సర్వైకల్ క్యాన్సర్ కు ఉచితంగా వ్యాక్సిన్..
సాక్షి లైఫ్ : దేశంలో సర్వైకల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో చాలామంది తనువుచాలిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగు తున్నాయి. ఒక నివేదిక ప్రకారం.. భారతదేశంలో ప్రతిఏటా 1లక్ష 20 వేలకుపైగా గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వ్యాధి ప్రతి సంవత్సరం 77 వేల మంది చనిపోతున్నారు. దీంతో మరణాల రేటు దాదాపు 63 శాతానికి చేరుకుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
సర్వైకల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ వ్యాధి నివారణకు కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆడపిల్లలకు ఫ్రీగా టీకాలు వేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి తెలిపారు.
దేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులోకి రానుంది. 9-14 ఏళ్లలోపు బాలికలకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో 9 నుంచి 14 ఏళ్ల వయసు బాలికల సంఖ్య దాదాపు ఎనిమిది కోట్లుగా ఉంది. అందుకోసమే పాఠశాలల్లో టీకాల గురించి ప్రచారం నిర్వహించి సర్వైకల్ క్యాన్సర్ కు అడ్డుకట్టవేసేందుకు కేంద్ర సర్కారు శ్రీకారం చుట్టింది.
ఉచితంగా వ్యాక్సిన్..
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నిరోధించడానికి హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) వ్యాక్సిన్ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఒక్కో వ్యాక్సిన్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ దేశంలోని అందరికీ ఫ్రీగా ఇవ్వాలనే ఆలోచనతో ఉంది కేంద్ర సర్కారు.
ఇది చదవండి.. కొన్నిరకాల పండ్ల మీద స్టిక్కర్స్ ఎందుకు వేస్తారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
