Brain Tumor Risk : దీర్ఘకాల గర్భనిరోధక సాధనాల వాడకంతో మహిళల్లో పెరిగిపోతున్న బ్రెయిన్ ట్యూమర్ ముప్పు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, పర్యావరణ మార్పులతో పాటు అవగాహన లేమితో తీసుకునే కొన్ని రకాల మందులు మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా, వైద్యుల పర్యవేక్షణ లేకుండా గర్భనిరోధక మాత్రలు (Contraceptive Pills), ఇంజెక్షన్లను సుదీర్ఘకాలం పాటు ఉపయోగించడం వల్ల మహిళల్లో 'మెనింగియోమా' (Meningioma) అనే ఒక రకమైన మెదడు కణితి వచ్చే ప్రమాదం పెరుగుతోందని అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

భారతదేశంలో మెదడు కణితుల కేసులు ఏటా వేగంగా విస్తరిస్తున్నాయి. దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 40,000 కొత్త కేసులు వెలుగుచూస్తుండగా, దాదాపు 25,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మహిళల్లో ఈ ముప్పు పెరగడానికి హార్మోన్ల ఆధారిత గర్భనిరోధక సాధనాల మితిమీరిన వాడకం కూడా ఒక కారణమని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏమిటీ మెనింగియోమా..?

మెనింగియోమా అనేది నేరుగా మెదడు లోపల కాకుండా, మెదడు మరియు వెన్నుపామును రక్షించే వెలుపలి పొరలలో (మెనింజెస్) ఏర్పడే కణితి. సాధారణంగా ఇవి క్యాన్సర్ కారకాలు కావు (Benign). అయినప్పటికీ, ఇవి క్రమంగా పెరుగుతూ మెదడులోని ఇతర భాగాలపై ఒత్తిడి తీసుకువస్తాయి. దీనివల్ల నిరంతర తలనొప్పి, మూర్ఛ రావడం, చూపు మందగించడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సకాలంలో గుర్తించకపోతే శస్త్రచికిత్స లేదా రేడియోథెరపీ అవసరమవుతుంది.

అధ్యయనంలో తేలిన షాకింగ్ నిజాలు..!

ప్రముఖ అంతర్జాతీయ వైద్య జర్నల్ 'జామా' (JAMA) నెట్‌వర్క్‌లో ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం.. గర్భనిరోధక మందులు, ఇంజెక్షన్లలో ఉండే కొన్ని రకాల హార్మోన్లు ఈ కణితి ప్రమాదాన్ని పెంచుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. డెన్మార్క్‌కు చెందిన సుమారు 30 లక్షల మంది మహిళల 25 ఏళ్ల వైద్య రికార్డులను పరిశీలించి ఈ ముగింపుకు వచ్చారు.

ఇంజెక్షన్లతో అత్యధిక ముప్పు..

 'మెడ్రాక్సీప్రొజెస్టెరాన్' (Medroxyprogesterone) అనే గర్భనిరోధక ఇంజెక్షన్‌ను దీర్ఘకాలం వాడే మహిళల్లో మెనింగియోమా వచ్చే ప్రమాదం సాధారణ మహిళల కంటే ఏకంగా 355 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.

వయసు పెరిగే కొద్దీ ప్రమాదం ఎక్కువ..

15 నుంచి 19 ఏళ్ల యువతుల్లో ఈ ముప్పు చాలా తక్కువగా ఉండగా.. 55-59 ఏళ్ల వయసు పైబడిన మహిళలు ఈ ఇంజెక్షన్లను ఏడాది కంటే ఎక్కువ కాలం వాడితే కణితులు వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతోందని అంచనా వేశారు.

ఏయే మాత్రలతో ఎంత శాతం ముప్పు..?

ఈస్ట్రోజెన్, ప్రొజెస్టోజెన్ హార్మోన్ల కలయికతో కూడిన కొన్ని రకాల కాంబినేషన్ గర్భనిరోధక మాత్రల వల్ల కూడా ఈ ప్రమాదం పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా డెసోజెస్ట్రెల్ (Desogestrel) హార్మోన్ కలిగిన మాత్రల వాడకంతో అత్యధికంగా 66 శాతం ముప్పు పొంచి ఉంది. దీని తర్వాత వరుసగా సైప్రోటెరోన్ (Cyproterone) వాడకంతో 61 శాతం, డ్రోస్పిరెనోన్ (Drospirenone) వల్ల 58 శాతం, గెస్టోడెన్ (Gestodene) మాత్రల వల్ల 44 శాతం మేర మెనింగియోమా కణితి వచ్చే ప్రమాదం పెరుగుతోంది. అంతేకాకుండా, సాధారణంగా విస్తృతంగా ఉపయోగించే లెవోనోర్జెస్ట్రెల్ (Levonorgestrel) నోరెథిస్టెరోన్ (Norethisterone) హార్మోన్ రకాలతో సైతం వరుసగా 40 శాతం, 38 శాతం మేర ఈ ముప్పు అధికంగా ఉన్నట్లు వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

గర్భనిరోధక సాధనాలు సురక్షితమైనవే అయినప్పటికీ, వాటిని సొంత వైద్యంతో లేదా మెడికల్ షాపుల్లో నేరుగా కొనుగోలు చేసి సంవత్సరాల తరబడి వాడటం అస్సలు మంచిది కాదు. ఏదైనా గర్భనిరోధక పద్ధతిని ఎంచుకునే ముందు తప్పనిసరిగా గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన హార్మోన్ పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలికంగా వీటిని వాడుతున్న మహిళలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ఉత్తమం.

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?

ఇది కూడా చదవండి..కిడ్నీ దానం ఎలాంటి వాళ్లు చేయవచ్చు..?   

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.