు ఆమడదూరంలో..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు కనీసం ముగ్గురు నర్సులు ఉండాలి. కానీ తెలంగాణలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.
ప్రస్తుత జనాభా.. సుమారు 3.9 కోట్లు.. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 60,919 మంది రిజిస్టర్డ్ నర్సులు, మిడ్‌వైఫ్స్ మాత్రమే ఉన్నారు. ప్రతి 1,000 మందికి కేవలం 1.58 మంది నర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అంటే WHO ప్రమాణాలతో పోలిస్తే రాష్ట్రం ఇంకా 47 శాతం వెనుకబడి ఉంది.
55 వేల లోటు.. దేనికి సంకేతం..?
WHO ప్రమాణాల ప్రకారం తెలంగాణలోని ప్రస్తుత జనాభాకు దాదాపు 1.16 లక్షల మంది నర్సులు అవసరం. ప్రస్తుతం ఉన్న వారితో పోలిస్తే సుమారు 55 వేల మంది కొరత ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ 55 వేలు అనేది కేవలం "ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలు" కాదు. రాష్ట్ర జనాభా మొత్తానికి అవసరమైన ఆరోగ్య సంరక్షణ ప్రమాణాల ఆధారంగా అంచనా వేసిన లోటు ఇది. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల వరకే పరిగణనలోకి తీసుకుంటే.. మరో 6,000 నుంచి 7,000 మంది నర్సుల అవసరం ఉందని తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ అంచనా వేస్తోంది.
రోగుల భద్రతపై తీవ్ర ప్రభావం..
వైద్య వృత్తిలో డాక్టర్ ఎంత కీలకమో, నర్సు పాత్ర కూడా అంతే ప్రధానం. నర్సులు అంటే కేవలం వైద్యులకు సహాయకులు మాత్రమే కాదు.
రోగి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి సమయానికి మందులు ఇవ్వడం.
బీపీ, పల్స్ వంటి వైటల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేయడం.
రోగి ఆరోగ్య పరిస్థితిలో వచ్చే మార్పులను నిశితంగా గమనించడం.
అత్యవసర సమయాల్లో తక్షణం స్పందించి ప్రాణాలు నిలపడం.
ఇలాంటి కీలకమైన బాధ్యతలు నిర్వహించే నర్సుల సంఖ్య తగ్గితే.. ఉన్నవారిపై విపరీతమైన పనిభారం పడుతుంది. ఇది నేరుగా రోగుల భద్రత, సేవల నాణ్యత, ఆసుపత్రి నిర్వహణపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ముందున్న సవాళ్లు.. పరిష్కార మార్గాలు..
తెలంగాణ ఆరోగ్య రంగం నాణ్యమైన సేవలు అందించాలంటే ప్రధానంగా రెండు సవాళ్లను అధిగమించాల్సి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్షణ అవసరంగా ఉన్న ఖాళీలను వేగంగా భర్తీ చేయడం. భవిష్యత్తులో కొత్తగా రాబోయే మెడికల్ కాలేజీలు, స్పెషాలిటీ ఆసుపత్రులకు సరిపడా సిబ్బందిని ముందుగానే సిద్ధం చేసుకోవడం.
ఆసుపత్రికి భారీ భవనాలు నిర్మించి, ఖరీదైన యంత్రాలు తెచ్చినంత మాత్రాన వైద్య సేవలు పూర్తి కావు. ఆ యంత్రాలను, సదుపాయాలను సద్వినియోగం చేస్తూ రోగికి సేవలు అందించేది శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బందే. పది వేల నియామకాల తర్వాత కూడా ఇంత భారీ స్థాయిలో అంతరం కనిపించడం.. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థకు ఒక 'వేకప్ కాల్' లాంటిది. భవిష్యత్తులో ఈ అంతరాన్ని తగ్గించడానికి సరైన ప్రణాళికలు రూపొందించడం ఇప్పుడు అత్యవసరం.
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..కాలేయం దెబ్బతింటుందని సూచించే సంకేతాలు ఇవే..
ఇది కూడా చదవండి..హెపటైటిస్ ఏ సమస్య వర్షాకాలంలోనే పెరగడానికి కారణాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
